యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

ABN , First Publish Date - 2021-10-12T04:41:54+05:30 IST

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు

యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు
ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డు- కాశీబుగ్గ బస్టాండు దారిలో నిర్మాణంలో ఉన్న భవనం, హుద్‌హుద్‌ గృహాల పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నిర్మాణం

- కన్నెతి చూడని అధికారులు

- ఇదీ జంట పట్టణాల్లోని ప్రభుత్వ, వివాదాస్పద స్థలాల్లో పరిస్థితి


- ఈ భవనం సర్వే నెంబరు 207లో ఆర్‌అండ్‌బీ బంగ్లా రోడ్డు- కాశీబుగ్గ బస్టాండు దారిలోఉంది. ప్రభుత్వం, స్థల యజమానులు ఈ స్థలం తమదంటే తమదని కోర్టు మెట్లు ఎక్కారు. సర్వే ప్రకారం ప్రభుత్వ ఆస్తిగా గుర్తించి హద్దులు సైతం వేశారు. ఏళ్లుగా వివాదం వల్ల ఆ స్థలం లో నిర్మాణాలు సాగలేదు. కొత్త మునిసిపల్‌ పాలకవర్గం ఏర్పడిన తర్వాత ఓ కౌన్సిలరును ప్రసన్నం చేసుకొని రాత్రికి రాత్రే నిర్మా ణాలు సాగించారు. ప్రస్తుత ధర ప్రకారం ఇక్కడ మార్కెట్‌ ధర రూ.1.50 కోట్లు పలుకుతుందీ స్థలం.


- హుద్‌హుద్‌ గృహాల పక్కనే ఉన్న ఖాళీ స్థలం ఇది. పక్కాగా ప్రభుత్వ పోరంబోకు భూమిలోఉంది. ఆ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలన్నీ అవే కోవలో ఉన్నాయి. దర్జాగా భవనాలు నిర్మించి పూర్తయిన తర్వాత అమ్మకానికి పెట్టారు. తప్పని అధికారులు వారిస్తున్నా నిర్మాణాలు ఆగలేదు. ఒకరికి కూడా ప్రభుత్వ స్థలాలు ఇచ్చినట్లు దాఖలాలులేవు. రికార్డులో మాత్రం అవి నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ భవనం రూ.30 లక్షల ధర పలుకుతోంది.


పలాస : పలాస-కాశీబుగ్గ జంటపట్టణాల్లో అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ప్రభుత్వ, వివాదాస్పద స్థలాల్లో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారు. భవన నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా, రాజకీయ పలుకుబడి ఉపయోగించి చేపడుతుండడం విశేషం. సామాన్యుడు చిన్నఇల్లు నిర్మిస్తే సచివాలయ ఉద్యోగులు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, రెవెన్యూ సిబ్బంది వాలిపోయి పనులు ఆగమేఘాల మీద నిలిపి వేస్తున్నారు. జంట పట్టణాల్లో ప్రస్తుతం ఎటువంటి అనుమతిలేకుండా నిర్మిస్తున్న భవనాలపై కన్నెత్తి చూడక పోవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. బస్టాండ్‌ ఆవరణలో నిర్మిస్తున్న భవనంపై అనేక అభ్యంతరాలు వ్యక్తమవు తున్నా, యంత్రాంగం అడ్డుకోలేక పోయింది. మునిసిపల్‌ వైస్‌చైర్మన్‌ ఈ వ్యవహారంలో కలుగుజేసుకొని అధికారులకు ప్రశ్నించినా ఎటువంటి సమాధానం లేదు. రూ.కోట్లు విలువైన ప్రభుత్వ ఆస్తులకు రక్షణ లేకపోతే చిన్నచితక స్థలాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన వ్యక్తమవుతోంది. కాగా తక్షణమే సర్వేయర్‌, వీఆర్వోలను పంపించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్‌ ఎల్‌.మధుసూదనరావు ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - 2021-10-12T04:41:54+05:30 IST