పాత సినిమాలు చూస్తూ..

ABN , First Publish Date - 2020-07-01T08:54:21+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి ఇంటికే పరిమితమవడంతో ప్రాక్టీస్‌కు పూర్తిగా దూరమయ్యా. విల్లు చేతపట్టాక ఇన్ని రోజులు సాధనకు దూరంగా...

పాత సినిమాలు చూస్తూ..

ఆర్చరీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో వ్యక్తిగత పతకం సాధించిన తొలి భారత మహిళగా రికార్డు సృష్టించినా..పిన్న వయస్సులో 33 అంతర్జాతీయ మెడల్స్‌ కొల్లగొట్టినా ఆమెకే చెల్లింది. తన ఆపారమైన ప్రతిభతో తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన స్టార్‌ ఆర్చర్‌ వెన్నం జ్యోతి సురేఖ లాక్‌డౌన్‌తో రోజువారి సాధనకు దూరమై 90 రోజులు అవుతుంది. మిగతా రంగాల్లో పనులు మళ్లీ మొదలైనా.. ఆటలు మాత్రం ఇంకా పట్టాలకెక్కలేదు.  ఈ నేపథ్యంలో ఇంటిపట్టునే ఉంటూ కుటుంబ సభ్యులతో విరామ సమయాన్ని ఆస్వాదిస్తోన్న సురేఖతో ఆంధ్రజ్యోతితో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..


లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి ఇంటికే పరిమితమవడంతో ప్రాక్టీస్‌కు పూర్తిగా దూరమయ్యా. విల్లు చేతపట్టాక ఇన్ని రోజులు సాధనకు దూరంగా ఉండడం కెరీర్‌లో ఇదే తొలిసారి. సాధారణంగా ఎప్పుడు ఇంటికి వచ్చినా, వారం రోజులు కంటే ఎక్కువ ఉండను. అలాంటిది కరోనా వల్ల సుదీర్ఘ విరామం లభించింది. దీంతో  పుస్తకాలు చదువుతూ, పాత సినిమాలు చూస్తూ గడుపుతున్నా. అంతేనా.. అమ్మ చేతి వంట తింటూ విరామాన్ని ఆస్వాదిస్తున్నా. ఇప్పుడిప్పుడే అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభమవుతోంది. సొనేపట్‌ (హరియాణా)లోని సాయ్‌ శిక్షణ కేంద్రం తెరుచుకోగానే తిరిగి ప్రాక్టీస్‌ మొదలుపెడతా.


 వారిని చూసి మనసు చలించింది

కొవిడ్‌-19 వైరస్‌ను నియంత్రించడానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించకపోతే అమెరికా, ఇటలీలా మన దేశంలో కూడా భారీగా ప్రాణనష్టం జరిగేది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను సమర్థవంతంగా అమలు చేసి కరోనాను సాధ్యమైనంత వరకు బాగానే కట్టడి చేశాయి. అయితే, వలస కూలీలు పడిన ఇబ్బందులు చూసి మాత్రం నా మనసు చలించింది. ప్రభుత్వ సూచనలు, భౌతిక దూరం పాటిస్తూ వ్యక్తిగత క్రమశిక్షణతో మెలిగితే కరోనాపై పోరాటంలో విజయం సాధించవచ్చు.


యోగాతో ఏకాగ్రత

ఆర్చరీయే కాదు ఏ క్రీడలోనైనా ఒక క్రీడాకారుడు అత్యున్నత స్థితికి చేరాలంటే క్రమశిక్షణ అవసరం. క్రమశిక్షణతో సాధన చేస్తే కొంచెం ఆలస్యమైనా నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆర్చరీ విషయానికొస్తే నా వరకు సాధన చేసేకొద్దీ చేయాలనిపిస్తుంది. రోజులో కనీసం 3 నుంచి 4 గంటలు వరకు ఆర్చరీ రేంజ్‌లో గడుపుతా. ఏకాగ్రత చెదరనంత వరకు ప్రాక్టీస్‌ చేస్తా. ఆర్చరీలో రాణించాలంటే ఏకాగ్రతను పెంపొందించుకోవడం చాలా అవసరం. ఇందుకోసం వేకువజామునే నిద్ర లేచి యోగా చేయడం, శాస్త్రీయ సంగీతం వినడం వంటివి దినచర్యలో భాగం చేసుకున్నా.


రూటు మార్చను

స్విమ్మర్‌గా కెరీర్‌ ప్రారంభించిన నేను ఆ తర్వాత పన్నెండేళ్ల వయస్సులో ఆర్చరీపై ఆసక్తితో రూటు మార్చా. అప్పటి నుంచి ఒక్కోమెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి చేరా. అయితే, ఒలింపిక్స్‌లో కాంపౌండ్‌ ఆర్చరీ ఈవెంట్‌ లేకపోవడంతో రికర్వ్‌ విభాగానికి మారమని చాలామంది సలహా ఇచ్చారు కానీ, నాకు ఆ ఆలోచనే లేదు. కాంపౌండ్‌ ఈవెంట్‌ను కూడా ఒలింపిక్స్‌లో చేర్చేందుకు కొద్దికాలంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి సఫలీకృతమైతే మంచిదే. లేకపోయినా బాధపడను. కాంపౌండ్‌ ఆర్చరీకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. అందులోనూ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మెడల్‌ నెగ్గితే ఒలింపిక్‌ పతకం సొంతం చేసుకున్నట్టేనని ఆర్చర్లు భావిస్తారు. నిరుడు వ్యక్తిగత విభాగంతో పాటు టీమ్‌, మిక్స్‌డ్‌ కేటగిరీల్లో కాంస్య పతకం సాధించా. వచ్చేఏడాది వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పసిడి కొల్లగొట్టాలనే ప్రణాళికతో ముందుకు సాగుతున్నా.

(ఆంధ్రజ్యోతి క్రీడా ప్రతినిధి హైదరాబాద్)

Updated Date - 2020-07-01T08:54:21+05:30 IST