Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనా కష్టాలు అప్పులతో తీరేనా?

కరోనా మహమ్మారితో దాపురించిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు భారీ మొత్తాల్లో రుణాలు తీసుకునే విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోంది. అప్పుల రూపేణా పొందిన ధనాన్ని రెండు భిన్నరీతుల్లో ఉపయోగించుకోవచ్చు. ఆ డబ్బును ఉత్పాదక కార్యకలాపాల్లో మదుపు చేయడం ఒక పద్ధతి. ఆ మదుపు నుంచి లభించే అదనపు ఆదాయంతో వడ్డీ, అసలు మొత్తాన్ని రుణగ్రహీత చెల్లించగలుగుతాడు. పారిశ్రామికవేత్త బ్యాంకుల నుంచి రుణం తీసుకుని ఒక ఫ్యాక్టరీని నెలకొల్పడం లాంటిదే ఇది కూడా. ఆ ఫ్యాక్టరీ సమకూర్చే అదనపు ఆదాయంతో ఆ పారిశ్రామికవేత్త బ్యాంకులకు వడ్డీ, అసలు చెల్లిస్తాడు. 


ఈ మదుపు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఆ ధనాన్ని, ఆదాయ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు ఉపయోగించుకోవచ్చు. ఈ పద్ధతిలో రుణగ్రహీతకు అదనపు ఆదాయాలేవీ సమకూరవు. ఫలితంగా వడ్డీని, ఇప్పటికే చాలీచాలకుండా ఉన్న ఆదాయం నుంచే చెల్లించవలసివస్తుంది. ఉద్యోగం కోల్పోయిన ఒక మహిళా ఉద్యోగి విషయాన్ని చూద్దాం. ఆమె తన కుటుంబ నిర్వహణకు అప్పు చేస్తుంది. కొద్ది నెలల అనంతరం ఆమె అదే ఉద్యోగంలో అదే వేతనంతో చేరే అవకాశం లభిస్తుంది. అయితే ఇప్పుడు ఆమె తనకు ఉద్యోగం లేనికాలంలో చేసిన అప్పుపై వడ్డీని ఇంతకు ముందున్న ఆదాయం నుంచే చెల్లించవలసి ఉంటుంది. దీంతో అనివార్యంగా ఆమె జీవనప్రమాణాలు పడిపోతాయి. ఆదాయంలో పెరుగుదల లేకపోవడంతో పాటు అదనంగా వడ్డీ చెల్లించవలసిరావడమే ఆమె కష్టాలకు కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


మన ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు ఉద్యోగం కోల్పోయిన కాలంలో ఆ మహిళా ఉద్యోగి తీసుకున్న రుణం లాంటివే. కొత్త మదుపుల కోసం కాకుండా, ప్రభుత్వ వినియోగాన్ని ఒడుదుడుకులు లేకుండా నిర్వహించేందుకే మన పాలకులు రుణాలు తీసుకుంటున్నారు. ఈ విధానం దీర్ఘకాలంలో పలు సమస్యలకు దారితీస్తుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. రుణాల ద్వారా సమకూర్చుకున్న ధనాన్ని అమెరికా, చైనా భిన్నవిధాలుగా వినియోగించుకుంటున్నాయి. అమెరికా, ఆ ధనాన్ని నేరుగా తన పౌరులకు బదిలీ చేసి వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంపొందిస్తోంది. అలాగే కొత్త సాంకేతికతల అభివృద్ధికి కూడా భారీగా వినియోగిస్తోంది. అదే విధంగా చైనా కూడా రుణాల రూపేణా సమకూర్చుకున్న ధనాన్ని అంతరిక్ష పరిశోధనా కార్యక్రమాలకు లేదా సొంత ఫైటర్ జెట్స్ తయారీకి వినియోగిస్తోంది. చెప్పవచ్చిందేమిటంటే అమెరికా, చైనా తీసుకుంటున్న రుణాలు పారిశ్రామికవేత్త తీసుకుంటున్న రుణాలవంటివి కాగా మన ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు ఉద్యోగం కోల్పోయిన ఉద్యోగిని తీసుకున్న రుణం లాంటివి!


2021 ఏప్రిల్‌లో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.41 లక్షల కోట్లు. ఈ వసూళ్లు 2021 మార్చిలో రూ.1.23 లక్షల కోట్లు కాగా గత రెండు సంవత్సరాలుగా నెలకు రూ.1.0 లక్ష కోట్లుగా ఉన్నాయి. తమ ఆర్థిక భవిష్యత్తు సానుకూలంగా ఉంటుందని మెక్ కిన్సే సంస్థ 2021 జనవరిలో మన దేశంలో నిర్వహించిన ఒక సర్వేలో 86 శాతం మంది అభిప్రాయ పడ్డారు. అయితే 2021 ఏప్రిల్‌లో అదే సంస్థ నిర్వహించిన సర్వేలో కేవలం 64 శాతం మంది మాత్రమే తమ ఆర్థిక భవిష్యత్తు సానుకూలంగా ఉండగలదని భావించారు. ‘పర్చేజ్ మేనేజర్స్ ఇండెక్స్’ (పిఎం‌ఐ) పడిపోయినట్టు ఒక పరిశోధనా పత్రం వెల్లడించింది. ఆర్థిక భవిష్యత్తుపై వ్యాపార సంస్థల పర్చేజ్ మేనేజర్లు సానుకూల దృక్పథం కలిగి ఉన్నారనడానికి 50+ పిఎంఐ సూచన కాగా, 50- పిఎంఐ అనేది వారి ప్రతికూల దృక్పథానికి సూచన. 2021 మార్చిలో 34.6 నుంచి 2021 ఏప్రిల్‌లో 54.0కి పిఎంఐ పడిపోయినట్టు ఒక సర్వే వెల్లడించింది. 


2021 మార్చిలో కంటే 2021 ఏప్రిల్‌లో పెట్రోల్ వినియోగం 6.3 శాతం, డీజిల్ వినియోగం 1.7 శాతం, కార్ల విక్రయాలు 7 శాతం, అంతర్-రాష్ట్ర ఈ–వే బిల్లుల జారీ 17 శాతం మేరకు తగ్గిపోయాయి. అంటే మార్చితో పోల్చినప్పుడు ఏప్రిల్‌లో మౌలిక సూచికలు అన్నీ అధోముఖంగా ఉన్నాయి. మరి ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్ల పెరుగుదలలో మర్మమేమిటి? జీఎస్టీ వసూళ్ల సమాచారాన్ని ఘనంగా చూపేందుకు ప్రభుత్వరంగ సంస్థలన్నీ ముందస్తుగా వస్తుసేవల పన్నును చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించి ఉండవచ్చని నేను భావిస్తున్నాను. 


ఈ విషమ పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ కింద పేర్కొన్న చర్యలను తప్పనిసరిగా చేపట్టాలి. చమురు దిగుమతులపై సుంకాన్ని భారీగా పెంచాలి. పెట్రోల్ ధర లీటర్ రూ.150 ఉండేలా చమురు దిగుమతి సుంకాలను నాలుగు రెట్లు పెంచాలని నేను గట్టిగా సూచిస్తున్నాను. అలాగే డీజిల్ ధరలో కూడా భారీ పెరుగుదల అవశ్యం. ఈ ధరల పెరుగుదల వల్ల పెట్రోలియం ఉత్పత్తుల వినియోగం గణనీయంగా తగ్గుతుంది. చమురు ధరల పెరుగుదలతో సమకూరే ఆదాయాన్ని రుణభారాన్ని తగ్గించుకునేందుకు వినియోగించుకోవాలి. తద్వారా మూడో దశ, నాలుగో దశ కొవిడ్ విపత్తును సమర్థంగా ఎదుర్కొనే వెసులుబాటు మనకు లభిస్తుంది.


ప్రభుత్వ వినియోగాన్ని గణనీయంగా తగ్గించితీరాలి. విధిగా చేపట్టాల్సిన రెండో చర్య ఇది. కొవిడ్ పై పోరులో పాల్గొంటున్న ‘ఫ్రంట్ లైన్ వర్కర్స్’ మినహా మిగతా ప్రభుత్వోద్యోగుల వేతన భత్యాలను పేద ప్రజల ఆదాయాల తగ్గుదలకు అనుగుణంగా, సగానికి తగ్గించాలి. ఇక మూడో చర్య- అధునాతన సాంకేతికతల అభివృద్ధికి నిధులు భారీగా కేటాయించాలి. ప్రపంచానికి వాక్సిన్ల సరఫరాదారుగా సుప్రసిద్ధమైన దేశం తన సొంతప్రజల కోసం టీకాలను దిగుమతి చేసుకోవలసిరావడం సిగ్గుచేటు కాదూ?

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే మరిన్ని...