కౌన్సిల్‌ సభ్యులు బొమ్మలా?

ABN , First Publish Date - 2021-12-01T05:37:01+05:30 IST

మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ఏకపక్షంగా నిర్ణయిస్తూ, కౌన్సిల్‌ సభ్యులను బొమ్మలుగా వాడుకుంటున్నారని పాలకవర్గంపై స్వపక్ష మహిళా కౌన్సిలర్‌ ప్రభావతి విరుచుకుపడ్డారు.

కౌన్సిల్‌ సభ్యులు బొమ్మలా?
కౌన్సిల్‌ సమావేశానికి హాజరైన సభ్యులు, అధికారులు

ఏకపక్ష నిర్ణయాలతో అభివృద్ధికి ఆటంకం 

పాలకవర్గంపై విరుచుకుపడ్డ స్వపక్ష మహిళా కౌన్సిలర్‌ 

కళ్యాణదుర్గం, నవంబరు30: మున్సిపాలిటీలో అభివృద్ధి పనులను ఏకపక్షంగా నిర్ణయిస్తూ, కౌన్సిల్‌ సభ్యులను బొమ్మలుగా వాడుకుంటున్నారని పాలకవర్గంపై స్వపక్ష మహిళా కౌన్సిలర్‌ ప్రభావతి విరుచుకుపడ్డారు. మంగళవారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో చైర్మన రాజ్‌కుమార్‌ అధ్యక్షతన కౌన్సిల్‌ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. కమిషనర్‌ వెంకటేశులు, వైస్‌చైర్మన్లు జయం ఫణి, తిమ్మప్ప, సభ్యులు, అధికారులు హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో ఎజెండా అంశాల చర్చ సందర్భంగా వైసీపీ కౌన్సిలర్‌ ప్రభావతి అడ్డుతగిలారు. కాంట్రాక్ట్‌ ఉద్యోగాలు, డ్రైనేజీలు, సీసీ రోడ్డుపనుల నివేదికలు ఇష్టారాజ్యంగా తయారుచేస్తూ, సభ్యులను బొమ్మలుగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అభివృద్ధి పనులు ఏప్రాంతంలో కేటాయిస్తున్నారు, వాటి టెండర్‌ విధానం, వీధిదీపాల ఏర్పాటు తదితర అంశాలను బహిర్గతం చేయాలని ఆమె డిమాండ్‌ చేశారు. డీఈ హేమచంద్ర వ్యవహారశైలి సక్రమంగా లేదని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపాదనలు చేయకుండానే కాంట్రాక్ట్‌ కార్మికుల నియామకాలు ఎలా చేశారని నిలదీశారు. భవిష్యత్తులో పాలకులు, అధికారులు సమష్టిగా చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. కాగా పాలకపక్షం తీరుపట్ల స్వపక్ష కౌన్సిలర్‌ దుమ్మెత్తి పోయడంతో అధికారులు అవాక్కయ్యారు. ఒకదశలో డీఈ హేమచంద్ర, ఏఈ రాజేంద్రప్రసాద్‌ మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. ఏఈని సరెండర్‌ చేయాలని ఎజెండాలో పొందుపరచడం దుమారానికి దారితీసింది. నిజాయితీగా పనిచేస్తున్న ఏఈని ఎందుకు సరెండర్‌ చేయాలని కౌన్సిలర్‌ ప్రభావతి డీఈని ప్రశ్నించారు. సమావేశం ఆద్యంతం స్వపక్ష కౌన్సిలర్లే అధికారులు, పాలకుల తీరును తప్పుబట్టారు. అనంతరం ఎజెండా అంశాలను మొక్కుబడిగా సభ దృష్టికి తీసుకువచ్చి ఆమోదించారు. సమావేశంలో కౌన్సిలర్లు ఒంటిమిద్ది డీవీ సురేష్‌, అనసూయమ్మ, అర్చన, రాధికారాణి, రాజేశ్వరి, అబ్రహం, కోఆప్షన సభ్యుడు అబ్జల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-12-01T05:37:01+05:30 IST