Abn logo
Sep 22 2020 @ 01:14AM

రుణాలే స్వావలంబన మార్గమా?

పాలనాయంత్రాంగంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఆత్మనిర్భర్ భారత్ విజయవంత మవుతుంది. కేవలం రుణసదుపాయం కల్పించడం మాత్రమే ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు దోహదం చేయదు. పైపెచ్చు ఆ రుణాలతో ఆర్థికవ్యవస్థ ఆరోగ్యం మరింతగా క్షీణించిపోయే ప్రమాదం ఉంది.


ప్రపంచవ్యాప్తంగా చైనా పట్ల వ్యతిరేకత పెరిగిపోతోంది. పలు దేశాలు చైనాను నియంత్రించేందుకు ప్రతిచర్యలు చేపడుతున్నాయి. అంతర్జాతీయ వ్యవహారాలలో నేడు ఇది ఒక ప్రబల పరిణామంగా ఉన్నది. బహుళజాతి కంపెనీలు చైనా నుంచి నిష్క్రమిస్తున్నాయి. చైనా నుంచి సరుకులను దిగుమతి చేసుకునేందుకు అనేక దేశాలు విముఖత చూపుతున్నాయి. మన విదేశీ వాణిజ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇదొక సదవకాశం. అయితే థాయిలాండ్, వియత్నాంలతో పోటీ పడలేకపోతే మనం ఈ మంచి అవకాశాన్ని కోల్పోవలసివస్తుంది. భారత్ నుంచి ఖరీదైన సరుకులకు బదులుగా థాయిలాండ్ నుంచి చౌక వస్తువులు దిగుమతి చేసుకోవడానికే జర్మనీ మొగ్గు చూపగలదు. ప్రపంచంలో ఇతర దేశాలన్నింటికంటే చౌకగా వస్తువులు ఉత్పత్తి చేయగలగడమే ఇప్పుడు మనముందున్న సవాల్.


పరిశ్రమలకు రుణాలు సమకూర్చేందుకు గాను రూ.200లక్షల కోట్ల ఆత్మ నిర్భర్ ప్యాకేజీని ఉద్దేశించారు. మార్కెట్‌లో డిమాండ్ ఉంటే ఈ రుణాలు ప్రయోజనకర ఫలితాలనిస్తాయి. పారిశ్రామిక వేత్తలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఫ్యాక్టరీల నేర్పాటు చేసి, సరుకులను తయారుచేసి, మార్కెట్‌లో విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్ లేదు. ఈ పరిస్థితిలో మరిన్ని రుణాలు, రుణగ్రహీతలను రుణగ్రస్తతలోకి, చిక్కుల్లోకి నెడతాయి. వడ్డీ భారం పెరిగిపోతుంది. మార్కెట్‌లో గట్టి డిమాండ్ కొరవడిన పరిస్థితిలో ఉత్పత్తిదారులు తమ సరుకులను విక్రయించలేరు. బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించలేరు. ఏ ఫలితాలకు ఆత్మనిర్భర్ ప్యాకేజీని ఉద్దేశించారో ఆ ఫలితాలు సమకూరవు. 


మన కార్మికుల ఉత్పాదక సామర్థ్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ ప్రొఫెసర్ ఎ.కె. గులాటీ నొక్కి చెప్పారు. కార్మికుల ఉత్పాదక సామర్థ్యం మెరుగ్గా లేకపోవడం మన ఆర్థికవ్యవస్థ సమస్యలలో ఒకటని ఆయన విశ్వస్తున్నారు. చైనీస్ కార్మికులు ఉత్పత్తి చేసే సరుకులలో సగాన్ని మాత్రమే మన కార్మికులు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. ఒక చైనీస్ కార్మికుడు ఒక పని దినంలో పది ఫుట్ బాల్స్‌ను ఉత్పత్తి చేయగలిగితే మన కార్మికుడు 5 ఫుట్‌బాల్స్‌ను మా ఆత్రమే ఉత్పత్తి చేయగలుగుతున్నాడు. ఉత్పాదకత పెరిగితే మనం ఉత్పత్తి చేసే ఫుట్‌బాల్స్ ధర తగ్గుతుంది; మన ఎగుమతులను పెంచుకోగలుగుతాం. అప్పుడు మనం థాయిలాండ్‌తో పోటీపడగలుగుతాం. సమర్థంగా పోటీ పడేందుకు రెండు ప్రతిబంధకాలు ఉన్నాయి. ఒకటి- ఉత్పాదకత సామర్థ్యం కేవలం ఒక రోజులో మెరుగుపడదు. అదొక సుదీర్ఘ ప్రక్రియ. అందుకు కార్మిక చట్టాలను సంస్కరించవలసిఉంది; అధునాతన యంత్రాలను నెలకొల్పకోవాలి. యాజమాన్య నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ఇది కేవలం ఒక రోజులో కాదుకదా ఒక నెలలో కూడా సైతం సాధ్యమవదు. హీనపక్షం ఒక ఏడాది పడుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పట్లో కోలుకునే అవకాశం ఎంతమాత్రం లేకపోవడం రెండో ప్రతిబంధకం. ముడిపదార్థాల ధర, తయారైన సరుకుల ధర థాయిలాండ్‌లో ఎంతో మన దేశంలోనూ అంతేనన్న విషయాన్ని మనం గుర్తించి తీరాలి. ఈ ధరల్ని నేడు ప్రపంచమార్కెట్ నిర్ణయిస్తోంది. మరి మనం థాయిలాండ్ ఎంత ధరకు తయారుచేస్తోందో అదే ధరకు ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నాం?


ఇక్కడ మనం ‘ఫెడరేషన్ ఆఫ్ ఫార్మా ఆంత్రప్రెన్యూర్స్’ అధ్యక్షుడు బి.ఆర్ సిక్రి మాటలను ఆలకించాలి. భారతీయ ఫార్మా పరిశ్రమ తనకు అవసరమైన ముడిపదార్థాలను చైనా నుంచి సమకూర్చుకోవడానికి ప్రధాన కారణం భారత్‌లో ఉత్పత్తి వ్యయం అధికంగా ఉండడమేనని సిక్రీ అన్నారు. పరిశ్రమ స్థాపన, నిర్వహణకు అవసరమైన వివిధ అనుమతులు శీఘ్రగతిన రాకపోవడం, భూమి, విద్యుత్ మొదలైన సదుపాయాలు చౌకగా లభించకపోవడం వంటి ఈ పరిస్థితికి కారణమని ఆయన పేర్కొన్నారు. 


ఉద్యోగిస్వామ్యమే (బ్యూరోక్రసీ) ఈ ప్రతిబంధకాలకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. రెగ్యులేటరీ అప్రూవల్ లేదా పర్యావరణపరమైన అనుమతులు లభించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ప్రతి దశలోనూ ప్రభుత్వ అధికారులు కోరినంత ముడుపులు చెల్లించవలసిరావడమే ఈ ఆలస్యానికి దారితీస్తోంది. మన దేశంలో విద్యుత్ ధర చాలా ఎక్కువగా ఉంటోంది. విద్యుత్ బోర్డ్ అధికారులు విద్యుత్‌ను విక్రయించడంలో పారదర్శకంగా వ్యవహరించకపోవడమే అందుకు ప్రధాన కారణం. విద్యుత్ అధికారుల సహకారంతో విద్యుత్ బిల్లులను తక్కువగా వేయించుకునే పారిశ్రామికవేత్తలు పలువురు నాకు తెలుసు. వారి జాబితా కొండవీటి చాంతాడు లాంటిది. ఈ అక్రమాలను నివారించడమెలా? విద్యుత్ శాఖ పనితీరు గురించి విద్యుత్ వినియోగదారుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఒక రహస్య సర్వే నిర్వహించాలి. ఉదాహరణకు రాష్ట్ర విద్యుత్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తన విధులు నిర్వర్తిస్తున్న తీరుతెన్నుల గురించి అతడి డివిజన్ పరిధిలోని వినియోగదారుల అంచనా ఏమిటో రహస్య సర్వే ద్వారా తెలుసుకోవాలి. వినియోగదారులలో పదిశాతం మంది మాత్రమే అతడి పనితీరు గురించి సంతృప్తిగా ఉంటే ఆ అధికారితో తక్షణమే ఉద్యోగ విరమణ చేయించాలి. 


ప్రభుత్వాధికారులు తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తున్నారా లేక స్వార్థప్రయోజనాలకు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారా అన్న విషయాన్ని రాజు తన గూఢచారుల ద్వారా నిర్ధారించుకోవాలని కౌటిల్యుడి అర్థశాస్త్రం నిర్దేశించింది. ఆ గూఢచారులపై కూడా వేగులను నియోగించాలని, తద్వారా తొలి నిఘా బాధ్యతలు నిర్వర్తించే గూఢచారులు ప్రలోభాలకు లొంగిపోవడాన్ని అరికట్టాలని కౌటిల్యుడి సూచించాడు. మరి కౌటిల్యుని విజ్ఞతకు మనం ఇస్తున్న విలువ ఏమిటి? స్వతంత్ర భారత దేశ ప్రభుత్వాలు ఆ సుపరిపాలనా పథ నిర్దేశకుడి సలహాను అనుసరించడానికి బదులు తమ ఉద్యోగ బృందాలను సదా నెత్తినపెట్టుకుంటున్నాయి. దేశ ఆర్థికవ్యవస్థకు భారమయ్యే విధంగా వారి వేతనభత్యాలను పెంచుతున్నాయి. అయితే అవినీతికి పాల్పడుతున్న ఉద్యోగులను కనిపెట్టి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం లేదు. ఈ కారణంగానే భారతీయ ఫార్మా పారిశ్రామికరంగం చైనా నుంచి దిగుమతులు చేసుకోవలసివస్తోందని సిక్రీ చెప్పారు. 


స్వయంసమృద్ధ ఆర్థికవ్యవస్థను సాధించేందుకు ఏం చేయాలి? ప్రభుత్వోద్యోగులు అవినీతికి పాల్పడకుండా తమ విధులు సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ఠచర్యలు చేపట్టడం చాలా ముఖ్యం. అదే సమయంలో వినియోగ వస్తువులపై దిగుమతి సుంకాలను ఇతోధికంగా పెంచాలి. మన కార్మికుల ఉత్పాదకత సామర్థ్యం గణనీయంగా మెరుగుపడేంతవరకు, బ్యూరోక్రసిని ప్రయోజనకరంగా సంస్కరించేంత వరకు అధిక సుంకాల అమలును కొనసాగించడం అత్యంత ముఖ్యం. పాలనా యంత్రాంగంలో అవినీతిని నియంత్రించేందుకు ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టినప్పుడు మాత్రమే ఆత్మనిర్భర్ భారత్ విజయవంత మవుతుంది. కేవలం రుణ సదుపాయం కల్పించడం మాత్రమే ఆర్థికవ్యవస్థ పునరుద్ధరణకు దోహదం చేయదు. పైపెచ్చు ఆ రుణాలతో ఆర్థికవ్యవస్థ ఆరోగ్యం మరింతగా క్షీణించిపోయే ప్రమాదముంది.

భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Advertisement
Advertisement

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేమరిన్ని...

Advertisement