ఫీజుల నియంత్రణ అమలయ్యేనా?

ABN , First Publish Date - 2021-09-08T05:45:05+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 24న అన్‌–-ఎయిడెడ్‌ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలలో వసూలు చేయదగిన ఫీజుల గరిష్ఠ పరిమితి గురించి రెండు ఆదేశాలు (జిఓ 53, జిఓ54) జారీ చేసింది....

ఫీజుల నియంత్రణ అమలయ్యేనా?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత నెల 24న అన్‌–ఎయిడెడ్‌ ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలలో వసూలు చేయదగిన ఫీజుల గరిష్ఠ పరిమితి గురించి రెండు ఆదేశాలు (జిఓ 53, జిఓ54) జారీ చేసింది. అమితంగా పెరుగుతున్న ఫీజులను భరించలేని తల్లిదండ్రులకు ఈ జి.ఓ.లు కొత్త ఆశలు కలిగిస్తున్నాయి. పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రభుత్వం వేరువేరుగా నిర్దేశించిన ఫీజులు దాదాపు హేతుబద్ధంగా ఉన్నాయి. ఫీజుల గరిష్ఠ పరిమితుల పట్ల ప్రైవేటు యాజమాన్యాల అసంతృప్తి చెందడం ఆశ్చర్యకరం కానే కాదు. అయితే వందల కోట్ల వ్యాపారం జరుగుతున్న ఈ రంగంలో ప్రభుత్వాదేశాలు ఎంతమేరకు అమలుజరుగుతాయి అనేది నిజంగానే బిలియన్‌ డాలర్ల సమస్య. ప్రభుత్వం తన యంత్రాంగంతో ఈ ఆదేశాలను అమలు చేయగలదా? యాజమాన్యాలను నియంత్రించడంలో సంరక్షకులకు, ఉపాధ్యాయులకు సదరు ఆదేశాలు ఎంత భాగస్వామ్యం కల్పించాయి అనే విషయాలను కూడ పరిశీలించాలి. ఇంకా ప్రధానంగా ఈ జిఓలు విద్యా వ్యాపారాన్ని నియంత్రిస్తాయా లేక విస్తరిస్తాయా అన్నది మనముందున్న ప్రశ్న.


ఈ సందర్భంగా విద్యావ్యాపారం గురించి సుప్రీంకోర్టు మునుపు ఏ ఏ తీర్పులు ఇచ్చింది కూడా గమనించాలి. ‘ప్రైవేట్ వ్యక్తులు విద్యాసంస్థలు స్థాపించి, నిర్వహించడంలో అభ్యంతరకరమైనది ఏదీ లేదు. అయితే ప్రజలకు విద్య అందించడం ప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగబద్ధమైన బాధ్యత కనుక ప్రైవేటువ్యక్తులు లేదా సంస్థలు విద్యనందించే సందర్భంలో తాము ప్రభుత్వం బాధ్యతను నెరవేరుస్తున్నామని గ్రహించాలి. ప్రభుత్వం తన విద్యాసంస్థలలో ఏ ఏ కోర్సులకు ఎంత ఫీజులు వసూలు చేస్తుందో అంతకంటే అధికంగా ప్రైవేటు సంస్థలు వసూలు చేయకూడదని 1992 నాటి మోహినీ జైన్‌ కేసులో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు జస్టిస్‌ కుల్దీప్‌సింగ్‌ స్పష్టం చేశారు. విద్యనందించే సందర్భంలో ప్రైవేట్ సంస్థ, రాజ్యవ్యవస్థ పరికరమని ఆయన విశ్లేషించారు. స్టేట్‌ ఇన్‌స్ట్రుమెంటాలిటీ అన్న భావనకు ఆయన అగ్ర ప్రాధాన్యమిచ్చారు. ఈ తీర్పు ప్రకారం ఉచితంగా విద్య అందించదలచుకున్న దాతృత్వ సంస్థలు మాత్రమే పాఠశాలలు స్థాపించి నిర్వహించాలి. ఈ తీర్పు అమలు జరిగి ఉంటే విద్యావ్యాపారమే రద్దయ్యేది.


‘ఉన్నిక్రిష్ణన్‌ వర్సస్ ఆంధ్రప్రదేశ్‌’ కేసులో సుప్రీంకోర్టు విద్యావ్యాపారం వైపు ఒక అడుగు వేసి ‘ప్రైవేటు యాజమాన్యాలు ఆయా కోర్సులకు ప్రభుత్వ సంస్థల కంటే ఎక్కువ ఫీజులు వసూలు చేయవచ్చని పేర్కొంది. అయితే విద్యతో వ్యాపారం చేయకూడదని, విద్యాసంస్థను లాభనష్టాలు లేని సంస్థగా నిర్వహించాలని, వివిధ వ్యయాల మేరకు సంస్థలు విద్యార్ధుల నుంచి ఫీజులు వసూలు చేయవచ్చని, అంతర్గత సబ్సిడీ అమలు చేయడం ద్వారా ప్రతిభ కలిగిన పేద విద్యార్థుల హక్కులకు భద్రత కల్పించాలని’ తీర్పు ఇచ్చింది. ఆ తదుపరి టిఎంఎ పాయ్‌ కేసులో సుప్రీంకోర్టు విద్యావ్యాపారం వైపు మరొక అడుగు వేసి క్రాస్‌ సబ్సిడీ ప్రయోజనకరం కాదని, ప్రైవేట్ యాజమాన్యాలు లాభాలు పొందవచ్చని పేర్కొంది. ఆ లాభాలను సంస్థ అభివృద్ధికి మాత్రమే ఖర్చు చేయాలని విద్యతో వ్యాపారం చేయకూడదని కూడ నిర్దేశించింది. లాభాన్ని ఇతర ప్రయోజనాలకు వినియోగించుకోవడానికి వీలు లేదని తేల్చిచెప్పింది. ఆ కారణంగానే ఆదానీలు, అంబానీలు, ఇంకా ప్రధానంగా విదేశీ కార్పొరేటుసంస్థలు ఇప్పటికీ విద్యారంగంలోకి దిగలేదు. ఒక సంస్థను తాము కోరినప్పుడు మూసివేయడానికి (పెట్టుబడులు ఉపసంహరించడానికి), కనీసం లాభాలను ఉపసంహరించడానికి అవకాశం లేకపోవడం వల్లనే బడా కార్పొరేటు సంస్థలు ఈ రంగానికి దూరంగా ఉన్నాయి. చట్టబద్ధంగా అవకాశం లేకపోయినా పలు ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు ఒక సంస్థలో వచ్చిన లాభాలను మరొక విద్యాసంస్థ స్థాపించడానికి ఉపయోగిస్తున్నాయి. ఈ విషయాలను ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించవలసి వస్తున్నదంటే, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 53, 54 జీఓలు ఒక విద్యాసంస్థలో మిగులుతో మరొక విద్యా సంస్థ స్థాపనకు అవకాశం కల్పిస్తున్నాయి. అంటే యాజమాన్యం తన వ్యాపారాన్ని పెంపొందించుకోవడానికి విద్యార్థులు అదనపు ఫీజులు చెల్లించాలన్న మాట. ఇది విద్యావ్యాపారీకరణ, కార్పొరేటీకరణకు అనుకూలమైన నిబంధన. ప్రభుత్వం నిజంగా ప్రైవేటురంగాన్ని హేతుబద్ధంగా నియంత్రించ దలచుకుంటే ఒక పాఠశాలలలో లేదా కళాశాలలో మిగిలిన నిధులు ఆ పాఠశాలకు లేదా కళాశాలకు మాత్రమే ఖర్చు చేయాలనే నిబంధన పెట్టాలి. నిజానికి ఇటువంటి నిబంధన ఆంధ్రప్రదేశ్‌ విద్యాచట్టం 1982ను అనుసరించి 1994లో జారీ చేసిన జీఓలో ఉంది. అయితే అది ఏనాడూ అమలు కాలేదు. 


వ్యాపారాన్ని విస్తరించడానికి కాక బ్రతుకుతెరువు కోసం విద్యాసంస్థలు పెట్టుకున్నవారు కూడా ఎందరో ఉన్నారు. వారికీ కొంత ఆదాయం అవసరం. అది కూడా విద్యార్ధుల ఫీజుల నుంచే రావాలి. ప్రాథమిక హక్కు 19 (1)(జి)ని ఉటంకిస్తూ కోర్టులు దీనికి అనుకూలంగా తీర్పులు ఇచ్చాయి. ఆ తీర్పులపై కొద్దిమంది సీనియర్‌ న్యాయమూర్తులు తీవ్రమైన విమర్శలు కూడా చేశారు. అదలా ఉంచితే 1994 నాటి జీఓ కూడ యాజమాన్యాల పరిమిత ఆదాయానికి వ్యతిరేకంగా లేదు. దాని ప్రకారం ఫీజుల రూపంలో వచ్చే ఆదాయంలో 50 శాతాన్ని ఉపాధ్యాయులకు జీతం కోసం, 15 శాతాన్ని వారి పదవీవిరమణ అనంతర ప్రయోజనాల కోసం చెల్లించాలి. విద్యాసంస్థ నిర్వహణకు 15శాతం, అభివృద్థికి 15 శాతం ఖర్చుచేయాలి. మిగిలిన 5 శాతం యాజమాన్యం తన ఆదాయంగా తీసుకోవచ్చు. ప్రభుత్వం ప్రస్తుతం విడుదల చేసిన జీఓలలో కూడా సుమారు ఈ విధంగానే కేటాయించారు. కానీ, పాఠశాల అభివృద్ధి, యాజమాన్య ఆదాయం అనే రెండు పద్దులను కలిపి 20 శాతం పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేయాలని నిర్దేశించారు. ఈ విధంగా కలగలపడం వల్ల నియంత్రణ మరింత కష్టంగా మారే అవకాశం ఉంది.


నిజానికి విద్య ఒక సామాజిక ప్రక్రియ, ఒక చారిత్రక ప్రక్రియ. ప్రతి తరం తన ముందరి తరం నుంచి పొందిన ఙ్ఞానసంపత్తిని మరింతగా అభివృద్ధి పరచి తరువాత తరానికి సృజనాత్మకంగా అందించడమే విద్యావ్యాసంగం. వైవిధ్యాలను ప్రజాస్వామికీకరించి, వ్యత్యాసాలను పరిష్కరించే క్రియాశీల విద్యావ్యాసాంగం వ్యాపార మాధ్యమంలో పొసగదు. విద్య ప్రభుత్వ నిధులతో సాగాలి. ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించబడాలి. దాతృత్వసంస్థలు ఉచితంగా విద్య అందించడానికి ముందుకు వచ్చిన సందర్భంలో మాత్రమే ప్రైవేటు విద్యకు అవకాశం ఉండాలి. మార్కెట్‌లో దొరికే సరుకుగా విద్య దిగజారినప్పుడు అది దాని సమాజ పునర్వ్యవస్థీకరణ శక్తినే కోల్పోతుంది. అసలు విద్యావ్యాపారం వల్ల బోధనా ప్రక్రియ పూర్తిగా వికృతమయిపోయింది. మాతృభాషలు అటకెక్కాయి. టీచరు పోలీసుగా, తల్లి టీచరుగా మారిపోయిన తరువాత బాల్యం ఎంత మిగులుతుంది? బాల్య సౌరభవాన్ని కోల్పోయిన భవిష్యత్‌ తరం ఎటువంటి సమాజాన్ని నిర్మిస్తుంది? విద్యావ్యాపారం రద్దు, కామన్‌ పాఠశాలల స్థాపన మాత్రమే మనముందున్న పరిష్కారం.

రమేష్‌ పట్నాయక్‌

కన్వీనర్‌, ఆంధ్రప్రదేశ్‌ విద్యాపరిరక్షణ కమిటీ

Updated Date - 2021-09-08T05:45:05+05:30 IST