ఐపీఓలు ఆకర్షిస్తున్నాయా..?

ABN , First Publish Date - 2021-07-18T07:57:08+05:30 IST

ఈ ఏడాది పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ)తో ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడుతోంది. 2021 ప్రథమార్ధంలో పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.27,417 కోట్లు సమీకరించాయి.

ఐపీఓలు ఆకర్షిస్తున్నాయా..?

  • పబ్లిక్‌ ఇష్యూల్లో షేర్లు కొనాలనుకుంటున్నారా..?
  • ముందస్తు కసరత్తుతోనే మెరుగైన ప్రతిఫలాలు  
  • నష్ట భయాల్ని విస్మరిస్తే భవిష్యత్‌లో బేజారు


ఏడాది పబ్లిక్‌ ఆఫరింగ్స్‌ (ఐపీఓ)తో ప్రైమరీ మార్కెట్‌ కళకళలాడుతోంది. 2021 ప్రథమార్ధంలో పలు కంపెనీలు ఐపీఓల ద్వారా రూ.27,417 కోట్లు సమీకరించాయి. గడిచిన పదేళ్లలో ఇదే గరిష్ఠ స్థాయి. ద్వితీయార్ధంలోనూ పబ్లిక్‌ ఇష్యూల సందడి కొనసాగుతోంది. రూ.16,600 కోట్ల సేకరణ లక్ష్యంతో రంగంలోకి దిగుతున్న పేటీఎం సహా దాదాపు 40 కంపెనీలు ద్వితీయార్ధంలో ఐపీఓకు రావచ్చని అంచనా. ఈ వారంలో జొమాటో ఐపీఓకు 38 రెట్ల బిడ్లు లభించాయి. ఐపీఓల్లో షేర్ల కొనుగోలుకు ఇన్వెస్టర్లు చూపుతున్న ఆసక్తికిది తాజా ఉదాహరణ. మార్కెట్లో ద్రవ్య లభ్యత, రిటైల్‌ మదుపర్ల పాత్ర పెరగడం ఇందుకు ప్రధాన కారణం. గడిచిన కొన్నేళ్లలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు తదితర పొదుపు పథకాలపై రిటర్నులు గణనీయంగా తగ్గడంతో చాలా మంది రిటైల్‌ ఇన్వెస్టర్లు ఈక్విటీలు, పబ్లిక్‌ ఇష్యూల్లో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా యువతలో ఈ ట్రెండ్‌ కన్పిస్తోంది. పబ్లిక్‌ ఇష్యూలో షేర్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా గమనించాల్సిన అంశాలు.. 


ఐపీఓ పత్రాలు 

క్యాపిటల్‌ మార్కెట్‌ నియంత్రణ మండలి సెబీకి కంపెనీ సమర్పించిన ఐపీఓ పత్రాల (డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌ ప్రాస్పెక్ట్‌స-డీఆర్‌హెచ్‌పీ)ను క్షుణ్ణంగా చదవండి. తద్వారా ఆ కంపెనీలో పెట్టుబడులు పెడితే భవిష్యత్‌లో ఎదురయ్యే రిస్క్‌లను తెలుసుకునే అవకాశం ఉంటుంది. 


నిధుల సేకరణ లక్ష్యం

ఐపీఓ ద్వారా కంపెనీ నిధుల సేకరణ లక్ష్యాన్ని తెలుసుకోవడమూ కీలకమే. గతంలో చేసిన అప్పులను తీర్చుకునేందుకే ఐపీఓకు వస్తున్న కంపెనీలకు కాస్త దూరంగా ఉండటమే మేలు. నిధులతో పాక్షికంగా రుణాలు తీర్చుకోవడంతో పాటు కొంత సొమ్మును వ్యాపార విస్తరణకు ఉపయోగించుకునే ఉద్దేశమున్న కంపెనీలైతే మేలు. 


కంపెనీ వ్యాపారం 

పబ్లిక్‌ ఆఫరింగ్‌కు రాబోతున్న కంపెనీ వ్యాపారం గురించి తెలుసుకోవడంతో పాటు భవిష్యత్‌లో ఆ వ్యాపార వృద్ధికి అవకాశాలపై అధ్యయనం చేయాలి. తద్వారా కంపెనీ పురోగతిపై కొంత అవగాహనకు రావచ్చు. 


కంపెనీ యాజమాన్యం 

ఐపీఓకు వస్తున్న కంపెనీ యాజమాన్య సమాచారమూ ముఖ్యమే. సంస్థ ప్రమోటర్లు, మేనేజ్‌మెంట్‌ బృందం వివరాలతో పాటు వారి వ్యాపార దక్షత, గత అనుభవం, మేనేజ్‌మెంట్‌ పాలన ప్రమాణాలు వంటి వివరాలను తెలుసుకోవాలి. తద్వా రా కంపెనీ కార్యకలాపాల నాణ్యత, పారదర్శకత, భవిష్యత్‌ వృద్ధి అవకాశాలపై అవగాహన వస్తుంది. 


మార్కెట్లో కంపెనీ సత్తా 

పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్న కంపెనీ మార్కెట్‌ సత్తాపై ఓ అంచనాకు రావాలి. ప్రస్తుతం వ్యాపారం చేస్తున్న రంగంలో ఆ కంపెనీ మార్కెట్‌ వాటా లేదా స్థాయిని తెలుసుకోవాలి. ఎందుకంటే, ఐపీఓ తర్వాత మెరుగైన పనితీరు కనబర్చడంతో పాటు మరింత అభివృద్ధి సాధించగలిగితేనే ఆ కంపెనీ షేరు విలువ పెరుగుతుంది. లేదంటే, షేర్లు ఽఇష్యూ ధర దిగువకు క్షీణించే ప్రమాదం ఉంటుంది. అలాంటి సందర్భంలో ఐపీఓల్లో పెట్టుబడిని సైతం నష్టపోవాల్సి వస్తుంది. 


ఆర్థిక పరిస్థితి.. మార్కెట్‌ విలువ 

ఐపీఓకు వచ్చే సమయానికి కంపెనీ ఆర్థిక పరిస్థితి ఎలాగుంది..? కంపెనీ మార్కెట్‌ విలువ ఎంత..? అనే సమాచారాన్ని సేకరించాలి. ఆదాయం, లాభాలు నిలకడగా పెరుగుతూ వస్తున్నాయా లేదా అనే విషయాల్నీ తెలుసుకోవాలి.   మార్కెట్‌ విలువ ఆధారంగా కంపెనీ నిర్ణయించిన ఇష్యూ ధర శ్రేణి సముచిత స్థాయిపై అంచనాకు రావచ్చు. 


ప్రత్యర్థులతో పోలిక 

కంపెనీ పోటీ సామర్థ్యం, వ్యాపార ప్రత్యర్థులెవరు, వారి బలాలేంటని విశ్లేషించండి. ప్రత్యర్ధులతో కంపెనీ మార్కెట్‌ విలును కూడా పోల్చిచూడండి. కంపెనీ డీఆర్‌హెచ్‌పీలో ఈ విషయాలు అందుబాటులో ఉంటాయి. 


నష్ట భయాలు

కంపెనీ వ్యాపారానికి ఉన్న భవిష్యత్‌ ముప్పులతో పాటు ఆ సంస్థపైఉన్న వివాదాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కుల గురించి డీఆర్‌హెచ్‌పీ ద్వారా తెలుసుకోవచ్చు. తద్వారా మీ పెట్టుబడుల్లో రిస్క్‌పై ఓ అంచనాకు రావచ్చు. 


పెట్టుబడి వ్యూహం 

ఐపీఓలో పెట్టుబడిపై ముందస్తు వ్యూహం అవసరం. పబ్లిక్‌ ఇష్యూలో కొనుగోలు చేసిన షేర్లను లిస్టింగ్‌ రోజునే విక్రయించడం లేదా పెట్టుబడులను కొంతకాలం కొనసాగించడంపై ముందే ఓ నిర్ణయానికి రావడం మేలు. లేదంటే మిశ్రమ వ్యూహాన్నీ ఎంచుకోవచ్చు. మార్కెట్‌ సెంటిమెంట్‌ ఆధారంగా స్వల్పకాలిక వ్యూహాన్ని, కంపెనీ మూలాల ఆధారంగా దీర్ఘకాలిక వ్యూహాన్ని నిర్దేశించుకోవడం మేలు. 

Updated Date - 2021-07-18T07:57:08+05:30 IST