జమిలి ఎన్నికలు రాజ్యాంగ విహితమేనా?

ABN , First Publish Date - 2020-12-23T06:12:07+05:30 IST

భారత రాజ్య స్వభా వం సమాఖ్య స్ఫూర్తితో ఉన్నదా, లేక కేంద్రీకృత ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ప్రాధాన్యత నిచ్చిందా అన్న విషయం...

జమిలి ఎన్నికలు రాజ్యాంగ విహితమేనా?

జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేది పార్లమెంటు చట్టపరమైన అధికారాలకు లోబడే ఉన్నట్లు లా కమిషన్ వాదిస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వ చర్యలు, లా కమిషన్‌ వాదన చూస్తుంటే దేశమంతా పూర్తిగా ఒక కేంద్రీకృత ప్రభుత్వం చేతుల్లోకి పోయే సమయం ఎంతో దూరంలో లేదన్న విషయం స్పష్టమవుతోంది. మరి ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం మనుగడ సాగిస్తాయి? తమ అస్తిత్వాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటాయి? జమిలి ఎన్నికల్లో అవి తుడిచిపెట్టుకుపోతాయా? అన్న ప్రశ్నలు చర్చనీయాంశమవుతున్నాయి.


భారత రాజ్య స్వభా వం సమాఖ్య స్ఫూర్తితో ఉన్నదా, లేక కేంద్రీకృత ప్రభుత్వానికి భారత రాజ్యాంగం ప్రాధాన్యత నిచ్చిందా అన్న విషయం పాత చర్చ. మొత్తం భారతదేశానికి ఒకటే రాజ్యాంగం ఉన్నది. ఒకో రాష్ట్రానికి ఒక రాజ్యాంగం లేదు. అంతేకాదు, మన రాజ్యాంగాన్ని మార్చే అధికారం పార్లమెంటుకే ఉన్నది కాని రాష్ట్రాలకు లేదు. అసలు రాజ్యాంగం సమాఖ్య అన్న పదాన్నే ఎక్కడా ఉపయోగించలేదు. భారత రాజ్యాంగం సంపూర్ణ సమాఖ్య సూత్రాన్ని ప్రతిపాదించలేదని 1963లోనే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఎస్.ఆర్. బొమ్మయి కేసులో కూడా భారత రాజ్యాంగం రూపంలో సమాఖ్య స్వభావం కనిపించినా అది కేంద్రీకృత లేదా ఏక కేంద్ర విధానం వైపు మొగ్గు చూపుతుందని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.


భారత రాజ్యాంగంలోని ఈ స్వభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా ఉపయోగించుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. దేశంలో పార్లమెంటు, అసెంబ్లీలకు జమిలి ఎన్నికలను నిర్వహించడం అనేది రాజ్యాంగంలోని సమాఖ్య స్ఫూర్తిని ఉల్లంఘిస్తుందని పలువురు చేస్తున్న వాదనలకు భిన్నంగా ఆ ఎన్నికలను నిర్వహించే విషయం కేంద్రం తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు నరేంద్రమోదీ అనేక సందర్భాల్లో చేసిన ప్రకటనలతో స్పష్టమవుతోంది. తాజాగా ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా తాము జమిలి ఎన్నికలు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నామని చెప్పారు. పెద్దనోట్ల రద్దు, కశ్మీర్‌లో 370 అధికరణ రద్దు నుంచి తాజాగా వ్యవసాయ చట్టాలను ఆమోదింపచేయడం వరకు కేంద్రప్రభుత్వం అనుసరించిన వైఖరి చూస్తే మోదీ సర్కార్ ఏ క్షణంలోనైనా జమిలి ఎన్నికలపై నిర్ణయం తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అసలు ఏ అంశంపైనైనా సంప్రదింపులు, చర్చలు, ఏకాభిప్రాయ సాధన అన్న విషయాలపై మోదీ ప్రభుత్వానికి పెద్దగా నమ్మకం ఉన్నట్లు లేదని అనేక నిర్ణయాలను బట్టి అర్థం చేసుకోవడానికి ఆస్కారం ఉన్నది.


అయినప్పటికీ విశాలమైన మన దేశంలో కేంద్రమే రాష్ట్రాల తరపున అన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సాధ్యపడదు. భిన్న భౌగోళిక స్వభావాలు, అస్తిత్వాలు, సంస్కృతులు, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక, సామాజిక వ్యత్యాసాలు, ప్రత్యేక అవసరాలు ఉన్న రీత్యా తమకు అధికారం ఉన్నది కదా అని కేంద్రప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే అనేక సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల గతంలో పాలకులు అనుసరించిన నిర్ణయాల్లో ఆరోగ్యకరమైన సంప్రదాయాలను కేంద్రం స్ఫూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మనదేశంలో జీఎస్టీ అమలు కావడానికి పెద్ద తతంగమే జరిగింది. 2007లో ఏర్పడిన రాష్ట్రాల ఆర్థికమంత్రుల సాధికారిక కమిటీ 2011లో ఇచ్చిన నివేదిక ప్రకారమే జీఎస్టీ బిల్లును రూపొందించారు. దీన్ని ఆ తర్వాత స్థాయీసంఘానికి నివేదించారు. స్థాయీసంఘం సూచించిన మార్పులతో 2015లో కొత్త బిల్లును ప్రవేశపెట్టారు. దీన్ని లోక్‌సభలో ఆమోదించిన తర్వాత కూడా రాజ్యసభ సెలెక్ట్ కమిటీకి నివేదించింది. ఆ తర్వాతే జీఎస్టీ బిల్లు చట్టంగా మారి, రాష్ట్రాల ఆమోదాన్ని పొందింది. 


కాని ఇటీవలి కాలంలో ఆర్డినెన్స్‌లను చట్టాలుగా మార్చే క్రమంలో కూడా సంప్రదింపుల క్రమాన్ని పాటించలేదు. వ్యవసాయ బిల్లులకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌లను లోక్‌సభలో ప్రవేశపెట్టి స్థాయీసంఘానికి కూడా నివేదించకుండా మూడురోజుల్లో ఆమోదించారు. రాజ్యసభలో ఈ బిల్లులను సెలెక్ట్ కమిటీకి నివేదించాలన్న తీర్మానాలను విస్మరించి గందరగోళం మధ్య ఆమోదించడం వల్ల బిల్లులపై జరగాల్సినంత చర్చ జరగలేదు. బహుశా అదే జరిగి ఉంటే ఇవాళ సాగుచట్టాలకు సంబంధించి ఇంత పెద్దఎత్తున నిరసన వ్యక్తం అయ్యేది కాదేమో. పైగా ఈ చట్టాల్లో ఉన్న అంశాలు రాష్ట్ర చట్టాల పరిధి లోనివి. రాష్ట్ర ప్రభుత్వాలే వాటిని అమలు చేయాల్సి ఉన్నది. ఇప్పటికే మూడు రాష్ట్రాలు కేంద్రచట్టాలను తిరస్కరించి తమ స్వంత చట్టాలు చేశాయి. సమాచార చట్టం, విద్యుత్ చట్టాల విషయంలో కూడా కేంద్రం పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరించింది.


ఈ నేపథ్యంలో ఇప్పుడు జమిలి ఎన్నికల విషయంలో కూడా ఇదే విధంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. ఎన్నికలు వేరువేరుగా జరిగితే ఏం జరుగుతుందో గతంలో అనేకసార్లు రుజువైంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో లోక్‌సభలో నరేంద్ర మోదీ సారథ్యంలో బిజెపి అత్యధిక సీట్లు గెలుచుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయింది. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ ఎన్నికలు కూడా ఈ విషయం నిరూపించాయి. జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలకు ఈ విచక్షణాధికారం ఉపయోగించుకునే అవకాశం ఉండదని, జాతీయ అంశాల ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయని వాదించేవారున్నారు.


విచిత్రమేమంటే జమిలి ఎన్నికలపై నివేదిక రూపొందించిన లా కమిషన్ అసలు రాజ్యాంగంలో సమాఖ్య స్ఫూర్తి ఎక్కడున్నదని వాదిస్తోంది. దేశమంతటా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గంలో సమగ్ర అభివృద్ధి జరుగుతున్నప్పుడు రాష్ట్రాలు అందుకు అడ్డు నిలవలేవని, జాతీయ స్థాయిలో రాజకీయ, ఆర్థిక, సామాజిక అభివృద్ధికి సమన్వయం ఏర్పడాలని లా కమిషన్ అభిప్రాయపడింది. అసలు రాష్ట్రాలకు పెద్దగా అధికారాలు లేవని చెప్పడానికి లా కమిషన్ రాజ్యాంగంలోని అనేక అధికరణలను ఉటంకించింది. దీని ప్రకారం రాష్ట్రాల సరిహద్దులను మార్చే అధికారం రాజ్యాంగంలోని 3వ అధికరణ కేంద్రానికే కల్పించింది. రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రాల పాలన కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. రాజ్యాంగంలోని 254వ అధికరణ ప్రకారం కేంద్ర చట్టానికీ, రాష్ట్ర చట్టానికీ మధ్య సంఘర్షణ ఏర్పడితే కేంద్ర చట్టమే వర్తిస్తుంది. 255వ అధికరణ ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను రాష్ట్రపతి అంటే కేంద్ర ప్రభుత్వమే నియమిస్తుంది. కేంద్ర, రాష్ట్రాలకు విభజించిన అధికారాలు పోగా మిగిలిన అధికారాలు కూడా కేంద్రానికే సంక్రమిస్తాయి. 249వ అధికరణ ప్రకారం జాతీయ ప్రయోజనాల రీత్యా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపై చట్టాలు చేసేందుకు రాజ్యసభ రెండింట మూడవ వంతు మెజారిటీతో పార్లమెంట్‌ను అనుమతించవచ్చు. 252వ అధికరణ ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు కోరితే రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపై పార్లమెంటు చట్టాలు చేయవచ్చు. అంతర్జాతీయ ఒడంబడికలను గౌరవించేందుకు వీలుగా రాష్ట్రాల జాబితాలో ఉన్న అంశాలపై కూడా పార్లమెంటు చట్టాలు చేయవచ్చని 253వ అధికరణ స్పష్టం చేస్తోంది. స్థానిక పరిపాలన కోసమే అధికారాలను పంపిణీ చేశారు కాని, రాష్ట్రాలు కేంద్రం అధికారానికి లోబడి ఉండాల్సిందేనని రాజ్యాంగం అనేక అధికరణల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పష్టం చేసింది. ఏడవ షెడ్యూలులో పేర్కొన్న అన్ని జాబితాలను మార్చడం, ఉన్న అంశాలను తొలగించడం, చేర్చడం పార్లమెంట్ ద్వారానే సాధ్యం. ఏడవ షెడ్యూలును సవరించినందువల్లే ఇవాళ దేశవ్యాప్తంగా జీఎస్టీ అమలులోకి రాగలిగింది. అంతేకాదు, రాష్ట్రాలు కేంద్రప్రభుత్వంపై నిధుల విషయంలో అత్యధికంగా ఆధారపడతాయి. 275 అధికరణను ఉపయోగించుకుని కేంద్రప్రభుత్వం కొన్ని రాష్ట్రాలకు గ్రాంట్లను, 282 అధికరణ ద్వారా భారీ ప్రాజెక్టులకు నిధులను విడుదల చేస్తుంది. తమ రాష్ట్రం పరిధి వెలుపల పన్నులు విధించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. దేశమంతటా స్వేచ్ఛా వర్తక, వ్యాపారాలపై రాష్ట్రాలు ఆంక్షలు విధించలేవు. 256, 258 అధికరణల ప్రకారం కేంద్రప్రభుత్వం తనకున్న కార్యనిర్వాహక అధికారాల ద్వారా రాష్ట్రాలకు ఎలాంటి ఆదేశాలైనా జారీ చేయవచ్చు వాటిని కాదనే అధికారం రాష్ట్రాలకు లేదు. అలా జరిగితే 365వ అధికరణ ప్రకారం రాష్ట్రాలు రాజ్యాంగాన్ని అనుసరించి సాగడంలేదని రాష్ట్రపతి భావించవచ్చు. 262వ అధికరణ ప్రకారం అంతర్ రాష్ట్ర నదీ జలాల పంపిణీ, నియంత్రణకు సంబంధించిన వివాదాలను పరిష్కరించేందుకు పార్లమెంటు చట్టాలు చేయవచ్చు.


వీటన్నిటి రీత్యా జమిలి ఎన్నికలు నిర్వహించడం అనేది కూడా పార్లమెంటు చట్టపరమైన అధికారాలకు లోబడే ఉన్నట్లు లా కమిషన్ వాదిస్తోంది. నరేంద్రమోదీ ప్రభుత్వ చర్యలు, ఈ వాదనలు చూస్తుంటే దేశమంతా పూర్తిగా ఒక కేంద్రీకృత ప్రభుత్వం చేతుల్లోకి పోయే సమయం ఎంతో దూరంలో లేదన్న విషయం స్పష్టమవుతోంది. మరోవైపు మోదీ సారథ్యం వహిస్తున్న భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని భావోద్వేగాలకు అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో విస్తరించేందుకు పావులు కదుపుతోంది. తమ పార్టీ అధికారంలో లేని రాష్ట్ర ప్రభుత్వాధినేతలపై సిబిఐ విచారణ చేయిస్తామని, ముఖ్యమంత్రులపై ఫైళ్లు సిద్ధంగా ఉన్నాయని, వారిని జైళ్లకు పంపిస్తామని జాతీయస్థాయిలో బిజెపి నేతలు, కొన్ని రాష్ట్రాల్లో బిజెపి అధ్యక్షులు బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీకి వచ్చి ప్రధానమంత్రి, హోం మంత్రిని కలిస్తే వారు ఢిల్లీ నేతలకు పాదాక్రాంతులైనట్లు ప్రచారం జరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో ప్రతిపక్ష నేతలపై సిబిఐ, ఈడీ, ఆదాయపన్ను శాఖల అధికారుల దాడులు జరగడం, అస్మదీయుల విషయంలో ఈ శాఖలు చూసీ చూడనట్లు వ్యవహరించడం దేశంలో పరిణామాలు ఏ దిశగా సాగుతున్నాయో అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఎంతకాలం మనుగడ సాగిస్తాయి? తమ అస్తిత్వాన్ని ఏ విధంగా నిలబెట్టుకుంటాయి? జమిలి ఎన్నికల్లో అవి తుడిచిపెట్టుకుపోతాయా? అన్న అంశాలు చర్చనీయాంశం. అసలు ప్రాంతీయ అస్తిత్వం అనేదే లేదని ఉన్నదంతా జాతీయ అస్తిత్వమేనని వాదనలు వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కనుక జరుగుతున్న పరిణామాలు ఆరోగ్యకరమైనవా, కాదా అన్నది ఆయా ప్రభుత్వాలు, పార్టీలు ఆలోచించుకోవాలి. అంతేకాదు, రాజ్యాంగం, ఆ రాజ్యాంగాన్ని నిర్వచించే న్యాయస్థానాలు కూడా ఈ విషయంలో పూర్తిగా న్యాయం చేయలేవు. ఆరోగ్యకరమైన ప్రజా రాజకీయాలు, బుద్ధిజీవుల మధ్య కూడా చర్చలు అవసరం.


ఎ. కృష్ణారావు

(ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి)

Updated Date - 2020-12-23T06:12:07+05:30 IST