Abn logo
Sep 26 2021 @ 02:07AM

బోర్డుల పరిధిలో ఉమ్మడి ప్రాజెక్టులే

వాటిని మాత్రమే చేర్చండి

పాలమూరు ప్రాజెక్టును అడ్డుకోవద్దు

కృష్ణా జలాల్లో వాటాలు తేలేవరకు ఆగండి

రుణాలు తీసుకోవడంపై అభ్యంతరాలు చెప్పొద్దు

గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలును వాయిదా వేయండి

కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు సహకరించండి

రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోండి

కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సీఎం కేసీఆర్‌ 

పాలమూరు ఎమ్మెల్యేలతో కలిసి షెకావత్‌తో భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 25 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల వాటా తేలే వరకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణాలను అడ్డుకోవద్దని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌కు సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలు గడువును వాయిదా వేయాలని కోరారు. జలాల పంపిణీకిగాను కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటుకు సహకరించాలన్నారు. బోర్డుల పరిధిలో ఉమ్మడి ప్రాజెక్టులను మాత్రమే చేర్చాలని ప్రతిపాదించారు. శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు సి.లక్ష్మారెడ్డి, రాజేందర్‌రెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రితో సీఎం భేటీ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటుఈ సమావేశం జరిగింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధానంగా కృష్ణా జలాల పంపకానికి ట్రైబ్యునల్‌ ఏర్పాటు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం, గెజిట్‌ నోటిఫికేషన్‌ అమలుపై షెకావత్‌తో కేసీఆర్‌ చర్చించారు. కృష్ణా జలాల వాటా ఇంకా స్పష్టంగా తేలలేదని, జలాల పంపకంపై ప్రస్తుతం బ్రిజేశ్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ విచారణ జరుపుతోందని కేంద్ర మంత్రికి తెలిపారు.


కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయడానికి వీలుగా అపెక్స్‌ కౌన్సిల్‌లో తీసుకున్న నిర్ణయం మేరకు సుప్రీంకోర్టులో తమ పిటిషన్‌ను ఉపసంహరించుకోడానికి అప్లికేషన్‌ దాఖలు చేశామన్నారు. దీనిపై ఏపీ సర్కారు అభ్యంతరం తెలపడంతో సుప్రీంకోర్టు ఫుల్‌ బెంచ్‌కు కేసు బదిలీ అయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కృష్ణా జలాల్లో వాటాలు తేలేవరకు వరద జలాల వినియోగం కోసం నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోరాదని, వివిధ సంస్థల నుంచి తీసుకుంటున్న రుణాల విషయంలో అభ్యంతరాలు చెప్పవద్దని కోరారు. 

గెజిట్‌ అమలు హడావుడిగా వద్దు..

గెజిట్‌ నోటిఫికేషన్‌ను హడావుడిగా అమలు చేయడం వల్ల పలు సమస్యలు తలెత్తే అవకాశం ఉందని కేంద్ర మంత్రి షెకావత్‌ వద్ద సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల నేపథ్యంలో మరికొన్ని రోజులపాటు గెజిట్‌ అమలును వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ చేపడుతున్న రాయలసీమ ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతం ఎడారిగా మారుతుందని, ఆ ప్రాజెక్టును అడ్డుకోవాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సీఎం కోరినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. కానీ, కేంద్ర మంత్రితో ముఖ్యమంత్రి భేటీకి సంబంధించి ప్రభుత్వం అధికారికంగా వివరాలు వెల్లడించలేదు. అయితే ప్రతి ఇంటికీ నల్లా ద్వారా నీరు అందించడానికి ప్రవేశపెట్టిన జల్‌ జీవన్‌ మిషన్‌ను సమర్థంగా అమలు చేసే అంశంతోపాటు ఇతర విషయాలపై చర్చించామని కేంద్ర మంత్రి షెకావత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు అని ఏపీ సర్కారు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ చర్చనీయాంశమైంది. ఈ ప్రాజెక్టు వల్ల కలిగే ప్రయోజనాలతోపాటు రాయలసీమ ప్రాజెక్టు వల్ల దక్షిణ తెలంగాణ ప్రాంతానికి ఏ విధంగా నష్టం జరుగుతుందో కేంద్ర మంత్రికి వివరించడానికే ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను ఆయన వద్దకు సీఎం తీసుకెళ్లారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 


సీఎంను కలిసిన ఎంపీలు..

ఢిల్లీలో సీఎం కేసీఆర్‌ను ఆయన అధికారిక నివాసంలో టీఆర్‌ఎస్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్‌, కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వెంకటేశ్‌ నేత మర్యాదపూర్వకంగా కలిశారు. ఆదివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో జరిగే మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో కేసీఆర్‌ పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ను కలిసి ధాన్యం కొనుగోలు సమస్యలపై చర్చించనున్నారు.