Abn logo
Jun 28 2021 @ 00:59AM

సాహిత్యంలో ప్రాంతీయ విభజనలు అవసరమా?

మద్రాసు నుంచి వేరుపడిన ఆంధ్ర రాష్ట్రం లోని చాలామంది రాజకీయ పరాన్న భుక్కులు 1956కు ముందు తెలుగు వారంతా ఒక్కటేనని గొంతెత్తినారు. 1956 అనంతరం ఆంధ్ర ప్రదేశ్‌ సృజనకారులు మేధావులకు ఏమైందో ఏమో కానీ తెలంగాణ ప్రాంతం నుంచి వస్తున్న కవిత్వాన్ని, కథను, నవలను తెలంగాణ ప్రాంత సాహిత్యంగా చూడడం మొదలుపెట్టారు. అలాగే ఉమ్మడి రాష్ట్రంలోని రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల సాహిత్యాన్ని ఆయా ప్రాంతాలకే పరిమితం చేసి మాట్లాడటం ప్రారంభించారు. మీడియా రంగాల్లో పాగా వేసినవారు, హైదరాబాద్‌ రాజధాని కేంద్రంగా నివసిస్తున్నవారు, రాస్తున్నవారు అందరూ కూడా తెలంగాణ, రాయలసీమ, కళింగాంధ్ర ప్రాంతాల్లో జరుగుతున్న రచనా వ్యాసంగాన్ని ఆయా ప్రాంతాలకే కుదించి చూడడం మొదలుపెట్టారు. 1980 తర్వాత తెలుగులో ప్రారంభమైన అస్తిత్వ ఉద్యమాల అనంతర కాలంలో ఈ హ్రస్వ దృష్టి మరింత ఎక్కువైంది. 1990 తర్వాత అంటే ప్రత్యేక తెలం గాణ భావజాల ప్రచారం సందర్భం నుంచి ఇటువంటి భావనలు మరింత ఎక్కువైపోయాయి.


అసలు దీనిలోని అంతర్యాన్ని లోతుగా పరిశీలిస్తే అనేక విషయాలు గమనంలోకి వస్తాయి. భాషాపరమైన వివక్ష, ప్రాంతపరమైన వేర్పాటు, కుల పరమైన, జెండర్‌పరమైన చిన్న చూపు ఇందులో కనబడతాయి. ఈ విభజనల వెనుక అనేక మతలబులు ఉన్నాయి. చిన్న గీత పక్కన పెద్ద గీత గీసి పైచేయి సాధించినట్లు తామే అధికులమని కొన్ని ఆధిపత్య ప్రాంతాల ఆధిపత్య వర్గాలు భావించడం వలన ఈ అపసవ్యత ఏర్పడింది. అది ఇంకా కొనసాగడం సమర్థనీయం కాదు. ఈ విషయంలో ఇంతవరకు కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీల ద్వారా ఎన్నికై అవార్డులు పొందిన వారి జాబితాలను తులనాత్మకంగా పరిశోధిస్తే కుల్లం కుల్లాగా స్పష్టత వస్తుంది. 


ఇప్పుడు ఈ చర్చ ఎందుకూ అంటే మధ్య ఆంధ్ర ప్రదేశ్‌ నుంచి వస్తున్న కవిత్వాన్ని, కథలను, నవలలను మాత్రమే తెలుగు సాహిత్యంగా చలామణి చేయడానికి వివిధ వేదికలపై ఈ విభజనల్ని వాడుకుంటున్నారు. ఇంతకు ముందెన్నడూ జరగని విధంగా అన్ని ప్రాంతాల ప్రజలు వారి భాషలో వారి జీవితాలను వివిధ ప్రక్రియల ద్వారా నమోదు చేయడమే వీరికి వచ్చిన సమస్యేమో అనిపిస్తుంది. క్రింది తరగతి జీవితాల పట్ల, భాష పట్ల, ఆ వర్గాల నుంచి ఎదిగి వచ్చిన సాహిత్యకారుల పట్ల చిన్న చూపు ఉండడం కూడా కారణం. బ్రాహ్మణీయ కులాలు సృష్టించిన సాహిత్యాన్ని తక్కిన వర్గాల వారు అర్థం కాకున్నా తెలుసుకొని చదువుకున్నారు, అవగాహన చేసుకున్నారు. కానీ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న తమకు తెలియని బతుకు మూలాల రచనల పట్ల, భాష పట్ల అటువంటి సానుకూల దృక్పథాన్ని ఉన్నత వర్గాల వారు, ఆధిపత్య ప్రాంతాల వారు చూపించ లేకపోతున్నారు. వస్తున్న తెలుగు సాహిత్యమంతా అంతా ఒకటే అంటే వీరి మనసులు ఎందుకు అంగీకరించ లేకపోతున్నాయి? ప్రాంతీయం కానిదేది   ప్రపంచ సాహిత్యం కాలేదనేది వీరికి తెలియని విషయం కాదు. కానీ ముందు సాచివేత ధోరణి ప్రదర్శించి, అనంతరం అన్యమనస్కంగా ఆమోదించినట్టు ఆమోదించి, చివరకు రకరకాల విభజనల్లోకి నెట్టివేస్తారు. ఇప్పటికైనా ఇటువంటి భావనలను విడనాడి తెలుగు గుండె చప్పుడుగా వినిపిస్తున్న సాహిత్యాన్ని అక్కున చేర్చుకోవాలి. అగ్ని పర్వతం కింద ఉరుకుతున్న ఈ వివక్ష ఇలాగే కొనసాగితే లావాలా ముంచెత్తుతుంది. ఇకనుంచైనా ప్రాంతాలవారీగా సాహిత్యాన్ని చూడడం మానివేస్తే అందరికీ మంచిది. లేకుంటే దూరాలు మరింత పెరిగే అవకాశాలు కల్పించిన వాళ్ళమవుతాం.

జూకంటి జగన్నాథం

ప్రత్యేకంమరిన్ని...