ఒంగోలు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?

ABN , First Publish Date - 2022-01-19T06:24:17+05:30 IST

ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్న వైసీపీ నేతలు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. అని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ సవాల్‌ విసిరారు.

ఒంగోలు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా?
ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని పరిశీలిస్తున్న దామచర్ల జనార్దన్‌

వైసీపీ నేతలకు మాజీ ఎమ్మెల్యే దామచర్ల సవాల్‌ 

టీడీపీ చేసిన పనులకు వైసీపీ ప్రారంభోత్సవాలంటూ ఎద్దేవా

ఒంగోలు (కార్పొరేషన్‌), జనవరి 18 : ఒంగోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన పనులకు ఇప్పుడు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్న వైసీపీ నేతలు అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా.. అని మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్‌ సవాల్‌ విసిరారు. మంగళవారం ఒంగోలులోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన వైసీపీ నేతల విమర్శలపై స్పందించారు. యరజర్ల వద్ద ఇళ్ల పంపిణీకి తాను అడ్డుపడి, కోర్టుకెళ్లానని అబద్ధాలు చెప్పడం అవివేకమన్నారు. గతంలోనే అక్కడ ఐరన్‌ ఓర్‌ కంపెనీకి స్థలాన్ని కేటాయిస్తే ఆ స్థలాన్ని పేదలకు ఇస్తున్నట్లు నమ్మించారన్నారు. పేదలపై ప్రేమ ఉంటే సొంతంగా ప్రైవేటు స్థలం కొనుగోలు చేసిఇవ్వాలని, అందుకు తామేమీ అభ్యంతరం తెలపడం లేదన్నారు. నగర ప్రజలకు ప్రతిరోజూ తాగునీరు ఇవ్వడానికి గుండ్లకమ్మ నుంచి పైపులైను పనులు చేపట్టామని ఆయన చెప్పారు. ఎన్నికల సమయానికి రెండు కిలోమీటర్లు మాత్రమే పనులు మిగిలిపోగా, ఆ కొంచెం కూడా రెండున్నరేళ్లలో పూర్తిచేయలేకపోయారన్నారు. ముస్లింల కోసం షాదీఖానా నిర్మిస్తే కనీసం వాటి పెండింగ్‌ పనులు కూడా చేయలేకపోయారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శ్మశానవాటికల అభివృద్ధి, పార్కుల అభివృద్ధి, రోడ్ల నిర్మాణం ఇలా ఎన్నో పనులు చేస్తే, కళ్లుమూసుకుపోయిన వైసీపీ నేతలకు అవి రోడ్డుపై రోడ్డులా కనిపించడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక పోతురాజు కాలువ వద్ద ఓవర్‌ హెడ్‌ట్యాంకు నిర్మాణం తన హయాంలోనే జరిగితే ఇప్పుడు ప్రారంభోత్సవం చేసుకుని టీడీపీపైనే విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. అంబేడ్కర్‌ భవనం ఆధునికీకరణ తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశామన్నారు. దాన్ని ఇప్పుడు ప్రారంభించి ప్రైవేటుపరం చేసి, దళితులకు అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. పాదయాత్రలో జగన్‌రెడ్డి ఒక్క అవకాశం అంటూ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వస్తే ఆ జాబితాలో గెలిచిన మంత్రి ఇప్పుడు అభివృద్ధి పనులన్నీ ఆయనే చేసినట్లు గొప్పలు పోతున్నారన్నారు.  




Updated Date - 2022-01-19T06:24:17+05:30 IST