ఇలా ఉంటే ఎలా?

ABN , First Publish Date - 2021-04-20T07:27:56+05:30 IST

ఎన్నికల అక్రమాలపై ఎవరికి, ఎప్పుడు..

ఇలా ఉంటే ఎలా?
తిరుపతిలో దొంగ ఓట్లు వేసేందుకు వచ్చిన స్థానికేతరులు(ఫైల్‌ఫొటో)

ఎన్నికల అక్రమాలపై పార్టీలకు అవగాహనేదీ?

తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్ల విషయంలో జరిగిందిదే


చిత్తూరు(ఆంధ్రజ్యోతి): ఎన్నికల అక్రమాలపై ఎవరికి, ఎప్పుడు, ఎలా ఫిర్యాదు చేయాలన్న విషయమై చిత్తూరు జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలకు అవగాహన వుంటున్నట్టు అనిపించడం లేదు. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ ఉప ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా నమోదైన దొంగ ఓట్ల విషయంలో ఇదే జరిగినట్టు భావించాల్సి వస్తోంది. శనివారం జరిగిన ఉప ఎన్నికల పోలింగ్‌లో ప్రత్యేకించి తిరుపతి సెగ్మెంట్‌ పరిధిలో పెద్దఎత్తున దొంగ ఓట్లు పోలయ్యాయన్న ఆరోపణలు వచ్చాయి. దొంగ ఓటర్లను అధికార పార్టీ నేతలు తరలిస్తుండగా టీడీపీ, బీజేపీ నేతలు కొన్ని వాహనాలను అడ్డుకోవడం తెలిసిందే. ఒకటి రెండు బస్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కూడా. అంతటితోనే టీడీపీ, బీజేపీ నేతలు ఊరకుండిపోయారు. విషయాన్ని తమతమ పార్టీల అగ్రనేతల దృష్టికి తీసుకెళ్ళారు.


టీడీపీ విషయానికొస్తే స్థానిక నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ అధినేత చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇక చర్యలు జరిగిపోతాయని భావించి మిన్నకుండిపోయారు. అయితే పోలింగ్‌ సందర్భంలో ఫిర్యాదులు ఎవరికి, ఎలా చేయాలన్న విషయమై అవగాహనతో వ్యవహరించలేదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. రోడ్లపై వాహనాలను అడ్డుకుని పోలీసులకు అప్పగించడం వల్ల ఒరిగేదేమీ వుండదని, వారు దొంగ ఓట్లు వేయడానికే వస్తున్నట్టు నిరూపించడం సాధ్యం కాదని పలువురు భావిస్తున్నారు. దానికి బదులు పోలింగ్‌ కేంద్రాల్లో దొంగ ఓటర్లను అడ్డుకోవడం, పోలింగ్‌ కేంద్రాల ఆవరణల్లో పోలీసులకు పట్టివ్వడం, పోలింగ్‌ అధికారులకు ఏజెంట్ల ద్వారా ఫిర్యాదు చేయించడం వంటివి సాంకేతికంగా ఉపయోగకరమంటున్నారు. సెగ్మెంట్‌కు సంబంధించిన ఏఆర్వోకు, ఆర్వోకు, ఎన్నికల పరిశీలకులకు ఫిర్యాదు చేసి వుండాల్సిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఇవేవీ చేయకుండా ఇతరత్రా హడావిడి చేయడం వల్లనే ఆశించిన విధంగా ఎన్నికల సంఘం నుంచీ చర్యలు లేకపోయాయని సమాచారం.


పోలింగ్‌ ముగిశాక ఎన్నికల పరిశీలకుడు నిర్వహించిన సమావేశానికి కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు గానీ, ఇతర ముఖ్య నేతలు గానీ హాజరు కాలేదని సమాచారం. ఆ సమయంలో హాజరై ఆయనకు నేరుగా ఫిర్యాదు చేయకపోవడం కూడా స్థానిక నేతలకు అవగాహన లేకపోవడంతోనే అని భావించాల్సి వస్తోంది. టీడీపీ, బీజేపీ అగ్రనేతలంతా తిరుపతిలోనే మకాం వేసి గెలుపుకోసం వ్యూహాలు పన్నడానికి ముందు పోలింగ్‌ సందర్భంగా జరిగే అక్రమాలపై ఎవరికి, ఎలా ఫిర్యాదు చేయాలనే అంశాలపై ఏజెంట్లకు, నాయకులకు అవగాహన కల్పించి వుండాల్సిందన్న వ్యాఖ్యలు  వినిపిస్తున్నాయి. కాగా కేంద్ర ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదులపై కనీసం మంగళవారం లేదా బుధవారమైనా ఏవైనా చర్యలకు ఆదేశాలు జారీ అవుతాయేమోనని టీడీపీ, బీజేపీ, జనసేన, కాంగ్రెస్‌, సీపీఎం నాయకులు, శ్రేణులు ఆశతో నిరీక్షిస్తున్నాయి.

Updated Date - 2021-04-20T07:27:56+05:30 IST