ఈ సారైనా కొత్త రేషన్‌ కార్డులు అందేనా..?

ABN , First Publish Date - 2021-06-14T04:17:15+05:30 IST

కొత్త రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు.

ఈ సారైనా కొత్త రేషన్‌ కార్డులు అందేనా..?

             - సీఎం ప్రకటనతో కొత్త రేషన్‌ కార్డులపై చిగురిస్తున్న ఆశలు

             - ఆరేళ్ల నుండి జారీ కాని కార్డులు

             - ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా

             - జిల్లాలో కొత్త రేషన్‌ కార్డుల కోసం వచ్చిన ధరఖాస్తులు 3850

             - కార్డులో పేర్ల నమోదుకు వచ్చిన ధరఖాస్తులు 5028 

చింతలమానేపల్లి, జూన్‌ 13: కొత్త రేషన్‌  కార్డుల జారీ ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. త్వరలో కొత్త రేషన్‌ కార్డులు ఇవ్వనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. దీంతో ప్రజల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. గతంలో మూడు, నాలుగుసార్లు ఇలాంటి ప్రకటనలే వెలువడ్డాయి. కార్డులు లేని నిరుపేదలు వేలాది మంది ధరఖాస్తులు చేసుకున్నారు. ఐతే ఇప్పటివరకు ఒక్కటి కూడా కొత్తరేషన్‌ కార్డు జారీ కాలేదు. 2019 ఏప్రిల్‌లో రేషన్‌ కార్డులను జారీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు అధికా రులకు ఆదేశాలను జారీచేసి మార్గదర్శకాలను నిర్దేశించింది. అయితే వరుస ఎన్నికల నేపథ్యంలో వీటి ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత లాక్‌డౌన్‌ కారణంగా కార్డుల ప్రక్రియను ప్రభుత్వం చేపట్టలేక పోయింది. ధరఖాస్తు చేసుకున్న చాలా మంది కార్డులు రాక నిరాశ చెందారు. మరికొంత మంది కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో ధరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులుగా గుర్తించిన వారికే ప్రభుత్వం ఇవ్వనున్నట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే కార్డుల జారీ విషయంలో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జారీ ప్రక్రియను అధికార యంత్రాంగం చేపట్టే వీలుంది. 

ఇదీ పరిస్థితి..

జిల్లాలో మొత్తం రేషన్‌ కార్డులు 1,37,284 ఉండగా, ఇందులో అంత్యోదయ కార్డులు 12,948, తెల ్లరేషన్‌ కార్డులు 1,24,336 ఉన్నాయి. కొత్త రేషన్‌ కార్డుల కోసం 3,850మంది, కార్డుల్లో పేర్ల నమోదు కోసం 5028మంది దరఖాస్తు చేసుకున్నారు. కొత్త రేషన్‌ కార్డులు జారీ కాకపోవడంతో అర్హులైన తాము ప్రభుత్వ పథకాలకు దూరం కావాల్సి వస్తోందని పలువురు ధరఖాస్తుదారులు పేర్కొంటున్నారు. సీఎం కేసీఆర్‌ 15రోజుల్లో రేషన్‌ కార్డుల ప్రక్రియ జారీ పూర్తికావాలని మంగళవారం జరిగిన మంత్రి వర్గ భేటీలో నిర్ణయం తీసుకోవడంతో ధరఖాస్తుదారులకు ఊరటనిచ్చిందని పలువురు పేర్కొంటున్నారు.  

కొత్తవారు ధరఖాస్తు చేసుకోవచ్చు..

పెండింగ్‌లో ఉన్న ధరఖాస్తులను మంజూరు చేయడమే కాకుండా ఎవరైనా కొత్త రేషన్‌కార్డుల కోసం ధరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జిల్లావ్యాప్తంగా ఇంకా రేషన్‌ కార్డుకు నోచుకోని పేదలకు ఇది మంచి అవకాశం. కొత్త కార్డు దరఖాస్తుకు దగ్గరలోని మీసేవా కేంద్రాల్లో కుటుంబసభ్యుల వివరాలతో ధరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హులకు అందనున్న సంక్షేమ పథకాలు..

రేషన్‌ కార్డు కేవలం బియ్యం కోసమే కాకుండా ప్రభుత్వం అందించే ఎన్నో సంక్షేమ పథకాలతో ముడి పడి ఉంది. కార్డు ఉంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇది లేక  పేద ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, సీఎంఆర్‌ఎఫ్‌, ఆదాయ పన్ను తదితర వాటిల్లో రేషన్‌కార్డు కీలకం. కొత్త రేషన్‌ కార్డులు జారీ అయితే పేద ప్రజలకు ఈ సంక్షేమ పథకాలు అందనున్నాయి. 

కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాం..

- గణేష్‌, నికాడి , కర్జెల్లి

కొన్ని రోజుల నుంచి కొత్త రేషన్‌ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాం. సీఎం కేసీఆర్‌ ఇటీవల కొత్త రేషన్‌ కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. దీంతో ప్రభుత్వ పథకాలు పూర్తిగా అందే ఆస్కారం ఉంది. వెంటనే కార్డులు జారీజేసే ప్రక్రియను ప్రారంభించాలి. 

Updated Date - 2021-06-14T04:17:15+05:30 IST