కొత్త మెడికల్‌ కాలేజీలకు ప్రిన్సిపాళ్లు ఏరీ?

ABN , First Publish Date - 2021-12-06T08:06:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న 8 వైద్య విద్య కళాశాలలకు ఇప్పటివరకు ప్రిన్సిపాళ్లను నియమించలేదు.

కొత్త మెడికల్‌ కాలేజీలకు ప్రిన్సిపాళ్లు ఏరీ?

  • ఈ నెల్లోనే తనిఖీలకు రానున్న ఎన్‌ఎంసీ
  • ఇంకా పూర్తికాని నియామకాలు, నిర్మాణాలు
  • అడిషనల్‌ డీఎంఈలకు ఖరారుకాని పోస్టింగులు
  • తాత్కాలిక నియామకాలపై విమర్శలు
  • మెడికల్‌ సీట్లలో కోతపడే ప్రమాదం


హైదరాబాద్‌, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటుచేస్తున్న 8 వైద్య విద్య కళాశాలలకు ఇప్పటివరకు ప్రిన్సిపాళ్లను  నియమించలేదు. కాలేజీల ఏర్పాటుకోసం జాతీయ వైద్య మండలికి (ఎన్‌ఎంసీ) ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తు కూడా చేసింది. ఈ నెల్లోనే  ఎన్‌ఎంసీ ఆకస్మిక తనిఖీలకు రానుంది. ఎన్‌ఎంసీ చెక్‌లిస్టు ప్రకారం అధ్యాపకులు, సిబ్బంది లేకపోతే కొత్త కాలేజీలకు లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎలోవోపీ) ఇవ్వదు. ఈ విషయం అటు ప్రభుత్వానికి, ఇటు వైద్య విద్య ఉన్నతాధికారులకు తెలిసినప్పటికీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. కొత్త కాలేజీల్లో అధ్యాపకుల నియామకం, ప్రిన్సిపాళ్ల భర్తీ గురించి పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము కేటాయించే కొత్త మెడికల్‌ కాలేజీలకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు చేసుకోలేదని ఇటీవలే కేంద్రం పార్లమెంట్‌ సాక్షిగా వెల్లడించింది. కనీసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే కాలేజీల విషయంలోనైనా నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ కొత్త మెడికల్‌ కాలేజీలకు ఎన్‌ఎంసీ అనుమతి రాకుంటే ఆ నెపాన్ని కేంద్రంపై నెట్టే అవకాశాలు కూడా ఉన్నాయని కొందరు ప్రొఫెసర్లు అంటున్నారు.


టీవీవీపీ అధికారులకు తాత్కాలిక బాధ్యతలు 

కొత్త మెడికల్‌ కాలేజీలకు ఇంకా ప్రిన్సిపాళ్లను నియమించలేదు. కొద్దిరోజుల్లో ఎన్‌ఎంసీ తనిఖీలు ఉండటంతో తెలంగాణ వైద్య విధాన పరిషత్‌ (టీవీవీపీ) అధికారులకు తాత్కాలికంగా ఆ బాధ్యతలను అప్పగించారు. అలా చేయడం ఎన్‌ఎంసీ నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని నిపుణులు చెబుతున్నారు. తమకు అర్హతలు ఉన్నప్పటికీ ప్రిన్సిపాళ్లుగా బాధ్యతలు ఇవ్వలేదని పలువురు డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్‌ కాలేజీలకు, టీవీవీపీ అధికారులకు సంబంధం ఏముందని ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల మెడికల్‌ కాలేజీల్లో ప్రమాణాలు తగ్గే ప్రమాదం ఉందని అంటున్నారు. అలాగే కొత్త వైద్య కళాశాలల నిర్మాణ పనులు కూడా నత్తనడకన సాగుతున్నాయి. ఈ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, భవనాల శాఖకు అప్పగించింది. చాలా తక్కువ సమయంలో నిర్మించాల్సి ఉండటంతో హడావిడిగా పనులు చేస్తున్నారు. తనిఖీల సమయానికి ఎన్‌ఎంసీ  చెక్‌లిస్టు ప్రకారం సగం ఏర్పాట్లు కూడా పూర్తి కాకపోవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో... మళ్లీ తనిఖీలు జరిగేనాటికి పనులు పూర్తిచేయాలని ఎన్‌ఎంసీ సూచించవచ్చు. అప్పటికీ నిర్మాణాలు పూర్తికాకపోతే సీట్లలో కోత పెట్టడమో, లేకపోతే మొత్తానికే అనుమతిని నిరాకరించడమో చేస్తుంది.


అడిషనల్‌ డీఎంఈలకు పోస్టింగ్‌ ఎప్పుడు?

వైద్య విద్య సంచాలకుల పరిధిలో ఉన్న అడిషనల్‌ డైరెక్టర్లకు డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ (డీపీసీ) ద్వారా పదోన్నతులు ఖరారు చేశారు. కానీ ఇంతవరకు పోస్టింగ్‌ ఇవ్వలేదు. దీనికి సంబంధించిన ఫైల్‌ ప్రభుత్వం వద్దనే ఉందని, సర్కారే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైద్య విద్య ఉన్నతాధికారులు చెబుతున్నారు. డీపీసీ ప్రక్రియ పూర్తయి దాదాపు 3 నెలలు అవుతున్నా సర్కారులో కదలిక లేదు. దీని గురించి పట్టించుకునేవారే లేరని కొందరు ప్రొఫైసర్లు అంటున్నారు. అడిషనల్‌ డీఎంఈగా పదోన్నతి పొందిన వారినే వైద్య కళాశాలలకు ప్రిన్సిపాళ్లుగా నియమిస్తారు. వారినే మెడికల్‌ కాలేజీ అనుబంధ ఆస్పత్రులకు సూపరింటిండెంట్‌గా వేస్తారు. ప్రస్తుతం కొత్త కాలేజీలకు వీరిద్దరి అవసరం ఉంది. ఎన్‌ఎంసీ బృందాలు తనిఖీకి వచ్చినప్పుడు వైద్య అధ్యాపకులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు వంటి అంశాలనే చూస్తాయి. ప్రిన్సిపాళ్ల నియామకంలో జాప్యంతో పాలన, నిర్వహణపరమైన సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. సీట్లలో కోత పడే అవకాశం ఉందని తెలిసినా, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయడం లేదు.

Updated Date - 2021-12-06T08:06:57+05:30 IST