వైద్య కళాశాలలో వసతులేవీ?

ABN , First Publish Date - 2021-11-19T07:19:13+05:30 IST

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి జిల్లాకు మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. కళాశాలలో తరగతులు ప్రారంభమైనా నేటికీ వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వైద్య కళాశాలలో వసతులేవీ?

సొంత భవనం లేక విద్యార్థుల ఇక్కట్లు

శంకుస్థాపనకు రాజకీయ అడ్డంకులు?

మూడో బ్యాచ్‌ విద్యార్థులకు ఆన్‌లైన్‌ క్లాసులతోనే సరి

ఆందోళన బాటపట్టిన మెడికో విద్యార్థులు

నల్లగొండ, నవంబరు 18: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి జిల్లాకు మంజూరు చేసిన మెడికల్‌ కళాశాలకు రాజకీయ గ్రహణం పట్టుకుంది. కళాశాలలో తరగతులు ప్రారంభమైనా నేటికీ వసతులు కల్పించకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళాశాలతోపాటు హాస్టల్‌లో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు గురువారం రోడ్డెక్కి ఆందోళన నిర్వహించారు. వారం రోజుల క్రితం సైతం విద్యార్థులు ఆందోళన చేయగా, కళాశాల అధికారులు వారికి సర్దిచెప్పి విషయాన్ని గోప్యంగా ఉంచారు. అయితే అధికారులు ఇచ్చిన హామీలు నెరవేరకపోవడంతో విద్యార్థులు కళాశాల ఎదుట ధర్నా చేశారు.

భవనానికి రాజకీయ గ్రహణం

సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు 2019లో ఒకేసారి మెడికల్‌ కళాశాలలు మంజూరయ్యాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటికే భవన నిర్మాణం పూర్తి కాగా, నల్లగొండలో మాత్రం నేటికీ శంకుస్థాపనకు నోచుకోలేదు. కళాశాలను ఎస్‌ఎల్‌బీసీలో నిర్మించాలని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేత, హైదరాబాద్‌ రోడ్డులో నిర్మించాలని మరో నేత పట్టుబడుతున్న తెలిసింది. కొందరు ఎస్‌ఎల్‌బీసీలో స్థలం చూడగా, మరికొందరు హైదరాబాద్‌ రోడ్డులో స్థలాన్ని ప్రతిపాదనలకు పరిమితం చేశారు. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఉన్నతాధికారులు సైతం భవన నిర్మాణంతో పాటు స్థలం కేటాయింపు విషయాన్ని అటకెక్కించినట్టు తెలిసింది. రాజకీయ నేతల మధ్య విభేదాల కారణంగా జిల్లా కేంద్రంలో మెడికల్‌ విద్యార్థులకు నేటికీ సొంత భవనం లేకుండాపోయింది. ఇప్పటికే మూడో బ్యాచ్‌ విద్యార్థులకు తరగతులు కొనసాగుతుండగా, నేటికీ కనీస వసతులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రెండే తరగతి గదులు

ప్రస్తుతం ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఐదు తరగతి గదులు ఉండాలి. జిల్లా కేంద్ర ఆస్పత్రి వెనుక భాగంలో నిర్మించిన రెండు తరగతి గదుల్లోనే ప్రస్తుతం విద్యాభాస్యం కొనసాగుతోంది. ఒక్కో బ్యాచ్‌లో 150 మంది చొప్పున మొత్తం 450 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుతం రెండు బ్యాచ్‌లు మాత్రమే ఈ గదుల్లో ప్రత్యక్ష బోధన కొనసాగుతుండగా, మూడో బ్యాచ్‌ విద్యార్థులను ఆన్‌లైన్‌ క్లాసులకే పరిమితం చేశారు. విద్యార్థినులకు ఆస్పత్రి పైభాగంలో ఓ గదిలో వసతి కల్పించగా, అందులో కేవలం రెండే బాత్‌రూంలు ఉన్నాయి. 60 మందికి రెండే బాత్‌రూంలు ఉండటం వారికి ఇబ్బందిగా మారింది. కనీసం వాటిని శుభ్రంచేసే వారు కరువయ్యారు. విద్యార్థులకు ఎస్‌ఎల్‌బీసీలో హాస్టల్‌ వసతి కల్పించారు. అక్కడ విద్యుత్‌ ఎప్పుడు ఉంటుందో, పోతుందో తెలియని పరిస్థితి. పాములు, తేళ్లు హాస్టల్‌లోకి వస్తున్నాయి. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. అక్కడి నుంచి విద్యార్థులు కళాశాలకు రావాలంటే ఏడు కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. కళాశాలలో విద్యార్థులు కూర్చునేందుకు సరిపడా కుర్చీలు కూడా లేవు. ల్యాబ్‌ పేరుకే పరిమితమైంది. ఇక్కడ సామగ్రి, ఒక్క పరికరం కూడా లేదు. క్లీనికల్‌ పోస్టింగ్‌లో డెమానిస్ట్రేషన్‌రూం లేదు. ఆపరేషన్‌ థియేటర్‌లో సైతం వైద్య పరికరాలు సరిగా లేకపోవడంతో ప్రాక్టికల్‌ ఎలా చేయాలో విద్యార్థులకు అర్థంకావడం లేదు. వర్షం వచ్చినప్పుడు కళాశాల కురుస్తోంది. పాత భవనానికి రంగులు వేసి తరగతులు నిర్వహిస్తున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.

ఉన్నతాధికారులకు నివేదించాం : రాజకుమారి, మెడికల్‌ కళాశాల ప్రిన్సిపాల్‌

ప్రస్తుతం విద్యార్థులకు కావాల్సిన వసతుల గురించి ఉన్నతాధికారులకు నివేదిక పంపించాం. కళాశాలలో రెండు తరగతి గదులు ఉన్నాయి. మరో మూడు తరగతి గదులు అవసరం. సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఉన్నతాధికారులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.


సమస్యలు పరిష్కరించాలి

రెండు గంటల పాటు విద్యార్థుల ధర్నా, స్పందించని ప్రిన్సిపాల్‌

కలెక్టర్‌ను కలిసి సమస్యలను వివరించిన విద్యార్థులు

సమస్యలు చెబితే ప్రొఫెసర్లు బెదిరిస్తున్నారని ఆరోపణ

నల్లగొండ అర్బన్‌: మెడికల్‌ కళాశాల, హాస్టళ్లలో వసతులు కల్పించాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థులు గురువారం ఆందోళన నిర్వహించారు. సమస్యలను గతంలోనే ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారానికి నోచుకోకపోవడంతో విద్యార్థులు తరగతులను బహిష్కరించి కళాశాల ఎదుట రహదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, కళాశాల, హాస్టల్‌లో కనీస వసతులు లేవని ప్రిన్సిపాల్‌కు, ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్తే పరిష్కరించాల్సిందిపోయి ఇంటర్నల్‌ మార్కులు తగ్గిస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, సుమారు 2గంటలకు పైగా విద్యార్థులు ధర్నా నిర్వహించినా ప్రిన్సిపాల్‌ స్పందించలేదు. దీంతో విద్యార్థులు కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ను కలిసి కళాశాలలో సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్‌, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - 2021-11-19T07:19:13+05:30 IST