Jul 22 2021 @ 00:24AM

రీల్ హీరోలేనా?

ప్రతి సినిమాలో ఒక హీరో ఉంటాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా పోరాడతాడు. పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరిస్తాడు. సామాన్య ప్రజల్లో సినీ నటులకు ఇలాంటి ఇమేజ్‌ ఉంటుంది. కానీ నిజజీవితంలో సినీ నటులు అన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారా? ఈ ప్రశ్నకు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా)లో ఏర్పడిన విభేదాలు సమాధానం చెబుతాయి. 900 మంది సభ్యులున్న ఈ అసోషియేషన్‌కు ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై పెద్దలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఒకటి తర్వాత మరొకటిగా లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు.


-‘మా’లో తేలని వివాదం భిన్నవాదనలతో లేఖాస్త్రాలు

ప్రతి సినిమాలో ఒక హీరో ఉంటాడు. ఎన్ని అవాంతరాలు వచ్చినా పోరాడతాడు. పెద్ద పెద్ద సమస్యలను పరిష్కరిస్తాడు. సామాన్య ప్రజల్లో సినీ నటులకు ఇలాంటి ఇమేజ్‌ ఉంటుంది. కానీ నిజజీవితంలో సినీ నటులు అన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారా? ఈ ప్రశ్నకు మూవీ ఆర్టిస్ట్స్‌ అసోషియేషన్‌ (మా)లో ఏర్పడిన విభేదాలు సమాధానం చెబుతాయి. 900 మంది సభ్యులున్న ఈ అసోషియేషన్‌కు ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై పెద్దలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఒకటి తర్వాత మరొకటిగా లేఖాస్త్రాలు సంధించుకుంటున్నారు.


‘మా’ ఎన్నికలపై చెలరేగిన వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నిర్వహణ తేదీపై కొందరు సభ్యులు రాసిన లేఖలపై- క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అభిప్రాయం కోరుతూ మా ప్రధాన కార్యదర్శి జీవిత ఒక లేఖ రాసిన సంగతి తెలిసినదే! దీనిని కృష్ణంరాజు క్రమశిక్షణ సంఘంలోని నలుగురు సభ్యులకు పంపారు.  క్రమశిక్షణ సంఘం నుంచి రాజీనామా చేశాను కాబట్టి తాను ఈ విషయంపై స్పందించలేనని చిరంజీవి సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. అయితే వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఆయన తన అభిప్రాయం చెబితే దానిని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సి వస్తుందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. చిరంజీవి కాకుండా-  మిగిలిన నలుగురిలో మోహన్‌బాబు ఎన్నికలను వాయిదా వేయాలని కృష్ణంరాజుకు సూచించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. దీనికి భిన్నంగా జయసుధ ఎన్నికలను జరపాల్సిన అవశ్యకతపై సుదీర్ఘమైన లేఖ రాసినట్లు సమాచారం.  కోవిడ్‌ నేపథ్యంలో మా సభ్యులు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారని.. కొందరికి ఆరోగ్య పాలసీలు రెన్యువల్‌ చేయాల్సిన అవసరం ఉందని.. ఈ నేపథ్యంలో క్రియాశీలకమైన కమిటీ అవసరం ఎంత్తైనా ఉందని.. అందువల్ల  ఎన్నికలను వాయిదా వేయటం వల్ల ‘మా’కు మేలు జరగదంటూ జయసుధ తన లేఖలో పేర్కొన్నారని వర్గాలు వెల్లడించాయి. ఒకటి రెండు రోజుల్లో షూటింగ్‌ కోసం జయసుధ అమెరికాకు వెళ్తున్నారని.. మరో నెల రోజుల వరకూ తిరిగి రారని.. అందువల్ల ఆమె తన అభిప్రాయాన్ని మార్చుకొనే అవకాశమే లేదని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. మరో వైపు మురళీమోహన్‌ కూడా దాదాపు ఇదే ఉద్దేశాన్ని తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనితో మొత్తం కమిటీలో నలుగురు సభ్యులు ఉంటే వారిలో ఇద్దరు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తున్నట్లు అయింది. దీనితో క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడిగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న వేడి వాతావరణంలో ఏ నిర్ణయం తీసుకున్నా అది మరింత వివాదాస్పదమవుతుందనే భావన కృష్ణంరాజు ఉన్నట్లు సమాచారం. 


ఎందుకింత రభస..

కొద్ది కాలం క్రితం దాకా ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవంగానే జరిగేవి. ఆ తర్వాతి కాలంలో సినీ పరిశ్రమలో వచ్చిన రకరకాల మార్పుల వల్ల ‘మా’లో కూడా వర్గాలు ఏర్పడ్డాయి. సభ్యులు పోటీకి దిగటం మొదలుపెట్టారు. ప్రచారం కూడా వాడివేడిగానే సాగేది. 2021 మార్చిలో ‘మా’ కమిటీ పదవికాలం ముగిసిపోయింది. అయితే కోవిడ్‌ నేపథ్యంలో ఈ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని సందిగ్దత ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో ‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో ప్రకాష్‌ రాజ్‌, మంచువిష్ణులు దిగారు. ప్రకా్‌షరాజ్‌కు మెగాకుటుంబం పరోక్షంగా మద్దతు ఇస్తోంది. మంచువిష్ణుకు ప్రస్తుత అధ్యక్షుడు నరేష్‌ పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు. విష్ణు అభ్యర్థిత్వంపై మోహన్‌బాబు ఇప్పటి దాకా బహిరంగంగా వ్యాఖ్యలు చేయకపోయినా- ఆయన మద్దతు తన కుమారుడికే ఉంటుంది. ప్రస్తుత కమిటీ పదవికాలం మార్చితో ముగిసిపోయింది కాబట్టి.. ఎన్నికల తేదీని ప్రకటించాలని.. ఒక వేళ కోవిడ్‌ వల్ల వెంటనే ఎన్నికలు జరపలేకపోతే తాత్కాలికంగా ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రకా్‌షరాజ్‌ ప్యానల్‌ డిమాండ్‌ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై ప్రస్తుత కార్యవర్గం ఇంకా స్పందించలేదు. అయితే మా ఎన్నికల కాల పరిమితి బైలా్‌సలో లేదు కాబట్టి అత్యవసర పరిస్థితుల్లో ఆరేళ్ల వరకూ కొనసాగవచ్చని న్యాయ నిపుణులు సలహా ఇచ్చారు. దీనిపై కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది.