బాగున్నారా..?

ABN , First Publish Date - 2021-10-09T05:30:00+05:30 IST

జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటారు.

బాగున్నారా..?

  1. శారీరకంగా కాదు.. మానసికంగా..!
  2. ప్రతి నలుగురిలో ఒకరికి రుగ్మత
  3. జిల్లాలో 1600 మంది గుర్తింపు
  4. నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినం 


కర్నూలు(హాస్పిటల్‌), అక్టోబరు 9: జీవితంలో ఏదో ఒక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఒత్తిడిని ఎదుర్కొంటారు. నిద్రలేమి, పని ఒత్తిడి, చదువుల ఒత్తిడి, ఆర్థిక సమస్యలు, కుటుంబ తగాదాలు.. ఇలాంటివన్నీ మానసిక రుగ్మతలకు దారితీస్తాయి. తనను చూసి ఇతరులు నవ్వుకుంటున్నారని భ్రమపడడం, ఆందోళన, గుండె దడ, అతిగా మద్యం, మత్తు పదార్థాలు సేవించడం కూడా మానసిక వ్యాధులకు కారణాలుగా చెప్పవచ్చు. సమస్యలు ఉన్నవారు ఒంటరిగా గడపడం, సర్దిచెప్పేవారు, ధైర్యంచెప్పేవారు లేకపోవడం.. మరీ ముఖ్యంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కనుమరుగు అవుతుండటం ఇందుకు ముఖ్య కారణాలు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి నలుగురిలో ఒకరు మానసిక రుగ్మతలతో ఇబ్బందులు పడుతున్నట్లు నిపుణులు గుర్తించారు. ఇటీవల కొవిడ్‌ వల్ల చాలా మంది మానసిక వ్యాధులకు గురవుతున్నారు. పిచ్చిగా మాట్లాడటం, తనలో తాను మాట్లాడుకోవడం, రోడ్లపై ఒంటరిగా తిరగడం వంటి లక్షణాలు ఉంటే.. మానసిక సమస్యలుగా భావించాలి. వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 1992 నుంచి ప్రపంచ మానసిక ఆరోగ్య దినం నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘అసమానతల ప్రపంచంలో మానసిక ఆరోగ్యం’ అన్న నినాదాన్ని ఇచ్చింది. కర్నూలు, నంద్యాల, ఆదోని, డోన్‌లో 20 మందికి పైగా మానసిక వైద్యులు సేవలు అందిస్తున్నారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వ్యాధుల విభాగం ఓపీకి ప్రతిరోజూ దాదాపు 150 మంది వస్తుంటారు. అందులో 30 శాతం కొత్త వారు ఉంటున్నారు. జిల్లా జనాభా 45 లక్షలు కాగా, ఇందులో 20 శాతం మంది మానసిక సమస్యలతో బాధపడుతున్నారని వైద్యులు అంటున్నారు..


మానసిక సమస్యలకు కారణాలు 


శారీరక శ్రమ తగ్గడం 

ప్రశాంతత లోపించడం

పని ఒత్తిడి, నిద్రలేమి

ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం

చదువుల ఒత్తిడి, నిరుద్యోగం

చిన్న చిన్న తగాదాలు వచ్చినా సర్దిచెప్పేవారు లేకపోవడం

ఒంటరిగా, ఏకాంతంగా ఉండడం 


ఆరోగ్యంగా ఉండాలంటే 


ఒంటరిగా ఉండకుండా ఇష్టమైన పనులు చేయాలి 

బాధలు, కష్టాలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకోవాలి

ఉదయాన్నే వాకింగ్‌, ధ్యానం, యోగా చేయాలి 

ఇష్టమైన సంగీతం వినాలి


పేదలకు మానసిక వైద్యం అందించాలి..


మానసిక జబ్బులను సకాలంలో గుర్తించి చికిత్స చేయించుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మానసిక వ్యాధులకు చికిత్స అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ ఏడాది మధ్య తరగతి, పేద ప్రజలకు మానసిక వైద్యం అందుబాటులోకి తేవాలన్నది ప్రధాన అంశం. 2017 జాతీయ మానసిక ఆరోగ్య కార్యక్రమం సెక్షన్‌-18 కింద ఈ వ్యాధులు ఉన్న వారికి హెల్త్‌ ఇన్సూరెన్స్‌, అత్యవసర సేవలు, అంబులెన్స్‌ సౌకర్యాలు కల్పించాలి. శారీరక, మానసిక రోగులకు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. వివక్ష చూపకూడదు. 


 - డా.బి.రమేష్‌బాబు, మానసిక వ్యాధి నిపుణుడు, కర్నూలు 


వైద్యం అందుబాటులోకి తేవాలి..


అసమానతల ప్రపంచంలో మానసిక వైద్యం అందరికీ అందుబాటులోకి తేవాలి. జనాభాలో 20 శాతం మంది మానసిక సమస్యలతో ఉంటారు. వీరిలో 5 శాతం మంది తీవ్ర వ్యాధితో బాధపడుతున్నారు. పల్లెల్లో కన్నా పట్టణాల్లో మెరుగైన వైద్యం అందుబాటులో ఉంది. ముఖ్యంగా మానసిక వ్యాధులపై అవగాహన పెంచుకోవాలి. మానసిక వ్యాధులకు కారణమైన డిప్రెషన్‌, ఫోబియా, సోషల్‌ మీడియా, మద్యపానం, ఇతర చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ లక్షణాలు కనబడితే వెంటనే సైకియాట్రిస్టులను సంప్రదించాలి. 


 - డా.కె.నాగిరెడ్డి, మానసిక వైద్యనిపుణుడు, కర్నూలు 

Updated Date - 2021-10-09T05:30:00+05:30 IST