Advertisement
Advertisement
Abn logo
Advertisement

నిధుల దాహం తీరేనా...?

వరదలు, అధిక వర్షాలకు దెబ్బతిన్న తాగునీటి వనరులు

చెయ్యేరు,  పాపాఘ్ని, పెన్నా ఆధారంగా సీపీడబ్ల్యూఎస్‌ స్కీంలు

వరదకు పాడైన ఫిల్టర్‌ పాయింట్లు, పంపులు

మరమ్మతుల్లో 290 నీటి పథకాలు.. 22 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలే

285కు తాత్కాలిక మరమ్మతులు

శాశ్వత మరమ్మతులకు రూ.24.36 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదన

ప్రభుత్వం నిధులు ఇస్తేనే రాబోయే వేసవి దాహం తీరేది


చెయ్యేరు, పాపాఘ్ని, పెన్నా నదులకు వచ్చిన భారీ వరదలు, అధిక వర్షాలకు గ్రామీణ తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. ఫిల్టరు పాయింట్లు, విద్యుత్తు మోటార్లు పనిచేయడం లేదు. పైపులైన్లు కొట్టుకుపోయాయి. 290 నీటి వనరులు దెబ్బతిన్నట్లు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఇంజనీర్లు గుర్తించారు. అందులో సమగ్ర రక్షిత మంచి నీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) 22 ఉన్నాయి. శాశ్వత మరమ్మతులు చేసి నీటి పథకాలను పునరుద్ధరించాంటే రూ.24.36 కోట్లు అవసరమని ప్రభుత్వానికి నివేదిక పంపారు. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి తాగునీరు అందిస్తున్నా.. రాబోయే వేసవిని తలచుకొని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నిధులిస్తే వేసవి సీజన ప్రారంభం నాటికి మరమ్మతులు చేపట్టి తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవచ్చు. ప్రభుత్వం నిధులు ఇస్తుందా అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరదలకు ఛిద్రమైన తాగునీటి పథకాలపై ప్రత్యేక కథనం. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో గత నెల 16 నుంచి 19వ తేదీ వరకు జవాద్‌ తుపాన కారణంగా భారీ వర్షాలు కురిశాయి. సరిహద్దు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కూడా అదే స్థాయి వర్షాలు కురవడంతో ఆ ప్రభావం జిల్లాపై పడింది. చెయ్యేరు, పెన్నా, పాపాఘ్ని, చిత్రావతి నదులకు భారీగా వరదలు రావడం, వంకలు వాగులు ఉప్పొంగడంతో వాటి ఆధారంగా నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్‌) సహా పలు నీటి పథకాలు దెబ్బతిన్నాయి. జిల్లాలో కడప, రాజంపేట, జమ్మలమడుగు రెవిన్యూ డివిజన్ల పరిధిలో 26 మండలాల్లో 290 తాగునీటి వనరులు దెబ్బతిన్నాయి. అందులో సమగ్ర రక్షిత తాగునీటి పథకాలు 22 ఉన్నాయి. తక్షణమే అప్రమత్తమై 285 నీటి పథకాలకు తాత్కాలిక మరమ్మతులు చేసి వివిధ గ్రామాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చేశాం. పల్లెల్లో ఉన్న గ్రామీణ తాగునీటి పథకాలు (పీడబ్ల్యూఎస్‌), చేతి బోర్లు ద్వారా ప్రజలుకు తాగునీరు ఇస్తున్నామని, అవసరమైన పల్లెల్లో వ్యవసాయ బోర్లు అద్దెకు తీసుకుని నీటి సమస్య లేకుండా తక్షణ చర్యలు చేపట్టామని అధికారులు అంటున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. మరో మూడు నెలల్లో అంటే మార్చి నుంచి వేసవి సీజన ప్రారంభం అవుతుంది. చేతి బోర్లు, స్థానిక సోర్స్‌ పీడబ్ల్యూఎస్‌ స్కీంల ద్వారా గ్రామాల్లో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కోగలమా..? అసాధ్యమే అంటున్నారు ఇంజనీర్లు. 


నిధులు ఇస్తేనే దాహం తీరేది

సమగ్ర రక్షిత తాగునీటి పథకాల ఫిల్టర్‌ పాయింట్స్‌, విద్యుత్తు మోటార్లు, పైపులు బారీగా దెబ్బతిన్నాయి. వరద ప్రవాహం కొనసాగుతుండడంతో ఫిల్టర్‌ పాయింట్స్‌, పంపులు మరమ్మతులు చేయలేని పరిస్థితి ఉంది. 25 సీపీడబ్ల్యూఎస్‌ స్కీంలు ఉంటే 22 స్కీంలు దెబ్బతిన్నాయి. వాటి మరమ్మతులకు సరాసరి రూ.11.73 కోట్లు తక్షణం మంజూరు చేస్తే.. పంపులు, ఫిల్టరు పాయింట్స్‌, పైపులైన్లు మరమ్మతులు చేసి వచ్చే వేసవి నాటికి ఆ పథకాల పరిధిలోని 667 గ్రామాల్లో 4.69 లక్షల జనాభా దాహం తీర్చవచ్చని అంటున్నారు. అలాగే.. 268 వివిధ నీటి పథకాలు వరదల కారణంగా దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.12.63 కోట్లు అవసరం ఉంది. అంటే.. దెబ్బతిన్న 290 నీటి వనరుల శాశ్వత మరమ్మతులకు రూ.24.36 కోట్లు నిధులు కావాలంటూ జిల్లా కలెక్టరు ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన కేంద్ర బృందానికి కూడా అదే నివేదిక అందజేశారు. రోజులు గడిచినా నిధుల మంజూరుపై స్పష్టత రాలేదని ఓ అధికారి పేర్కొనడం కొసమెరుపు. రాబోయే వేసవి నీటి ఎద్దడిని సమర్థవంతగా ఎదుర్కొని గ్రామాల్లో తాగునీటి సమస్య రాకుండా చూడాలంటే తక్షణం ప్రభుత్వం నిధులు ఇవ్వాలి. ఈ రెండు మూడు నెలల్లో మరమ్మతులకు అవకాశం ఉంటుంది. వేసవి సీజన ప్రారంభంలో నిధులిస్తే.. హడావిడిగా చేసే పనుల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినే అవకాశం ఉందని ఇంజనీర్లే అంటున్నారు.


వరదలకు దెబ్బతిన్న నీటి పథకాలు కొన్ని

- కమలాపురం సీపీడబ్ల్యూఎస్‌ ద్వారా 25 గ్రామాలకు పాపాఘ్ని నది నుంచి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలి. భారీ వరద కారణంగా పైపులైన్లు, పంపులు, ఫిల్టరు పాయింట్లు రిపేరికి వచ్చాయి. రూ.12 లక్షలు నిధులు అవసరం ఉంది. వరదలు తగ్గగానే పనులు చేపట్టాలంటే నిధులు మంజూరు కావాలి. 

- సిద్దవటం మండలంలో పెన్నా నది నుంచి మాధవరం సీపీడబ్ల్యూఎస్‌ ద్వారా 19 గ్రామాలకు తాగునీరు అందుతోంది. పెన్నా వరదలకు మూడు ఫిల్టర్‌ పాయింట్లు, పంపులు దెబ్బతిన్నాయి. పైపులైన కొట్టుకుపోయింది. ఇదే పథకం నుంచి సిద్దవటం మరో ఐదు గ్రామాలకు తాగునీరు సరఫరా కోసం ఏర్పాటు చేసిన ఫైపులైన పూర్తిగా కొట్టుకుపోయింది. వీటికి రూ.20 లక్షలు నిధులు అవసరం ఉంది. 

- ఒంటిమిట్ట మండలంలో చింతరాజుపల్లి, మంటపంపల్లి, కోనరాజుపల్లి సహా 25 గ్రామాలకు పైగా స్వచ్ఛమైన తాగునీరు సరఫరాకు నందలూరు దగ్గర చెయ్యేరు నది ఒడ్డున సీపీడబ్ల్యూఎస్‌ హెడ్‌ వర్క్‌ పంపుహౌస్‌ నిర్మించారు. అన్నమయ్య ప్రాజెక్టు తెగిపోవడంతో నీటి పథకం పంప్‌హౌస్‌, ఫిల్టర్‌ వెల్స్‌, పంపింగ్‌ మెయిన పైపులైన, కేబుల్‌ వైర్‌ కొట్టుకుపోయాయి. మరమ్మతులకు రూ.90 లక్షలు, ఇదే మండలంలో ఒంటిమిట్ట సీపీడబ్ల్యూఎస్‌ పథకం కూడా ఇదే స్థాయిలో దెబ్బతింది. వీటి మరమ్మతులకు రూ.1.50 కోట్లు అవసరమని ప్రతిపాదన పంపారు. 

- లక్కిరెడ్డిపల్లి మండలంలో సుమారు 40 గ్రామాలకు తాగునీరు అందించేందుకు చెయ్యేరు నది ఆధారంగా రోళ్లమడుగు వద్ద ఎల్‌ఆర్‌ పల్లి సీపీడబ్ల్యూఎస్‌ హెడ్‌ వర్క్‌ నిర్మించారు. అక్కడి నుంచి పైపులైన వేశారు. వరద ఉధృతికి ట్రాన్సఫార్మర్‌, పైపులైన కొట్టుకుపోయాయి. మరమ్మతులకు రూ.23 లక్షలు అవసరం ఉంది. 

- పెనగలూరు మరో 21 గ్రామాలకు తాగునీరు సరఫరా కోసం పెనగలూరు సీపీడబ్ల్యూఎస్‌ నిర్మించారు. చెయ్యేరు నది ఆధారంగా ఈ పథకం ఏర్పాటు చేశారు. వరదలకు పంప్‌హౌస్‌, పంపుసెట్లు, కేబుల్‌ వైర్‌, మెయిన పైపులైన, ఫిల్టర్‌ సోర్స్‌ పూర్తిగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ.3.50 కోట్లు అవసరమని అంచనా వేశారు. 

- రాజంపేట మండలంలో హెచ.చెర్లోపల్లి, ఆకేపాటి, కె.బోయనపల్లి, అత్తిరాళ్ల సీపీడబ్ల్యూఎస్‌ పథకాలు పూర్తిగా వరదకు ఛిద్రం అయ్యాయి. వీటి మరమ్మతులకు రూ.1.90 కోట్లు కావాలని ఇంజనీర్లు నివేదిక పంపారు. ఇలా.. జిల్లాలో 22 సీపీడబ్ల్యూఎస్‌ తాగునీటి పథకాలు పూర్వస్థితికి తీసుకొచ్చి వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా చేయాలంటే రూ.11.73 కోట్లు ఇవ్వాలంటూ ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇంజనీర్లు ప్రభుత్వానికి నివేదిక పంపారు. 


డివిజన్ల వారిగా దెబ్బతిన్న నీటి వనరులు, కావాల్సిన నిధులు రూ.కోట్లలో 

డివిజన నీటి వనరులు నిధులు

కడప 111 5.76

రాజంపేట 111 14.12

జమ్మలమడుగు 68 4.48

మొత్తం 290 24.36


ప్రభుత్వానికి నివేదిక పంపాం 

- వీరన్న, ఎస్‌ఈ, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం, కడప

జిల్లాలో అధిక వర్షాలు, వరదలకు 290 పీడబ్ల్యూఎస్‌, సీపీడబ్ల్యూఎస్‌ తాగునీటి పథకాలు దెబ్బతిన్నాయి. 286 పథకాలు తాత్కాలిక మరమ్మతులు చేసి స్థానిక సోర్స్‌, చేతిబోర్లు ద్వారా తాగునీరు ఇస్తున్నాం. శాశ్వత మరమ్మతులకు రూ.24.36 కోట్లు నిధులు అవసరం ఉందని ప్రభుత్వానికి నివేదిక పంపాం. నిధులు రాగానే పనులు చేపడతాం. 

Advertisement
Advertisement