Abn logo
Apr 21 2021 @ 00:32AM

కల్యాణవైభోగమే..

భద్రాద్రి రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి

కొవిడ్‌ నేపధ్యంలో ఈసారీ నిత్య కల్యాణ మండపంలోనే నిర్వహణ

ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

హాజరుకానున్న రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించాలని ప్రభుత్వం సూచన


భద్రాచలం: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం పుణ్యక్షేత్రంలో బుధవారం శ్రీ సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. నవమి కల్యాణాన్ని ఏటా అంగరంగ వైభవంగా మిథిలాస్టేడియంలోని శిల్పకళాశోభిత కల్యాణ వేదికలో నిర్వహిస్తుండగా కరోనా విజృంభణతో గత సంవత్సరం తొలిసారి రామయ్య కల్యాణం అంతరంగికంగా నిత్యకల్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సారికూడా కరోనా సెకండ్‌వేవ్‌ ఉధృతి కారణంగా రామయ్య కల్యాణాన్ని అంతరంగికంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం నిత్య కల్యాణ మండపంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. రామయ్య కల్యాణం, శ్రీరామ మహాపట్టాభిషేకం కార్యక్రమాల నిర్వహణకు మొత్తం రూ.5లక్షలతో ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం అధికారులు పేర్కొన్నారు. కల్యాణ ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, దేవాదాయశాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, దేవస్థానం అధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు బుధవారం స్వామివారి కల్యాణంలో ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. 


కేసీఆర్‌ ద్వారా ప్రజా పరిపాలన సాగాలి: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి 

భద్రాద్రి రమాయ్య ఆశీస్సులతో సీఎం కేసీఆర్‌ త్వరలోనే కరోనా నుంచి కోలుకుంటారని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌ ద్వారా ప్రజాపరిపాలన సాగాలని ఆకాంక్షించారు. భద్రాచలంలో దేవస్థానం ఆధ్వర్యంలో రూపొందించిన శ్రీరామ ప్రచార రథాన్ని మంగళవారం సాయంత్రం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ శ్రీరామ ప్రచార రథం ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. కరోనా నేపధ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రామయ్యకల్యాణం నిరాడంబరంగా నిర్వహిస్తామని  తెలిపారు. స్వామివారి కల్యాణాన్ని భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించాలని కోరారు. పోస్టాఫీసు ద్వారా తలంబ్రాలు, ప్రసాదం పంపడానికి ఏర్పాట్లు చేశామన్నారు. భద్రాచలం విచ్చేసిన దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, దేవస్థానం ఈవో బి.శివాజీ ఇతర అధికారులు స్వాగతం పలికారు. రామయ్య కల్యాణం తిలకించేందకు రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే పొదెం వీరయ్య, జడ్పీ చైర్మన్‌ కోరం కనయ్య విచ్చేస్తున్నారు. 


సంప్రదాయబద్దంగా ఎదుర్కోలు 

నవాహ్నిక ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి భద్రాద్రిలో సంప్రదాయబద్ధంగా ఎదుర్కోలు ఉత్సవం జరిగింది. శోభాయమానంగా అలంకరించిన ఉత్సవమూర్తులను పల్లకిపై కొలువుదీర్చి ఆలయ ప్రాంగణంలో రామచంద్రుడు, సీతమ్మలను ఎదురెదురుగా ఆసీనులను చేశారు. రామచంద్రుడి వైపు అదర్వ వేద పండితులు, ఉపప్రధాన అర్చకులు కోటిశ్రీమన్నారణాచార్యులు, సీతమ్మ వైపు స్థానాచార్యులు కేఈ స్థలశాయి వివరించారు. ఈ సమయంలో అయోధ్య నుంచి రాముడు, మిథిల నుంచి సీతమ్మ తల్లి వచ్చినట్లుగా వర్ణించారు. అనంతరం మంగళ వాయిద్యాలకు అనుగుణంగా నృత్యం చేస్తూ మాలా పరివర్తన కార్యక్రమాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించారు. అనంతరం సీతారామచంద్రులను పక్క పక్కన ఆసీనులను చేసి ప్రత్యేక హారతిని సమర్పించారు. ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, చిన్నజీయర్‌స్వామి తరపున భద్రాచలం జీయర్‌మఠం నుంచి గట్టు వెంకటాచార్య దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. కార్యక్రమంలో దేవాదాయ శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌, దేవస్థానం ఈవో బి.శివాజీ, ఏఈవో వి.శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 


Advertisement
Advertisement