మహిళ హత్య కేసులో పదిమంది అరెస్టు

ABN , First Publish Date - 2020-12-04T05:49:58+05:30 IST

నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓబుల్‌నాయుడుపాలెంలో గతనెల 30న జరిగిన ఏమినేడి రాణిశ్రీ (50) హత్య కేసులో పోలీసులు పదిమంది నిందితులను అరెస్టు చేశారు.

మహిళ హత్య కేసులో పదిమంది అరెస్టు
వివరాలు వెల్లడిస్తున్న సౌత్‌ డీఎస్పీ ప్రశాంతి, సీఐ వీరాస్వామి, ఎస్‌ఐ ఆరోగ్యరాజు

గుంటూరు, డిసెంబరు 3: నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఓబుల్‌నాయుడుపాలెంలో గతనెల 30న జరిగిన ఏమినేడి రాణిశ్రీ (50) హత్య కేసులో పోలీసులు పదిమంది నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు గురువారం సౌత్‌ జోన్‌ డీఎస్పీ జెస్సీ ప్రశాంతి తన కార్యాలయంలో నల్లపాడు సీఐ వీరాస్వామి, ఎస్‌ఐ ఆరోగ్యరాజులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో కంచెర్ల సోమయ్య(చౌడవరం), ఓబులనాయుడుపాలేనికి చెందిన కంచర్ల శివమురళీకృష్ణ అలియాస్‌ చంటి, ఏమినేడి హరినాథ్‌, ఏమినేడి శ్రీహరి, ఏమినేడి రఘురాం, ఏమినేటి లింగాలు, ఏమినేడి వెంకటరావు, ఏమినేడి శంకరరావు, ఏమినేడి గోపీరాజ్‌, ఏమినేడి నాగరాజులను అరెస్టు చేశామన్నారు. ఓబులనాయుడుపాలేనికి చెందిన ఏమినేడి శ్రీహరిబాబు, పృధ్వీ పరారీలో ఉన్నారని తెలిపారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడ్పుగల్లు గ్రామానికి చెందిన రాణిశ్రీ 15 ఏళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి ఓబులనాయుడుపాలేనికి చెందిన వడ్డీ వ్యాపారి చెన్నయ్యగౌడ్‌తో సహజీవనం చేస్తుంది.  చెన్నయ్యగౌడ్‌కు గతంలో వివాహం కాలేదు. 2018లో వీరికి అఖిలేష్‌గౌడ్‌(2) కుమారుడు జన్మించాడు. ఆస్తిలో కొంతభాగం తమకు ఇవ్వాలని చెన్నయ్య గౌడ్‌ అన్నదమ్ముల పిల్లలు అడుగగా ఆయన ఒప్పుకోలేదు. అంతేగాక రాణిశ్రీకి కొంత ఆస్తి రాశాడు. అక్టోబరు 31న చెన్నయ్య గౌడ్‌ మృతి చెందగా రాణిశ్రీనే ఆయన్ను చంపి ఉంటుందేమోనని అతడి బంధువులు అనుమానించారు. దీంతో నవంబరు 1న నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో రాణిశ్రీపై ఫిర్యాదు చేశారు. అయితే చెన్నయ్యగౌడ్‌ అనారోగ్యంతో మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. దీంతో నిందితులు తరువాత రోజు రాత్రి రాణిశ్రీ దగ్గరకు వెళ్ళి బీరువాలో ఉన్న డబ్బులు, బంగారం, ఆస్తి రిజిస్ట్రేషన్‌ ఒరిజినల్‌ డాక్యుమెంట్లు తీసుకుని ఆమెను ఇంటి నుంచి గెంటేశారు. దీంతో బాధితురాలు నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎట్టకేలకు నవంబరు 26న నిందితులందరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతోపాటు, పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో చెన్నయ్యగౌడ్‌ అన్నదమ్ముల పిల్లలు, వారి పిల్లలు రాణిశ్రీపై కక్ష పెంచుకుని గత నెల 30న రాత్రి హతమార్చారు. 


Updated Date - 2020-12-04T05:49:58+05:30 IST