చట్టం ముసుగులో మోసం

ABN , First Publish Date - 2021-11-20T08:32:27+05:30 IST

రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు పేర్కొన్నారు. రైతులు ఇచ్చిన భూమిని ప్రభుత్వం తనవద్దే ఉంచుకొని అనుచిత లబ్ధిపొందేందుకు

చట్టం ముసుగులో మోసం

  • రాజధాని రైతులకు వంచన
  • అనుచిత లబ్ధి పొందేందుకే శాసనాధికారం దుర్వినియోగం
  • బిల్లులు ఆమోదించుకునే క్రమంలో ప్రతి దశలోనూ రాజ్యాంగ ఉల్లంఘన
  • అమరావతి పిటిషన్లపై హైకోర్టులో సీనియర్‌ న్యాయవాదుల వాదనలు


అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాజధాని రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం వారిని మోసం చేస్తోందని సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు పేర్కొన్నారు. రైతులు ఇచ్చిన భూమిని ప్రభుత్వం తనవద్దే ఉంచుకొని అనుచిత లబ్ధిపొందేందుకు ప్రయత్నించడం శాసనాధికారాన్ని దుర్వినియోగం చేయడమేనని తెలిపారు. మూడు రాజధానుల ఏర్పాటు ముసుగులో రైతులను ప్రభుత్వం మోసం చేస్తోందన్నారు. భూములు ఇచ్చిన రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇస్తామన్న ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు సవరణలు ప్రతిపాదించే అధికారం స్థానిక సంస్థలకే ఉంటుందని తెలిపారు. ఈ మేరకు ‘రైతు సమాఖ్య’ ఉపాధ్యక్షుడు పానకాల రెడ్డి, బెజవాడ సుప్రియ మరికొందరు వేర్వేరుగా హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం ఐదో రోజు విచారణ జరిగింది. చీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎ్‌సఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ముందు.. పిటిషనర్ల తరఫున ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ‘‘ప్రభుత్వం అధికార వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలు తీసుకురావడం ద్వారా భూములిచ్చిన రైతులను మోసం చేసింది.


రైతులిచ్చిన భూములకు తానే యజమాని అన్నట్లుగా వ్యవహరిస్తోంది. భూసేకరణ చట్టం కింద భూములు తీసుకొని ఉంటే వాటిని ఏం చేయాలనేది పూర్తిగా ప్రభుత్వ ఇష్టం. రాజధాని కోసం సమీకరణ ద్వారా భూములు తీసుకుంది. దీనివల్ల లబ్ధి చేకూరుతుందని రైతులకు చట్టబద్ధమైన హామీ ఇచ్చింది.  మాస్టర్‌ ప్లాన్‌లో వివిధ నగరాలు వస్తాయని, తద్వారా భూమి విలువ పెరుగుతుందని తెలిపింది. దీనికి భిన్నంగా 3 రాజధానులను తెరమీదకు తెచ్చింది. ప్రభుత్వ చర్యలతో ఆర్థిక నగరం అభివృద్ధి ఒప్పందం నుంచి సింగపూర్‌ కన్సార్టియం తప్పుకొంది. మరోవైపు ఎలకా్ట్రనిక్‌ సిటీ ఏర్పాటును రద్దు చేసి ఆ భూమిని నవరత్నాలకు వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒప్పందం నుంచి వైదొలగాలంటే రైతుల భూమిని పూర్వస్థితిలో తిరిగి ఇవ్వాలి. నష్టపరిహారం చెల్లించాలి. కానీ, ప్రభుత్వం ఆ భూమిని తన వద్దే ఉంచుకొని అనుచిత లబ్ధి పొందేందుకు యత్నించడం శాసనాధికారాన్ని దుర్వినియోగం చేయడమే. మాస్టర్‌ ఫ్లాన్‌కు సవరణలు చేయాలంటే ముందుగా రైతుల అభిప్రాయాలు తీసుకోవాలి.  ఏఎంఆర్‌డీఏ చట్టంలో ఆ రక్షణను ప్రభుత్వం తొలగించింది. ‘రూల్‌ ఆఫ్‌ లా’ అనేది రాజ్యాంగానికి ఆదార భూతమైంది. అది వ్యక్తిగత హక్కులను కూడా రక్షిస్తుంది. వికేంద్రీకరణ చట్టాల ద్వారా రైతులతో చేసుకున్న ఒప్పందాన్ని ప్రభుత్వం ఉల్లంఘిస్తూ వారి హక్కులను హరిస్తోంది. ప్రజల స్వేచ్ఛ, హక్కులకు భంగం కలిగినప్పుడు న్యాయస్థానాలు ఆదుకోవాలి. ఏ శాసనమైనా చట్టవిరుద్ధంగా ఉంటే దానిని రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ నేపథ్యంలో ‘మూడు’ చట్టాలను కొట్టేయండి’’ అని కోరారు. 


రాజ్యాంగ వంచనే!

సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌

ఎమ్మెల్సీ పి. అశోక్‌బాబు తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ వాదనలు వినిపించారు. ‘‘సీఆర్‌డీఏ రద్దు, వికేంద్రీకరణ బిల్లులను మండలి చైర్మన్‌ సెలెక్ట్‌ కమిటీకి నిర్దేశించారు. కమిటీ ఏర్పాటు చేయాలని కార్యదర్శిని ఆదేశించారు. అయితే కార్యదర్శి నిర్లక్ష్యం చేశారు. ప్రతిఫలంగా ప్రభుత్వం ఆయనకు పదోన్నతి కల్పించింది. రాజ్యాంగబద్ధ స్థానంలో ఉన్న తన ఆదేశాలను కార్యదర్శి పాటించడం లేదని మండలి చైర్మన్‌ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ సందర్భంగా బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపించినట్లు అడ్వకేట్‌ జనరల్‌ నివేదించారు. దీనికి భిన్నంగా సెలెక్ట్‌ కమిటీని ఏర్పాటు చేయలేదని కార్యదర్శి కౌంటర్‌లో పేర్కొన్నారు. అది కోర్టును తప్పుదోవ పట్టించడమే.


గడువు ముగియకముందే అధికరణ 197ను అనుసరించి ప్రభుత్వం మరోసారి బిల్లులను ఏకపక్షంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. గవర్నర్‌కు పంపించే బిల్లులో శాసనసభ స్పీకర్‌, మండలి చైర్మన్‌ సంతకం తప్పనిసరి. చైర్మన్‌ సంతకం లేకుండానే బిల్లును గవర్నర్‌కు పంపించడం రాజ్యాంగం పట్ల వంచనే. ఇరువురి సంతకాలు ఉన్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించకుండానే గవర్నర్‌ బిల్లులను ఆమోదించడం చట్టవిరుద్ధం. బిల్లులు ఆమోదించుకొనే క్రమంలో ప్రభుత్వం ప్రతి దశలోనూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడింది’’ అని ధర్మాసనానికి వివరించారు. సమయం లేకపోవడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది.

Updated Date - 2021-11-20T08:32:27+05:30 IST