‘కరోనాను తేలికగా తీసుకున్నాం.. తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం’

ABN , First Publish Date - 2020-08-05T05:00:09+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే.

‘కరోనాను తేలికగా తీసుకున్నాం.. తగిన మూల్యం చెల్లించుకుంటున్నాం’

లేఖ్ హవాసు సిటి: ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు అమెరికాలోనే నమోదైన విషయం తెలిసిందే. అయినప్పటికి అమెరికాలో అనేక మంది ఇప్పటికి ఫేస్‌మాస్క్ ధరించడానికి ఇష్టపడరు. అయితే స్వానుభవం అయితే కాని తత్వం బోధపడదు అని అన్నట్టు.. కరోనా బారిన పడితే తప్ప ఈ మహమ్మారి ఎంత ప్రమాదకరమైనదో చాలా మందికి తెలియడం లేదు. అమెరికాకు చెందిన ఓ జంటే దీనికి ఉదాహరణ. అరిజోనాకు చెందిన డెబి, మైఖేల్ పాటర్‌సన్ అనే జంట కరోనా మహమ్మారిని చాలా తేలికగా తీసుకున్నారు. కనీసం ఫేస్‌మాస్క్ కూడా లేకుండానే రోడ్లపై తిరిగేవారు. తీరా ఇప్పుడు కరోనా బారిన పడిన తరువాత తప్పు చేశామని తల బాదుకుంటున్నారు. కరోనా గురించి స్నేహితులతో జోకులు వేసుకునే వాళ్లమని.. ఇప్పుడు తగిన మూల్యం చెల్లించుకుంటున్నామని డెబి, ఆమె భర్త మైఖేల్ చెబుతున్నారు. జూన్ చివర్లో డెబీ, మైఖేల్ కరోనా బారిన పడ్డారు. డెబీకి ఊపిరి అందకపోవడంతో ఆక్సిజన్ కూడా పెట్టాల్సి వచ్చింది. కరోనా నుంచి ఇద్దరూ కోలుకున్నప్పటికి.. నెల రోజుల తరువాత కూడా డెబీలో కరోనా లక్షణాలు కనపడుతున్నాయి. ఇప్పటికీ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతోంది. తలనొప్పి, దగ్గు నిత్యం వస్తూనే ఉన్నాయి. కరోనా చికిత్స సమయంలో తన పక్క బెడ్ మీద ఉన్న వ్యక్తి కరోనా బారిన పడి మరణించాడని.. తాను కూడా అలాగే మరణించవచ్చేమోనని డెబీ ఆవేదన వ్యక్తం చేసింది. ఎవరైనా సరే కరోనాను లెక్క చేయకుంటే మరణాన్ని కోరి తెచ్చుకున్నట్టేనని ఈ జంట చెబుతోంది. తాము చేసిన తప్పు మరెవరూ చేయొద్దని.. ఫేస్‌మాస్క్ ధరించి భౌతికదూరం తప్పక పాటించాలని వీరు కోరుతున్నారు.

Updated Date - 2020-08-05T05:00:09+05:30 IST