ముంబై జట్టులో ఈ ఐదుగురూ బెంచ్‌కే పరిమితమా?

ABN , First Publish Date - 2021-04-07T01:22:15+05:30 IST

ఐపీఎల్‌ టైటిల్‌ను ఐదుసార్లు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి మరో రికార్డు సృష్టించేందుకు

ముంబై జట్టులో ఈ ఐదుగురూ బెంచ్‌కే పరిమితమా?

ముంబై: ఐపీఎల్‌ టైటిల్‌ను ఐదుసార్లు సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ ఈసారి మరో రికార్డు సృష్టించేందుకు రెడీ అవుతోంది. ఐపీఎల్ 2021ను కూడా రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకుంటే కనుక హ్యాట్రిక్ టైటిళ్లతోపాటు ఆరుసార్లు కప్పును సొంతం చేసుకున్న జట్టుగా రికార్డులకెక్కుతుంది. దీంతో ఈసారి మరింత పట్టుదలగా ఆడి కప్పుకొట్టాలని కృతనిశ్చయంతో ఉంది. బలమైన టాపార్డర్, మిడిలార్డర్‌తో జట్టు పటిష్టంగా ఉంది. జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టుకు అదనపు బలం.


ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ ఆసాంతం బెంచ్‌కే పరిమితం కానున్నట్టు సమాచారం. వారిలో ఒకరు అర్జున్ టెండూల్కర్ కావడం గమనార్హం. ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ యాజమాన్యం అతడిని బేస్ ‌ప్రైస్‌కే కొనుగోలు చేసింది. దీంతో అర్జున్ తొలిసారి ఐపీఎల్‌లో మెరవబోతున్నట్టు ప్రధానంగా వార్తలు వచ్చాయి. అయితే, అర్జున్ సహా పలువురు ఆటగాళ్లను ఐపీఎల్ మొత్తం బెంచ్‌కే పరిమితం చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. 


అర్జున్ టెండూల్కర్: జట్టులోకి అర్జున్ కొత్తగా వచ్చి చేరాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే డొమెస్టిక్ మ్యాచ్‌లు ఆడిన అనుభవం పెద్దగా లేదు. కాబట్టి ఈసారి ఐపీఎల్‌లో అతడి అరంగేట్ర మ్యాచ్ ఉండకపోవచ్చు. కాకపోతే, ట్రెంట్ బౌల్ట్, జహీర్‌ఖాన్ వంటి వారి నుంచి డ్రెస్సింగ్ రూములో చాలా విషయాలు నేర్చుకోవచ్చు. భవిష్యత్తు కోసమే యాజమాన్యం అతడిపై పెట్టుబడి పెట్టిందని చెబుతున్నారు.


ఆదిత్య తారే: ఇషాన్ ఖాన్, క్వింటన్ డికాక్ లాంటి ప్రొఫెషనల్ ఆటగాళ్ల సమ్మేళనంతో ఉన్న జట్టులో ఆదిత్య తారే అరంగేట్రం దాదాపు అసాధ్యం. వీరిద్దరిలో ఏ ఒక్కరైనా గాయపడితే తప్ప ఈసారి ఐపీఎల్‌లో తారేను చూడలేం. ఇద్దరూ పూర్తిగా అనుభవజ్ఞులు. తారేకు దేశవాళీ క్రికెట్‌లో అనుభవం ఉన్నప్పటికీ ఈ సీజన్‌లో మాత్రం అతడు బెంచ్‌కు పరిమితం కావడం ఖాయం. 


సౌరభ్ తివారీ: ఈ సీజన్‌లో బెంచ్‌కు పరిమితమయ్యే ఆటగాళ్లలో సౌరభ్ తివారీ ఒకడు. ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం అతడికి రాకపోవచ్చు. కిషన్, పాండ్యా సోదరులు, పొలార్డ్ వంటి వాళ్లు జట్టులో పాతుకుపోవడంతో తివారీని దాదాపు పక్కన పెట్టే అవకాశం ఉంది. 


మోసిన్ ఖాన్: ట్రెంట్ బౌల్ట్ అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న నేపథ్యంలో ఈ ఉత్తరప్రదేశ్ క్రికెటర్ సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశం ఉంది. 22 ఏళ్ల మోసిన్‌ను ముంబై ఇండియన్స్ తొలుత 2018లో కొనుగోలు చేసింది.  2020లో మరోసారి కనీస ధరకు సొంతం చేసుకుంది. లెఫ్టార్మ్ మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన మోసిన్ భవిష్యత్తులో మాత్రం జట్టులో కీలక ఆటగాడిగా మారతాడని యాజమాన్యం భావిస్తోంది. 


యుధ్‌వీర్ చరక్: జమ్మూకశ్మీర్‌కు చెందిన 23 ఏళ్ల ఈ మీడియం ఫాస్ట్ బౌలర్ గురించి చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. జస్ప్రీత్ బుమ్రా సహా ముంబై జట్టులో ఎంతోమంది పేసర్లు ఉన్నారు. కాబట్టి యుధవీర్‌కు ఈసారి అవకాశం అనుమానమే. చరక్ తన టర్న్ కోసం ఎదురుచూడడం తప్ప చేసేదేమీ లేదు. 

Updated Date - 2021-04-07T01:22:15+05:30 IST