పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2022-04-26T06:33:57+05:30 IST

జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు.

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

- ఇంటర్‌, పది పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో మినీ మీటింగ్‌ హాల్‌లో పదోతరగతి, ఇంటర్‌ పరీక్ష ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరీక్షల ప్రారంభానికి ముందే  డీఐఈవో, డీఈవోలు కేంద్రాలను సందర్శించాలని, తాగునీరు, విద్యుత్‌, ఫ్యాన్లు, మరుగుదొడ్ల వంటి సౌకర్యాలను పరిశీలించాలని అన్నారు. ఇంకా ఇతర సౌకర్యాలు కావాల్సి ఉంటే సంబంధిత శాఖల అధికారులతో పనులు చేపట్టాలన్నారు. పదోతరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్‌ 1 వరకు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఇందుకోసం 35 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 6,382 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలకు హాజరుకానున్నట్లు చెప్పారు. ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 6 నుంచి 24 వరకు ఉంటాయని, ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జరుగుతాయని పేర్కొన్నారు. మొదటి సంవత్సరం 4,474 మంది, రెండో సంవత్సరం 4462 మంది విద్యార్థులు కలిపి 8936 మంది పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు.  జిల్లాలో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎండాకాలం దృష్ట్యా విద్యార్థులు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పదోతరగతి, ఇంటర్‌ పరీక్ష కేంద్రాల్లో మాల్‌ ప్రాక్టీస్‌ జరగకుండా చూడాలని, రెవెన్యూ అధికారులను ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లుగా నియమించాలని అన్నారు. తహసీల్దార్లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేయాలని, పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలయ్యేలా చూడాలని అన్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా ట్రెజరీలో భద్రపరచాలని, పోలీస్‌ బందోబస్తుతో పరీక్ష కేంద్రాలకు రవాణా చేయాలని అన్నారు. ఇంటర్‌ పరీక్ష పత్రాలు, పోలీస్‌ స్టేషన్‌లో భద్రపర్చాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, ఏఎన్‌ఏంలను అందుబాటులో ఉంచాలని అన్నారు. 108 వాహనాలను వినియోగించుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా చేయాలని సెస్‌ అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సులను నడపాలన్నారు. విద్యార్థులు పరీక్ష సమాయానికి గంట ముందే వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 

Updated Date - 2022-04-26T06:33:57+05:30 IST