పకడ్బందీ స్ర్కీనింగ్‌

ABN , First Publish Date - 2020-04-08T10:15:33+05:30 IST

ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మతప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో ముగ్గురికి అందులో ఒకరి సోదరుడికి కరోనా వ్యాధి సోకడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం

పకడ్బందీ స్ర్కీనింగ్‌

హుజురాబాద్‌లో 35 బృందాలతో 2,433 మందికి పరీక్షలు 

నేడు కరీంనగర్‌ హుస్సేనీపురాలోనూ.. 

టెలీ మెడిసిన్‌ సెంటర్‌ ప్రారంభానికి నిర్ణయం 

కొనసాగుతున్న రెడ్‌జోన్‌...


కరీంనగర్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఢిల్లీలోని మర్కజ్‌లో జరిగిన మతప్రార్థనలకు వెళ్లివచ్చిన వారిలో ముగ్గురికి అందులో ఒకరి సోదరుడికి కరోనా వ్యాధి సోకడంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నది. మర్కజ్‌కు జిల్లా నుంచి 19 మంది వెళ్లగా హుజూరాబాద్‌కు  చెందిన ఇద్దరికి, కరీంనగర్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. మిగతా 16 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా వారికి నెగెటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ 19 మంది 27 మందితో నేరుగా కలువడం, సన్నిహితంగా ఉన్నామని తెలపడంతో వారిని  కూడా క్వారంటైన్‌కు తరలించి వైద్య పరీక్షల కోసం శాంపిల్స్‌ సేకరించాల్సి పంపించారు. ఇంకా రిపోర్టులు రావలసి ఉంది.  


హుజూరాబాద్‌పై ప్రత్యేక దృష్టి

హుజురాబాద్‌లో ముగ్గురికి పాజిటివ్‌ రావడంతో అధికారులు పట్టణంలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన ఇద్దరు వ్యక్తుల ఇళ్ళకు కిలో మీటర్‌ వైశ్యాలంలో అన్ని ఇళ్లలో నివసిస్తున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం 35 వైద్య బృందాలు 852 ఇళ్లకు వెళ్ళి 2,433 మందిని స్ర్కీనింగ్‌  చేశారు. బుధవారం స్ర్కీనింగ్‌ కొనసాగించాలని నిర్ణయించారు. ఇండోనేషియన్లకు సహాయకుడిగా వెళ్లి కరోనా బారిన పడ్డ రెండో వ్యక్తి కరీంనగర్‌లోని హుస్సేనిపురకు  చెందిన వ్యక్తి కావడంతో ఆ ప్రాంతంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.  బుధవారం ఉదయం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌కు చెందిన వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది 30 బృందాలుగా ఇంటింటికి వెళ్లి స్ర్కీనింగ్‌ నిర్వహించనున్నారు.


జిల్లాలో ఎమర్జెన్సీ వైద్య సేవలు మినహా ఇతర వైద్య సేవలను నిలిపివేయడంతో ప్రజలకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు టెలిమెడిసిన్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసే ఈ సెంటర్‌లో ఒక సైకియాట్రిస్టుతోపాటు ఇతర అన్ని విభాగాలకు చెందిన వైద్యలు ఆరోగ్య సలహాలు, సూచనలు ఇప్పిస్తారు. ఎవరైనా తనకు సంబంధించిన సమస్యను ఫోన్‌ ద్వారా తెలిపినట్లయితే సంబంధిత డాక్టర్‌ వారికి వైద్యానికి సంబంధించిన సూచనలు చేస్తారు. కరీంనగర్‌లోని ముకరంపుర, కాశ్మీరుగడ్డలో రెడ్‌జోన్‌ యాధావిధిగా కొనసాతున్నది. లాక్‌డౌన్‌ను పకడ్బందీగా కొనసాగిస్తుండడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.


నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రెడ్‌జోన్‌తోపాటు నగరంలోని అన్ని ప్రాంతాల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులను  చేపట్టడంతోపాటు రసాయనాలను స్ర్పే చేయిస్తున్నారు.  ఉమ్మడి జిల్లాలోని జగిత్యాలలో మూడు, పెద్దపల్లి జిల్లాలో రెండు కేసులు నమోదు కావడం, వరంగల్‌లో కూడా కరోనా వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉండడంతో జిల్లా యంత్రాంగం మరింత కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నది.


నలుగురు సభ్యులతో వైద్య బృందాలు

సుభాష్‌నగర్‌: మర్కజ్‌కు వెళ్లి వచ్చిన 19 మందిలో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ రాగా 16 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చింది. ముగ్గురిలో ఇద్దరు హుజురాబాద్‌కు చెందిన వారు కాగా ఒకరు నగరంలోని హుస్సేనిపురకు చెందిన వ్యక్తి.  హుస్సేనిపురలో స్ర్కీనింగ్‌పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ఐఎంఎ, ప్రైవేట్‌ నర్సింగ్‌హోమ్స్‌ వారితో కూడిన వైద్య బృందాలు ఏర్పాటు చేశామని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ సుజాత తెలిపారు. ఒక్కో బృందంలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, ఒక సూపర్‌వైజర్‌, ఒక ఎఎన్‌ఎం, ఒక ఆశా ఉంటారని తెలిపారు. ఈ వైద్య బృందాలు ఈ నెల 8న సూచించిన ప్రాంతంలోని ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాలకు స్ర్కీనింగ్‌ నిర్వహిస్తారని పేర్కొన్నారు. 


ప్రజలకు భరోసా.. చేయూత కేంద్రం

సుభాష్‌నగర్‌: కొందరు కొని దురలవాట్లకు బానిసలై మానసిక రుగ్మతలకు లోనవుతున్న వారికి కౌన్సెలింగ్‌ చేయుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో ప్రత్యేక కాల్‌సెంటర్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ కె శశాంక అన్నారు. కాల్‌సెంటర్‌ నంబరు 1800-4254731కు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎవరైనా ఎలాంటి సమస్యలు ఎదురైన పక్షంలో కాల్‌సెంటర్‌కు ఫోన్‌చేస్తే అక్కడి డాక్టర్లు, నర్సులు వారికి ఫోన్‌ ద్వారా  సూచనలు, సలహాలు ఇస్తారన్నారు. డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌, సంజయ్‌కుమార్‌, వర్షి, పృథ్వీరెడ్డి, ప్రీతి, శివకుమార్‌ అందుబాటులో ఉంటారని ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-08T10:15:33+05:30 IST