పాక్‌లో తీవ్ర సంక్షోభం

ABN , First Publish Date - 2020-10-22T07:46:52+05:30 IST

రాజకీయ సంక్షోభం దిశగా పాకిస్థాన్‌ పయనిస్తోంది. ఇమ్రాన్‌ ప్రభుత్వంతో పాటు ఆయనకు బాసటగా నిలిచిన సైన్యంపై అసంతృప్తి ప్రబలుతోంది...

పాక్‌లో తీవ్ర సంక్షోభం

  • సింధ్‌ పోలీస్‌ చీఫ్‌ను కిడ్నాప్‌ చేసిన ఆర్మీ
  • భగ్గుమన్న పోలీసులు.. ఆర్మీపై తిరుగుబాటు?

కరాచీ, అక్టోబరు 21: రాజకీయ సంక్షోభం దిశగా పాకిస్థాన్‌ పయనిస్తోంది. ఇమ్రాన్‌ ప్రభుత్వంతో పాటు ఆయనకు బాసటగా నిలిచిన సైన్యంపై అసంతృప్తి ప్రబలుతోంది. శుక్రవారం కరాచీలో 13 ప్రతిపక్షాల సంయుక్త ర్యాలీ ముగిశాక పీఎంఎల్‌ నేత మరియం నవాజ్‌ భర్త సఫ్దర్‌ అవాన్‌ను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. తమకు చెప్పకుండా ఎలా అరెస్ట్‌ చేస్తారని సింధ్‌ పోలీసులు ప్రశ్నించారు. దీంతో పారామిలటరీ దళాలు సోమవారం సింధ్‌ ఐజీ ముస్తాక్‌ మెహర్‌ ఇంటిపై దాడి చేసి ఆయనను కిడ్నాప్‌ చేశాయి. సఫ్దర్‌ అవాన్‌ను అరెస్ట్‌ చేయాల ని తానే ఆదేశాలిచ్చినట్లు ఆయనచేత బలవంతంగా పేపర్లపై సంతకాలు చేయించింది. దీంతో సింధ్‌ పోలీసులు భగ్గుమన్నారు. వందల మంది అధికారులు, పోలీసులు సామూహిక సెల వుకు దరఖాస్తు చేశారు.


వ్యవహారం సంక్షోభానికి దారితీస్తోందని భావించిన ఆర్మీ ఛీఫ్‌ కమర్‌ జావేద్‌ బజ్వా అంతర్గత విచారణకు ఆదేశించారు. దీంతో విచారణ పూర్తయ్యేదాకా.. 10 రోజుల దాకా సెలవులు పెట్టొద్దని ఐజీ ముస్తాక్‌ మెహర్‌ కోరారు. ఈ పరిణామాలపై ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ మౌనం దాల్చడం అగ్నికి ఆజ్యం పోసింది.ప్రభుత్వంపై విపక్షాలకు ఓ పెద్ద అస్త్రంగా మారి.. ముప్పేట దాడికి ఆస్కారమిచ్చింది. ఇప్పటికే విపక్షాలన్నీ సర్కార్‌పై సమరభేరి మోగించాయి. గుజ్రన్‌వాలా, కరాచీల్లో భారీ సభలు నిర్వహించాయి. జనవరిలో ఇస్లామాబాద్‌కు లాంగ్‌మార్చ్‌ చేస్తామని ప్రకటించాయి. వచ్చే రెండు నెలలూ ఇమ్రాన్‌కు గడ్డుకాలమే!


Updated Date - 2020-10-22T07:46:52+05:30 IST