కరోనా పోరులో చిన్నారుల సైన్యం!

ABN , First Publish Date - 2020-09-14T05:30:00+05:30 IST

మానవత్వంతో చేసే చిన్న సాయం కూడా సమాజాన్ని పెద్ద ఆపద నుంచి రక్షిస్తుంది. అలాంటి సాయం చేయడానికి పెద్ద మనుషులే అక్కర్లేదు.

కరోనా పోరులో చిన్నారుల సైన్యం!

మానవత్వంతో చేసే చిన్న సాయం కూడా సమాజాన్ని పెద్ద ఆపద నుంచి రక్షిస్తుంది. అలాంటి సాయం చేయడానికి పెద్ద మనుషులే అక్కర్లేదు. చిన్న పిల్లలైనా చాలు. జనం అందరూ బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే గడుపుతుంటే, ముర్షిదా ఖాటూన్‌ అనే 14 ఏళ్ల అమ్మాయి స్నేహితులను వెంటేసుకొని ఇంటింటికీ తిరుగుతూ కరోనా వ్యాపించకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన పెంచుతోంది. 


ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు కూడా చేయిస్తోంది ముర్షిదా. కొత్త వ్యక్తులు ఎవరైనా ఆ ప్రాంతంలో తిరుగుతుంటే ఆమె వెంటనే స్థానిక అధికారులకు తెలియజేస్తారు. 


కోల్‌కతాలోని పార్క్‌ సర్కస్‌ ఏరియా. అదొక పెద్ద మురికివాడ. ఆ ప్రాంతంలో కరోనా కేసులు అధిక సంఖ్యలో బయపడ్డాయి. లాక్‌డౌన్‌ విధించకముందు నుంచే ముర్షిదా, ఆమె స్నేహితురాళ్లు అక్కడి ప్రజలకు కరోనా సోకకుండా నివారించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను గురించి అవగాహన కల్పిస్తున్నారు. 


చేతులు శుభ్రంగా కడుక్కోవడం, సామాజిక దూరం పాటించడం, మాస్క్‌లు ఉపయోగించే విధానం గురించి ఇంటింటికీ తిరిగి చెబుతున్నారు. దీనికోసం రోజూ ఉదయం 7 గంటలకు ముర్షిదా స్నేహితురాళ్లతో కలసి మాస్క్‌, గ్లౌజులు ధరించి ఇంటి నుంచి బయల్దేరుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లి ప్రజలు సామాజిక దూరం పాటిస్తున్నారా? లేదా? అని పరిశీలిస్తారు. మురికివాడల్లో కిరాణా షాపుల దగ్గర జనం గుంపులుగా చేరతారు. దీని వల్ల కరోనా వ్యాప్తి చెందే అవకాశాలు ఎక్కువ.


అందుకే అక్కడ జనం వరుసలో ఎడంగా నిలబడేలా చూస్తారు. అయితే ముర్షిదా ఆమె స్నేహితురాళ్లు కూడా ఎక్కడ ఉన్నా సామాజిక దూరం పాటించడం మరువరు. సేవ్‌ స్వచ్ఛంద సంస్థ అక్కడి ప్రజలకు విటమిన్‌ ఎ, ఐదేళ్లలోపు చిన్నారులకు పాలను సరఫరా చేస్తోంది. ఈ చిన్నారుల సైన్యమే ఇళ్లకు వెళ్లి వాటిని తల్లితండ్రులకు అందజేస్తుంది.  


 అంతేకాదు ఎవరికైనా సాయం చేయాల్సివస్తే అధికారుల నుంచి ముర్షిదాకు పిలుపు వస్తోంది. ఎవరికైనా కరోనా లక్షణాలుంటే వారిని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పరీక్షలు కూడా చేయిస్తోంది ముర్షిదా. కొత్త వ్యక్తులు ఎవరైనా ఆ ప్రాంతంలో తిరుగుతుంటే ఆమె వెంటనే స్థానిక అధికారులకు తెలియజేస్తారు.

ఇప్పుడు పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో మేం అర్థం చేసుకున్నాం, కానీ పెద్దవాళ్లకు అర్థం కావడం లేదు. ఇది చాలా దురదృష్టకరం. అందుకే పరిస్థితులు మరింత విషమిస్తున్నాయి’ అని అంటున్నారు ముర్షిదా.         


Updated Date - 2020-09-14T05:30:00+05:30 IST