భారత సైన్యానికి చేరిన ఇజ్రాయెలీ డ్రోన్లు

ABN , First Publish Date - 2021-11-30T22:19:07+05:30 IST

భారత సైన్యం నిఘా సామర్థ్యం మరింత బలోపేతమైంది.

భారత సైన్యానికి చేరిన ఇజ్రాయెలీ డ్రోన్లు

న్యూఢిల్లీ : భారత సైన్యం నిఘా సామర్థ్యం మరింత బలోపేతమైంది. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన అడ్వాన్స్‌డ్ హెరోన్ డ్రోన్లను లడఖ్ సెక్టర్‌లో మోహరిస్తుండటంతో చైనా కార్యకలాపాలపై కట్టుదిట్టమైన నిఘా పెట్టేందుకు అవకాశం ఏర్పడింది. అత్యవసర పరిస్థితుల్లో ఆయుధాల సేకరణ నిబంధన క్రింద ఈ డ్రోన్లను మన దేశం కొనుగోలు చేసింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా వీటిని మన దేశానికి అప్పగించడంలో కొన్ని నెలలు జాప్యం జరిగింది. 


ఇజ్రాయెల్ నుంచి అడ్వాన్స్‌డ్ హెరోన్ డ్రోన్లు వచ్చినట్లు, వీటిని  తూర్పు లడఖ్ సెక్టర్లో మోహరిస్తున్నట్లు అత్యున్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు ఓ వార్తా సంస్థకు తెలిపాయి. ఈ డ్రోన్ల కార్యకలాపాలు ప్రారంభమైనట్లు చెప్పాయి. మన దేశంలో ప్రస్తుతం ఉన్న హెరోన్ డ్రోన్ల కన్నా ఇవి ఆధునికమైనవని పేర్కొన్నాయి. కొత్తగా వచ్చిన డ్రోన్లకుగల యాంటీ జామింగ్ కేపబిలిటీ అంతకుముందు డ్రోన్ల కన్నా చాలా మెరుగ్గా ఉన్నట్లు వెల్లడించాయి. 


ప్రస్తుతం చైనాతో సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఉండటంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం సాయుధ దళాలకు ప్రత్యేక ఆర్థిక అధికారాలు కల్పించింది. యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకోవడం కోసం రూ.500 కోట్ల విలువైన పరికరాలు, వ్యవస్థలను కొనుగోలు చేయడానికి రక్షణ దళాలకు అధికారం ఇచ్చింది. ఈ అధికారాన్ని వినియోగించి ఈ డ్రోన్లను కొనుగోలు చేశారు. మరోవైపు భారతీయ కంపెనీల నుంచి కొన్ని మినీ డ్రోన్లను రక్షణ దళాలు కొంటున్నాయి. 


Updated Date - 2021-11-30T22:19:07+05:30 IST