అర్ణబ్‌ రూ.40 లక్షలు ఇచ్చారు

ABN , First Publish Date - 2021-01-26T07:31:05+05:30 IST

టీవీ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్పీ) కుంభకోణం కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. రేటింగ్స్‌ మార్చేందుకు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీ్‌ఫ అర్ణబ్‌ గోస్వామి తనకు రూ.40

అర్ణబ్‌ రూ.40 లక్షలు ఇచ్చారు

విహార యాత్రలకు మరో 8.75 లక్షలిచ్చారు

రిపబ్లిక్‌కు అనుకూలంగా రేటింగులను  మార్చాను

బార్క్‌ మాజీ సీఈఓ పార్థో దాస్‌గుప్తా వాంగ్మూలం


ముంబై, జనవరి 25: టీవీ రేటింగ్‌ పాయింట్స్‌(టీఆర్పీ) కుంభకోణం కేసులో మరో మలుపు చోటుచేసుకుంది. రేటింగ్స్‌ మార్చేందుకు రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌-ఇన్‌-చీ్‌ఫ అర్ణబ్‌ గోస్వామి తనకు రూ.40 లక్షల లంచంతో పాటు రెండు విహార యాత్రల కోసం మరో రూ.8.75 లక్షలు ఇచ్చారని బ్రాడ్‌కాస్ట్‌ ఆడియన్స్‌ రిసెర్చి కౌన్సిల్‌(బార్క్‌) మాజీ చీఫ్‌ పార్థో దాస్‌గుప్తా ముంబై పోలీసులకు ఇచ్చిన రాతపూర్వక వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ వాంగ్మూలం ఆధారంగా ముంబై పోలీసులు ఈ నెల 11న టీఆర్పీ కుంభకోణంలో మరో సప్లిమెంటరీ చార్జిషీటును నమోదు చేయడంతో విషయం వెలుగుచూసింది. 3600 పేజీల ఈ చార్జిషీటులో బార్క్‌ ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నివేదికను, దాస్‌గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌లను, 59మంది ఇచ్చిన వాంగ్మూలాల్ని చేర్చారు.


గుప్తా వాంగ్మూలం యథాతథంగా.. 

‘‘నాకు అర్ణబ్‌ గోస్వామి 2004 నుంచీ తెలుసు. ఇద్దరం టైమ్స్‌ నౌలో పనిచేశాం. 2013లో బార్క్‌ సీఈవోగా నేను చేరాను. 2017లో అర్ణబ్‌ రిపబ్లిక్‌ టీవీని ప్రారంభించారు. తనకు సాయం చేయాలని అడిగేవారు. నాకు భవిష్యత్తులో అండగా నిలుస్తాననేవారు. దీంతో నా బృందంతో కలిసి టీఆర్పీ రేటింగుల్లో అవకతవకలకు పాల్పడి రిపబ్లిక్‌ టీవీకి అగ్రస్థానం వచ్చేలా చేశాను. ఇది 2017-2019 మధ్య కొనసాగింది. 2017లో అర్ణబ్‌ నన్ను సెయింట్‌ రెజీస్‌ హోటల్‌ వద్ద కలిసి నా ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌ యాత్రకోసం రూ.4.37 లక్షలిచ్చారు. 2019లోనూ అదే హోటల్‌ వద్ద నా డెన్మార్క్‌, స్వీడన్‌ యాత్ర కోసం మరో రూ.4.37 లక్షలిచ్చారు. 2017లో నన్ను ఐటీసీ పారెల్‌ హోటల్‌ వద్ద కలిసి రూ.20 లక్షల నగదు ఇచ్చారు. తర్వాత రెండేళ్లలోనూ అదే హోటల్‌ వద్ద ఏడాదికి రూ.10 లక్షల చొప్పున ఇచ్చారు’’ అని గుప్తా వాంగ్మూలంలో పేర్కొన్నారు. కాగా.. గుప్తాపై ఒత్తిడి తెచ్చి ఈ వాంగ్మూలాన్ని నమోదు చేయించి ఉంటారని ఆయన న్యాయవాది అర్జున్‌ సింగ్‌ పేర్కొన్నారు.


మరోవైపు.. రాజకీయ ప్రయోజనాల కోసం అర్ణబ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయన పరువును, రిపబ్లిక్‌ మీడియా పేరును దిగజార్చేందుకు కొందరు యత్నిస్తున్నారని రిపబ్లిక్‌ మీడియా నెట్‌వర్క్‌ ఆరోపిం చింది. కాగా.. బార్క్‌ మాజీ అధికారి కుట్రతో తీవ్ర నష్టం వాటిల్లిందని, సంస్థపై చర్యలు తీసుకునే ఆలోచనలో ఉన్నామని టైమ్స్‌ నౌ నెట్‌వర్క్‌ మాతృసంస్థ బెన్నెట్‌ కోల్‌మాన్‌ అండ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బీసీసీఎల్‌) ఒక ప్రకటనలో పేర్కొంది.


అర్ణబ్‌కు లీక్‌ ఇచ్చింది మోదీనే: రాహుల్‌

బాలాకోట్‌ దాడులపై రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్‌ గోస్వామికి ప్రధాని మోదీనే సమాచారం ఇచ్చారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరోపించారు. తమిళనాడులో సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్‌ కనూర్‌లో రోడ్‌ షోలో మాట్లాడారు. బాలాకోట్‌ దాడుల విషయం అత్యంత గోప్యమని, ప్రధాని, రక్షణమంత్రి, హోం మంత్రి, జాతీయ భద్ర తా సలహాదారు, వాయుసేన అధిపతికి మాత్రమే సమాచారం ఉంటుందన్నారు. ఈ ఐదుగురిలో ఎవరో ఒకరు ఆ జర్నలిస్టుకు సమాచారం అం దించి ఉండాలని, ఆ ఒక్కరు వాయుసేనకు నమ్మక ద్రోహం చేశారని వ్యాఖ్యానించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే విచారణకు ఆదేశించాని రాహుల్‌ డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2021-01-26T07:31:05+05:30 IST