ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయాలి

ABN , First Publish Date - 2021-05-18T05:32:34+05:30 IST

కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేసి, 50 శాతం పడకలు కొవిడ్‌ బాధితులకు కేటాయించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌.. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఆరోగ్యశ్రీని సక్రమంగా అమలు చేయాలి
కలెక్టరేట్‌ ఎదుట ర్యాలీగా వస్తున్న సీపీఐ నాయకులు

ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తేనే కరోనా రోగులకు సేవలు

కలెక్టరేట్‌ ఎదుట సీపీఐ ధర్నా

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 17: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సక్రమంగా అమలు చేసి, 50 శాతం పడకలు కొవిడ్‌ బాధితులకు కేటాయించాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌.. ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. కరోనా కట్టడి లో, మెరుగైన వైద్యం అందించడంలో ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా సోమవారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. కలెక్టరేట్‌లోపలికి ప్రవేశించేందుకు యత్నించిన సీపీఐ నాయకులను పోలీసులు అడ్డుకుని, వన్‌టౌన్‌ స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్‌ మాట్లాడుతూ జిల్లాలో కరోనా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉండడంతో నలుమూలల నుంచి బాధితులు.. సర్వజనాస్పత్రి, సూపర్‌ స్పెషాలిటీ, ఆర్డీటీ, హిందూపురం ఆస్పత్రులకు అధికసంఖ్యలో రావడంతో ఒత్తిడి పెరుగుతోందన్నారు. ఆస్పత్రుల్లో వెంటిలేటర్లు, ఆక్సిజన్‌, మెరుగైన వైద్యం అందక అనేకమంది పేదలు బలవుతున్నారన్నారు. జిల్లాలో వెయ్యి పడకల ఆస్పత్రిని మెరుగైన వసతులతో ఏర్పాటు చేసి, ప్రజల ప్రాణాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. కరోనాతో మరణించిన వారి కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలోని ప్రతి ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి వ్యాక్సిన్‌ సరఫరా చేసి, ప్రజలకు వేయాలన్నారు. కరోనా శ్యాంపిల్స్‌ సేకరణ పెంచి, ఎప్పటికప్పుడు టెస్టుల ఫలితాలను ప్రకటించాలన్నారు. కార్యక్రమలో సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు, జిల్లా కార్యవర్గసభ్యులు లింగమయ్య, రమణ, నగర సహాయ కార్యదర్శి అల్లీపీరా, నాయకులు రజాక్‌, బాలయ్య, రామాంజి, గాదిలింగప్ప, చాంద్‌బాషా, సుందర్‌రాజు, శ్రీనివాసులు, ఖాజా, దాదా, సూర్యనారాయణ, వసంతబాబు, మల్లికార్జున పాల్గొన్నారు.


Updated Date - 2021-05-18T05:32:34+05:30 IST