నిబంధనలు హుష్‌ కాకి!

ABN , First Publish Date - 2021-11-13T05:05:15+05:30 IST

రియల్టర్ల ఆగడాలకు హద్దూఅదుపు లేకుండా పోతోంది.

నిబంధనలు హుష్‌ కాకి!

  • ఇష్టానుసారంగా వెంచర్ల ఏర్పాటు
  • 10 శాతం స్థలాన్ని వదలకుండానే ప్లాట్లు
  • అక్రమాలకు పాల్పడుతున్న రియల్టర్లు
  • ఇబ్బంది పడుతున్న కొనుగోలుదారులు
  • కొందుర్గులో చర్యలు షురూ.. 


రియల్టర్ల ఆగడాలకు హద్దూఅదుపు లేకుండా పోతోంది. వెంచర్ల ఏర్పాటులో నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ధనార్జనే ధ్యేయంగా ప్లాట్లను తయారు చేసి అమాయకులకు విక్రయిస్తున్నారు. వ్యాపారుల మాయమాటలను నమ్మి మధ్యతరగతి వారు ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోతున్నారు. నిర్మాణ అనుమతులు దొరకక నానా పాట్లు పడుతున్నారు.


షాద్‌నగర్‌ : రియల్టర్ల మాయలో అమాయకులు చిక్కుకుంటు న్నారు. వారు వేసే ఉచ్చులో పడి మోసపోతున్నారు. అనుమతులు లేకుండా వెంచర్లను, ప్లాట్లను ఏర్పాటు చేసి కొనుగోలుదారులకు అంటగడుతున్నారు. ఆకర్షణీయమైన కరపత్రాలను సృష్టించి, పార్కు లను తలపించేలా ప్లాట్లను తీర్చిదిద్ది.. చాలామంది కొనుగోలు చేసేలా మాయమాటలు చెబుతున్నారు. ప్లాట్లను కొనుగోలు చేసిన తర్వాత  వాటికి అధికారిక అనుమతుల లేవని తెలుసుకొని నానా పాట్లు పడుతున్నారు. షాద్‌నగర్‌ నియోజకవర్గపరిధిలో వందల ఎకరాల్లో అక్రమ వెంచర్లు ఏర్పాటయ్యాయి. ఎలాంటి అనుమతులు లేకున్నా వీటిని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రూపాయి.. రూపాయి కూడ బెట్టుకొని ప్లాటు కొనుక్కుంటున్న మధ్యతరగతి వారు.. నిర్మాణ అనుమతులకు వెళ్లినప్పుడు అసలు నిజాలు బయటపడుతున్నాయి. రియల్టర్లు చెప్పినవన్నీ అబద్ధాలని, వెంచర్లకు అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని తెలుస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. 


నిబంధనలు బేఖాతర్‌ 

షాద్‌నగర్‌ నియోజకవర్గపరిధిలో పెద్ద, చిన్నా చితక కలిపి మొత్తం 560పైగా వెంచర్లు ఉన్నాయి. ఇందులో అత్యధికంగా మండలాల పరిధిలోని గ్రామాల్లో వెలసిన వెంచర్లతోపాటు హెచ్‌ఎండీఏ, డీటీసీపీ అనుమతులతో కూడినవి ఉన్నాయి. కానీ కొన్ని వెంచర్లలో ప్రజల అవసరాల నిమిత్తం గ్రామపంచాయతీ, లేదా మున్సిపాలిటీలకు 10శాతం స్థలాన్ని వదిలి ప్లాట్లు చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని వెంచర్లలో నిర్వాహకులు 10 శాతం స్థలాన్ని వదలకుండానే ప్లాట్లు చేసి విక్రయాలు చేపట్టారు. అలాంటి ప్లాట్లలో ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు అధికార యంత్రాంగం అనుమతించడం లేదు. 


కార్పొరేట్‌ మోసాలు 

రియల్‌ఎస్టేట్‌ రంగంలో కొన్ని కార్పొరేట్‌ సంస్థలు కూడా అక్ర మాలకు పాల్పడుతున్నట్లు ఆరోప ణలు వస్తున్నాయి. ఈ సంస్థలు ముందుగా 100 ఎకరాల్లో ప్లాట్ల నిర్మాణం కోసం హెచ్‌ఎండీఏ, డీటీ సీపీ సంస్థల నుంచి అనుమతులు పొందుతున్నారు. 100 ఎకరాలకు సరిపడా 10శాతం స్థలాన్ని మున్సి పల్‌ కమిషనర్‌ లేదా గ్రామకార్యదర్శి పేరిట రిజిస్ర్టేషన్‌ చేస్తున్నారు. ఆ తర్వాత ఫేస్‌ 2, ఫేస్‌ 3 అంటూ వంద ఎకరాల అనుమతి తీసుకున్న అనుమతులనే మిగతా ప్లాట్లకు వర్తింపచేస్తున్నారు. 10 శాతం స్థలం 100 ఎకరాలకు మాత్రమే వదిలేస్తున్నారు. అలాగే 100 ఎక రాల్లో ప్లాట్ల కోసం తీసుకున్న అనుమతులను మిగతా ఎకరాల్లో విస్తరించిన ప్లాట్లకు కూడా అవే అనుమతులు చూపుతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్లాట్లు కొనుగోలు చేసి, ఇండ్ల నిర్మాణాల కోసం అనుమతి కోసం వెళ్లినప్పుడు మాత్రమే సదరు వెంచర్లలోని ప్లాట్లకు అనుమతుల్లేవన్న విషయం వెలుగులోకి వస్తున్నట్లు తెలిసింది. 


పాత వెంచర్ల పరిస్థితి ఏంటి ? 

2002 నుంచి 2014 వరకు వెలసిన వెంచ ర్లలో ఎలాంటి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదు. ఆ వెంచర్లు చేయడానికి నిర్వాహకులకు ఎవరు అనుమతులు జారీ చేశారు. ఇండ్ల నిర్మాణానికి ఎలా అనుమతి లభించిందన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ప్రస్తుతం కొత్తగా వెలుస్తున్న వెంచర్లు కూడా నిబంధనలకు లోబడి ఉన్నాయా? హెచ్‌ఎండీఏ, డీటీసీపీ నిబంధనల ప్రకారం వెంచర్లు చేస్తున్నారా? ఎన్ని ఎకరాలకు పర్మిషన్‌ ఉంది. ఎన్ని ఎకరాల్లో వెంచర్లు చేస్తున్నారనే విషయాలను సంబంధిత అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నా రన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.


నమ్మి మోసపోయాం

నేను ప్లాటు కొన్న వెంచర్‌కు అనుమతి లేదనే విషయం తెలియదు. 2018లో రూ.8లక్షలు పెట్టి 275గజాల ప్లాటు కొన్నాను. ఇంటి నిర్మా ణం చేపడితే గ్రామ పంచాయతీ అధికారులు అడ్డుకుంటున్నారు. గ్రామ పంచాయతీ అనుమతి లేకుండా వెంచర్‌ ఏర్పాటు చేశారని, ఇందులో ఇంటి నిర్మాణానికి అనుమతులు ఇవ్వ లేమని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు. ఎల్‌ఆర్‌ఎస్‌ కట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇంటి నిర్మాణానికి అనుమతించేలా పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. 

- అనిల్‌ బాధితుడు, కొందుర్గు


చర్యలు చేపట్టాం

అనుమతులు లేకుండా చేసిన వెంచర్ల నిర్వా హకులపై చర్యలు చేపట్టాం. ఎక్కడెక్కడ వెం చర్లు ఉన్నాయి. అనుమతులున్నాయా? లేవా? అని గుర్తిస్తున్నాం. వెంచర్లలో ప్లాట్ల కొను గోలుపై ప్రజలను చైతన్యపరుస్తాం. ఆయా మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, నగర పంచాయతీల్లో చేసిన వెంచర్లలో 10 శాతం స్థలం వదలకుంటే ఇండ్ల నిర్మాణానికి అనుమతి లభించదు. కొత్తగా చేస్తున్న వెంచర్లలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నారా? లేదా ? అనే విషయాలను కూడా పరిశీలిస్తున్నాం. నిబంధనలను అతి క్రమిస్తే వారిపై కూడా చర్యలు తీసుకుంటాం. 

- సురేష్‌, డీఎల్‌పీవో


నియోజకవర్గంలోని వెంచర్ల వివరాలు

మండలం మొత్తం వెంచర్లు  అనుమతి లేనివి  

ఫరూఖ్‌నగర్‌  180 24

కొత్తూరు 160 36

నందిగామ  150 22

కొందుర్గు 11 06

కేశంపేట  10  02 

Updated Date - 2021-11-13T05:05:15+05:30 IST