జిల్లాలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

ABN , First Publish Date - 2021-10-15T05:35:48+05:30 IST

విజయానికి సూచికగా జరుపుకునే పండుగే విజయదశమి. విజయదశమి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున చేపట్టిన ప్రతీ పనిలో విజయం లభిస్తుందని నమ్మకం.

జిల్లాలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్‌లో ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎస్పీ సుదీంద్ర

- నేడు దసరా

- శమీ పూజకు ఏర్పాట్లు 

ఆసిఫాబాద్‌, అక్టోబరు 14: విజయానికి సూచికగా జరుపుకునే పండుగే విజయదశమి. విజయదశమి చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున చేపట్టిన ప్రతీ పనిలో విజయం లభిస్తుందని నమ్మకం. విజయదశమి అంటే విజయాలను కలుగచేసే దశమి అని అర్థం. చెడు మీద మంచి విజయం సాధించినందుకు గుర్తుగా మనం విజయ దశమి పండుగను ప్రతీ సంవత్సరం జరుపుకుంటాం. అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీ నవరాత్రులు జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. ఆశ్వయుజ మాసం నుంచి వర్ష రుతువు వెళ్లి శరద్‌ రుతువు ప్రవేశిస్తుంది. కనుక ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు.  

ఏర్పాట్లు పూర్తి..

జిల్లాలో దసరా ఉత్సవాలను శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో పెద్దవాగు నదితీరాన ఏర్పాట్లను హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో పూర్తి చేశారు. విజయ దశిమి ఉత్సవాలతో పాటు రావణ దహన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉత్సవాల ఏర్పాట్లను ఎస్పీ అడ్మిన్‌ వైవీఎస్‌ సుదీంద్ర పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా చుడాలని డీఎస్పీ శ్రీనివాస్‌, సీఐ అశోక్‌ను అదేశించారు. అలాగే కాగజ్‌నగర్‌ పట్టణంలో త్రిశూల్‌ పహాడ్‌ ప్రాంగణంలో ఉత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అదే విధంగా జిల్లాలోని సిర్పూర్‌(టి), కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూరు, దహెగాం, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్‌, సిర్పూర్‌(యూ), లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లో కూడా ఏర్పాట్లను పూర్తి చేశారు. 

Updated Date - 2021-10-15T05:35:48+05:30 IST