భవితవ్యం తేలేది నేడే

ABN , First Publish Date - 2021-09-19T05:17:51+05:30 IST

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలిపోనుంది. ఐదు నెలలుగా ప్రాదేశిక ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర పడనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కొవిడ్‌ నిబంధనల నడుమ జిల్లాలోని పది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

భవితవ్యం తేలేది నేడే
ఇచ్ఛాపురం: పురుషోత్తపురం ఏపీ మోడల్‌ స్కూల్‌లో ఏర్పాట్లు

- ప్రాదేశిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

- ఉదయం 8 గంటల నుంచి ప్రక్రియ ప్రారంభం

- సాయంత్రానికే పూర్తి స్థాయి ఫలితాలు వెల్లడి

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల భవితవ్యం నేడు తేలిపోనుంది. ఐదు నెలలుగా ప్రాదేశిక ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెర పడనుంది. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తిచేశారు. కొవిడ్‌ నిబంధనల నడుమ జిల్లాలోని పది కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ కేంద్రాల్లో 68 కౌంటింగ్‌ హాళ్లతో పాటు 627 టేబుళ్లను సిద్ధం చేశారు. జడ్పీటీసీ స్థానాలకు 37 టేబుళ్లను, ఎంపీటీసీ స్థానాలకు 590 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 854 మంది కౌంటింగ్‌ సూపర్‌ వైజర్లు, 863 మంది అసిస్టెంట్‌ సూపర్‌ వైజర్లు 2,584 మంది కౌంటింగ్‌ అసిస్టెంట్లను నియమించారు. ప్రతి టేబుల్‌ వద్ద పర్యవేక్షణ అధికారితో పాటు రిజర్వ్‌ సిబ్బంది ఉంటారు. శనివారం సాయంత్రానికే కేంద్రాల వద్దకు రిటర్నింగ్‌ అధికారులు చేరుకున్నారు. పార్టీల తరఫున ఏజెంట్లు ఆదివారం ఉదయం 6 గంటలకు లెక్కింపు కేంద్రాలకు చేరుకోవాలని ఆదేశించారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసుకున్నట్టు ఆధారాలు చూపితేనే ఏజెంట్లను లోపలికి అనుమతించనున్నారు. ప్రతి కౌంటింగ్‌ హాల్‌లో వెబ్‌కాస్టింగ్‌, వీడియో రికార్డింగ్‌, జనరేటర్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు చేయనున్నామని, ఎవరూ గుమిగూడరాదని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. 


లెక్కింపు కేంద్రాలు ఇవే:

 రాజాంలోని జీఎంఆర్‌ వరలక్ష్మి డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌, ఇచ్ఛాపురంలోని  పురుషోత్తపురం ఏపీ మోడల్‌ స్కూల్‌, పలాస, ఆమదాలవలసలలో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, శ్రీకాకుళం, నరసన్నపేటలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు, టెక్కలిలో ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల, పాతపట్నంలో  ఏపీఎస్‌ డబ్ల్యుఆర్‌ స్కూల్‌,  ఎచ్చెర్ల మండలం చిలకపాలెంలోని  శ్రీ శివానీ ఇంజినీరింగ్‌ కళాశాల, పాలకొండలో డీఏవీ స్కూల్‌ (అన్నవరం)లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.


సర్వత్రా ఉత్కంఠ....

జిల్లాలో 38 జడ్పీటీసీ స్థానాలు, 667 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. హిరమండలం టీడీపీ అభ్యర్థి దారపు నారాయణరావు మృతి చెందడంతో అక్కడ జడ్పీటీసీ ఎన్నికలు నిలిచిపోయాయి. మిగతా 37 స్థానాలకు ఈ ఏడాది ఏప్రిల్‌ 8న ఎన్నికలు నిర్వహించారు. అలాగే 667 ఎంపీటీసీ స్థానాలకు 66 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 చోట్ల ఎంపీటీసీ అభ్యర్థులు మరణించారు. మిగిలిన 590 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. అభ్యర్థులు గెలుపుపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఐదు నెలల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టనుండడంపై ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ మండల ఫలితాలు ముందుగా వస్తాయనే దానిపై చర్చ మొదలైంది. అధికారుల అంచనా ప్రకారం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓట్లను వేర్వేరు కట్టలుగా కట్టి టేబుళ్లపై పెట్టేందుకు కనీసం 2 గంటల సమయం పడుతుంది. ఈ ప్రక్రియ ఉదయం 11 గంటలకు పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. తక్కువ ఓట్లు పోలైన ఎంపీటీసీ స్థానాల ఫలితాలు మధ్యాహ్నం 12 గంటలకే వెల్లడికానున్నాయి. మధ్యాహ్నం 3 గంటలలోగా లెక్కింపు ప్రక్రియ పూర్తికానుంది. సాయంత్రానికి పూర్తిస్థాయిలో ఫలితాలు వెల్లడవుతాయి. 


తొలి ఫలితం హిరమండలం!

-హిరమండలం ఒకటో ఎంపీటీసీ స్థానం ఫలితంగా ముందుగా వెలువడే అవకాశం ఉంది. ఈ మండలంలో ఒకటో ఎంపీటీసీ స్థానానికి కేవలం 215 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. రెండో ఎంపీటీసీ స్థానానికి 300 ఓట్లు పోలయ్యాయి. ఈ రెండు స్థానాల ఫలితాలు దాదాపు 12 గంటలకే వెలువడే అవకాశముంది. 

-ఆమదాలవలస మండలం తోటాడ ఎంపీటీసీ స్థానానికి 2,949 ఓట్లు, ముద్దాడ ఎంపీటీసీ స్థానానికి 2,928 ఓట్లు పడ్డాయి.

- రణస్థలం మండలం నారువ ఎంపీటీసీ స్థానానికి 2,928 ఓట్లు, బూర్జ మండలం పెద్దపేట ఎంపీటీసీ స్థానానికి 2,856 ఓట్లు, జి.సిగడాం మండలం డీఆర్‌ వలస ఎంపీటీసీ స్థానానికి 3,053 ఓట్లు, రణస్థలం మండలం వేల్పురాయి ఎంపీటీసీ స్థానానికి 2,856 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానాల ఫలితాలు చివరిగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 

-ఇక జడ్పీటీసీ స్థానాల విషయానికి వస్తే, వంగర జడ్పీటీసీ స్థానానికి 17,028 ఓట్లు, పలాస - 17,049, భామిని-17,721 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానాల ఓట్ల లెక్కింపు వేగంగా పూర్తి కానుంది. మధ్యాహ్నం ఒంటిగంట లోపే ఫలితాలు రావచ్చు. 

-రణస్థలం జడ్పీటీసీ స్థానానికి 48,807 ఓట్లు, పొందూరు జడ్పీటీసీ స్థానానికి 42,448 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానాల ఫలితాలు చివరగా వెల్లడయ్యే అవకాశం ఉంది.  


 పలాస, పాతపట్నం కేంద్రాల్లో ఎస్పీ అమిత్‌బర్దర్‌ పరిశీలన 

పలాస/పాతపట్నం, సెప్టెంబరు 18:   పలాస, పాతపట్నం ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు కేంద్రాలను  శనివారం ఎస్పీ అమిత్‌బర్దర్‌ పరిశీలించారు. పలాస నియోజకవర్గంలో పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండలాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ప్రాదేశిక ఓట్ల లెక్కింపు పలాసలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ఆవరణలో ఆదివారం చేపట్టనున్నారు. ఓట్ల లెక్కింపుపై ఎన్నికల అధికారి, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు, సహాయ ఎన్నికల అధికారి డాక్టర్‌ ఎం.రవికృష్ణ సిబ్బందికి శనివారం శిక్షణ ఇచ్చారు. లెక్కింపు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓట్లు భద్రపరచడం, వాటిని రికార్డులో ఎలా పొందుపరచాలో చూపించారు. రిటర్నింగ్‌ అధికారి, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడుతో ఏర్పాట్లపై ఎస్పీ అమిత్‌బర్దర్‌ చర్చించారు. ఎటువంటి చిన్న సంఘటన చోటుచేసుకున్నా తక్షణమే తెలియజేయాలని సూచించారు. పలాసకు ఒకటి, మందస, వజ్రపుకొత్తూరు మండలాలకు రెండు చొప్పున లెక్కింపు కేంద్రాలు ఏర్పాటు చేశామని రమేష్‌నాయుడు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ లెక్కింపు చేపట్టనున్నట్టు వెల్లడించారు. అలాగే పాతపట్నంలోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని ఎస్పీ అమిత్‌బర్దర్‌, ఐటీడీఏ పీవో సీహెచ్‌ శ్రీధర్‌లు సందర్శించారు. ఈ కేంద్రంలో పాతపట్నం, మెళియాపుట్టి, హిరమండలం, కొత్తూరు, ఎల్‌.ఎన్‌.పేట మండలాలకు సంబంధించిన ఓట్లను లెక్కించనున్నారు. ఇందుకు సంబంధించి ఎస్పీ, పీవోలు, అధికారులు, సిబ్బందికి వివిధ సూచనలు చేశారు.   


850 మంది పోలీసులతో బందోబస్తు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి : ప్రాదేశిక ఓట్ల లెక్కింపు పకడ్బందీగా చేపట్టేలా ఎస్పీ అమిత్‌బర్దర్‌ చర్యలు చేపట్టారు. లెక్కింపు కేంద్రాల వద్ద 850 మందితో పోలీసు బందోబస్తును సిద్ధం చేశారు. ఇద్దరు ఏఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 17 మంది సీఐలు, 50 మంది ఎస్‌ఐలు, 772 మంది ఏఎస్‌ఐలు, హెడ్‌కానిస్టేబుళ్లు, సాధారణ కానిస్టేబుళ్లు, హోంగార్డులను కేటాయించారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిధిలో స్పెషల్‌ స్ట్రయికింగ్‌ బలగాలతో పెట్రోలింగ్‌ చేసే విధంగా ప్రత్యేక భద్రత ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాల పరిధిలో అదనపు బలగాలు  మోహరించాయి. అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు దగ్గర ప్రత్యేక బలగాలు తనిఖీలు చేస్తున్నాయి. నేరచరిత్ర లేని ఏజెంట్లను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. 144 సెక్షన్‌ అమలు చేయనున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియపై ఫిర్యాదులంటే 63099 90933 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. 

Updated Date - 2021-09-19T05:17:51+05:30 IST