Abn logo
Oct 22 2021 @ 00:08AM

ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి

బద్వేలులో ఎన్నికల ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతున్న ఎన్నికల అధికారి విజయానంద్‌

ప్రశాంత వాతావరణంలో ఓటింగ్‌ జరిగేలా చర్యలు 

నవంబరు 30 వరకు ప్రత్యేక ఓటరు నమోదు

రాష్ట్ర ఎన్నికల అధికారి కె.విజయానంద్‌

కడప(కలెక్టరేట్‌), అక్టోబరు 21: బద్వేలు ఉప ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేశామని స్వేచ్ఛాయుత, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ కోరారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్సు హాలులో బద్వేలు ఉప ఎన్నికల నిర్వహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ విజయరామరాజుతో కలసి గురువారం పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల అధికారి మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గంలో పర్యటించానన్నారు. ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం చేపట్టిందన్నారు. 281 పోలింగ్‌ కేంద్రాలుండగా, అందులో 221 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలుగా గుర్తించామన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి కట్టుదిట్టమైన పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. 3 కంపెనీల సీఆర్పీఎఫ్‌, సీఐఎస్‌ఎప్‌ బలగాలు, దాదాపు 3 వేలమంది పోలీసు బలగాలతో ఉప ఎన్నికలు జరుగుతాయన్నారు. జిల్ల్లాలో మోడల్‌ కోడ్‌ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవన్నారు. కాగా.. నవంబరు 1 నుంచి 30 వతేదీ వరకు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం జరుగుతుందని, 18 ఏళ్లు పైబడిన వారందరూ ఒటర్లుగా నమోదు అయ్యేలా రాజకీయపార్టీలు సహకరించాలని కోరారు. మీడియా సమావేశానికి ముందు కలెక్టర్‌తో కలసి రాష్ట్ర ఎన్నికల అధికారి రాజకీయ పార్టీల ప్రతినిధులతో బద్వేలు ఉప ఎన్నికల ఏర్పాట్లు, తీసుకుంటున్న చర్యలపై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్లు గౌతమి, ధ్యానచంద్ర, డీఆర్వో మలోల, రాజకీయ పార్టీల ప్రతినిధులు నీలి శ్రీనివవాసరావు, లక్ష్మణ రావు, గురుమోహన, భరత రెడ్డి, సగిలి గుర్రప్ప, నారాయణ, జిలానీ బాష తదితరులు పాల్గొన్నారు.


తప్పులు లేని ఓటర్ల జాబితా రూపొందించండి

ప్రత్యేక ఓటర్ల జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని స్పందన హాలులో ఎలక్టోరల్‌ రోల్‌పై ఈఆర్‌ఓలు, ఏఆర్‌ఓలతో సమావేశం నిర్వహించారు. ఈ ఏడాధి జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు నమోదుచేసేలా కాలేజీలు, యూనివర్శిటీల్లో ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలన్నారు.


ప్రధాన ఎన్నికల అధికారికి ఘన స్వాగతం

బద్వేలు / గోపవరం, అక్టోబరు 21: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ గురువారం ఉప ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించేందుకు బద్వేలు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు జిల్లా సరిహద్దు ప్రాంతమైన గోపవరం మండలం పీపీకుంట వద్ద సబ్‌కలెక్టర్‌ కేతనగార్గ్‌ పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. బద్వేలు చేరుకున్న ఆయన సబ్‌కలెక్టర్‌, ఎన్నికల అబ్జర్వర్‌ అధికారులతో కలిసి రాచాయపేట జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూతలను పరిశీలించారు. అనంతరం స్థానిక తహశీల్దారు కార్యాలయంలో కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ కేకే అన్బురాజన, ఉప ఎన్నికల సాధారణ పరిశీలకులు భీష్మకుమార్‌, పోలీసు అబ్జర్వర్‌ ఆర్‌ఆర్‌ఎస్‌ పరిహార్‌, ఎన్నికల వ్యయ పరిశీలకులు షీల్‌ ఆసిస్‌, రిటర్నింగ్‌ అధికారి కేతనగార్గ్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ మాట్లాడుతూ పోలింగ్‌ సమయానికి 72 గంటల ముందు రాజకీయ పార్టీల ప్రచారం ముగుస్తుందని ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ 281 పోలింగ్‌ కేంద్రాలలో  వీడియోగ్రాఫర్‌తోపాటు వెబ్‌కాస్టింగ్‌ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ నియమావళిని గట్టిగా పాటించేలా చర్యలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ రిటర్నింగ్‌ అధికారి శ్రీనివాసులరెడ్డి, డీఎస్పీ విజయ్‌కుమార్‌, నియోజకవర్గ నోడల్‌ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం వీరు స్థానిక ఫాతిమా ఇంగ్లీషు మీడియం పాఠశాలలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.