పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ABN , First Publish Date - 2021-10-24T05:46:59+05:30 IST

ఈనెల 25 నుంచి నవంబరు 3వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం.. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశాం.. నిమిషం నిబంధన ఉన్నందున విద్యార్థులు ముందే పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లు, ఇతర అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారిలా..

పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి 

కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు

నిమిషం ఆలస్యమైనా అనుమతి నిరాకరణ

విద్యార్థులు గంటముందే హాజరు కావాలి

‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో డీఐఈవో రఘురాజ్‌

నిజామాబాద్‌ అర్బన్‌, అక్టోబరు 23: ఈనెల 25 నుంచి నవంబరు 3వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా అన్ని ఏర్పాట్లు చేశాం.. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశాం.. నిమిషం నిబంధన ఉన్నందున విద్యార్థులు ముందే పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రఘురాజ్‌ తెలిపారు. పరీక్షల కోసం చేసిన ఏర్పాట్లు, ఇతర అంశాలను ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారిలా..

ఆంధ్రజ్యోతి: జిల్లాలో ఎంతమంది విద్యార్థులు ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు రాస్తున్నారు? ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు?

డీఐఈవో: కరోనా నేపథ్యంలో గత సంవత్సరం నిర్వహించాల్సిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను ఈనెల 25 నుంచి నిర్వహించనున్నాం. గత సంవత్సరం ఇంటర్‌ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 18, 697 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు 71 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశాం.

ఆంధ్రజ్యోతి: కొవిడ్‌ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు?

డీఐఈవో: విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా పరీక్షలు రాసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని భౌతికదూరం పాటిస్తూ పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేశాం. సానిటైజర్‌లు, మాస్కులను అందుబాటులో ఉంచాం. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఐసొలేషన్‌ గదులను సిద్ధంగా ఉంచడం జరిగింది. ఎవరైనా విద్యార్థులు అనారోగ్యంతో ఇబ్బందులు పడితే వారికి ప్రత్యేకంగా గదులను ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహించేలా ఏర్పాట్లు చేశాం. ప్రతీ పరీక్ష కేంద్రంలో ఆరోగ్య సిబ్బంది ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. 

ఆంధ్రజ్యోతి: పరీక్షల సమయం ఏమిటి? విద్యార్థులు ఎప్పుడు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి?

డీఐఈవో: ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నాం. విద్యార్థులను గంట ముందునుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించడం జరుగుతుంది. కావున విద్యార్థులు ఉదయం 7:30 నుంచి 8గంటల వరకు పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. నిమిషం నిబంధన ఉంది. కావున విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రం వద్దకు చేరుకోవాలి. 

ఆంధ్రజ్యోతి: మాస్‌ కాపీయింగ్‌ నిరోదానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డీఐఈవో: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించడం జరిగింది. పరీక్ష సమయంలో కేంద్రం చుట్టుపక్కల జిరాక్స్‌ సెంటర్‌లను మూసివేయించడం జరుగుతుంది. మాస్‌ కాపీయింగ్‌కు ఎలాంటి అవకాశం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. పరీక్ష కేంద్రంలో కేవలం చీఫ్‌ సూపరింటెండెంట్‌లు మాత్రమే ఫోన్‌ తీసుకెళ్లే అవకాశం ఉంది. మిగిలినవారు ఫోన్‌లు తీసుకెళ్లేందుకు అనుమతిలేదు. 

ఆంధ్రజ్యోతి: పరీక్షల నిర్వహణకు ఎంతమంది సిబ్బందిని నియమించారు?

డీఐఈవో: జిల్లా వ్యాప్తంగా 71 పరీక్ష కేంద్రాలలో పరీక్షల నిర్వహణకు 71 మంది చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, 71 మంది డిపార్ట్‌మెంటల్‌ అధికారులను నియమించడం జరిగింది. మాస్‌ కాపీయింగ్‌ను నిరోదించడానికి ఒక హైపవర్‌ కమిటీతో పాటు 3 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, 5 సిట్టింగ్‌ స్క్వాడ్‌ బృందాలను నియమించడం జరిగింది. 

ఆంధ్రజ్యోతి: హాల్‌ టికెట్ల జారీ విషయంలో ప్రైవేటు విద్యాసంస్థలు ఇబ్బందులు పెడుతున్నారని తెలిసింది. దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

డీఐఈవో: ప్రైవేటు కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించనిదే హాల్‌ టికెట్లు జారీ చేయడం లేదనే విషయం మా దృష్టికి కూడా వచ్చింది. ఈ విషయంలో విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌ టికెట్లతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించడం జరుగుతుంది. హాల్‌ టికెట్లపై ప్రిన్సిపాల్‌ సంతకం లేకున్నా పరీక్షకు అనుమతిస్తాం. కావున విద్యార్థులు ఇంటర్‌నెట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న హాల్‌టికెట్లతో పరీక్షలకు హాజరు కావాలి. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు అన్నిఏర్పాట్లు చేశాం. ఎలాంటి ఆందోళన అవసరం లేదు. కేవలం 70శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఉంటాయి. కావున విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలని ఆశిస్తున్నాం. 

Updated Date - 2021-10-24T05:46:59+05:30 IST