‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు

ABN , First Publish Date - 2020-05-08T07:42:36+05:30 IST

కరోనా ప్రభావం పది పరీక్షలపై తీవ్ర ప్రభావం పడింది. మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి

‘పది’ పరీక్షలకు ఏర్పాట్లు

భౌతిక దూరం పాటించడంతో పెరుగనున్న పరీక్షా కేంద్రాలు 

పరీక్షలకు హాజరుకానున్న 14, 570 మంది విద్యార్థులు 

ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కసరత్తు 


కరీంనగర్‌ టౌన్‌, మే 7: కరోనా ప్రభావం పది పరీక్షలపై తీవ్ర ప్రభావం పడింది. మార్చి 19వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించడంతో పరీక్షలు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. రాష్ట్రంలో కరోనా వైరస్‌ తీవ్రత తగ్గుముఖం పట్టడంతో  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మే నెలలోనే ఎసెస్సీ పరీక్షలు నిర్వహిస్తామని, ఇంటర్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ ప్రారంభమవుతుందని ప్రకటించారు. దీంతో ఎసెస్సీ పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈమేరకు విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి చిత్రారాంచంద్రన్‌  వీడియో కాన్ఫెరెన్స్‌ ద్వారా జిల్లా విద్యాధికారులను పదో తరగతి పరీక్షలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.


జాగ్రత్తలు తప్పనిసరి

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు భౌతికదూరం పాటించాలనే నిబంధనలను అమలు చేసేందుకు పరీక్ష కేంద్రాలను పెంచి ఒక్కో గదికి 10 నుంచి 12 మంది విద్యార్థులను కేటాయించనున్నారు. బెంచికో విద్యార్థిని, పరీక్షా కేంద్రానికి 100 నుంచి 120 మందిని మాత్రమే కేటాయించనున్నారు. జిల్లాలోని 504 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న 14,270 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. వీరిలో 7,528 మంది బాలురు, 6,742 మంది బాలికలు ఉన్నారు. ఇది వరకు ఫెయిలైన 168 మంది పరీక్షలు రాస్తున్నారు. పరీక్షా కేంద్రాలను 100 వరకు పెంచే అవకాశాలున్నాయి. పరీక్ష కేంద్రాలు పెంచాల్సి వస్తే కొత్త్తగా హాల్‌ టికెట్లు ముద్రించాల్సి ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులకు మాస్కులు పంపిణి చేయాలని అధికారులు నిర్ణయించారు.


శానిటైజర్లు, సబ్బులు కూడా అందుబాటులో ఉంచనున్నారు. జ్వరం, జలుబుతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రత్యేక గదులను ఏర్పాటు చేయనున్నారు. రవాణా సౌకర్యాలపైనా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జిల్లా విద్యాధికారి ఎన్వీ దుర్గాప్రసాద్‌  పదో తరగతి పరీక్షా కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన గురువారం మానకొండూర్‌ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులతో చర్చించారు.  


ఇటు కరోనా.. అటు వేసవి

 వేసవి ఎండల తీవ్రత అధికంగా ఉండడంతో పరీక్షా కేంద్రాల్లో ఫర్నీచర్‌, మంచినీటి వసతితోపాటు ఇతర ఏర్పాట్లను కూడా చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలల్లో పరీక్షల సందర్భంగా విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 15 నుంచి 20వ తేదీ నుంచి పది పరీక్షలు తిరిగి ప్రారంభమవుతాయని ప్రభుత్వం స్పష్టం చేయడంతో విద్యార్థులుపరీక్షలకు సన్నద్ధమ వుతున్నారు. కరోనా ఎఫెక్ట్‌తో పరీక్షలు నిలిచిపోవడంతో తమ బిడ్డల భవిష్యతు తలకిందులవుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతుండగా విద్యార్థులు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఆన్‌లైన్‌ ద్వారా వారికి ఉండే సందేహాలను నివృత్తి చేసుకుంటున్నారు. 




Updated Date - 2020-05-08T07:42:36+05:30 IST