Abn logo
Sep 19 2021 @ 01:00AM

ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

సిబ్బందికి సూచనలిస్తున్న సీఐ పాపారావు


బందోబస్తు నిర్వహణకు పోలీసులకు సూచనలు

కొవిడ్‌ నిబంధనల అమలు తప్పనిసరి

కనిగిరి, సెప్టెంబరు 18: ఎంపీటీసీ, జడ్పీటీసీ కౌంటింగ్‌ ప్రక్రియలో ఎలాంటి వాదోపవాదాలకు, అల్లర్లకు తావులేకుండా ప్రశాంతంగా లెక్కింపు  ముగిసేలా పోలీసు సిబ్బంది కృషి చేయాలని సీఐ పాపారావు సూచించారు. పట్టణ సమీపంలోని మోడల్‌ స్కూల్లో శనివారం కౌంటింగ్‌ సిబ్బందికి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కౌంటింగ్‌ కేంద్రంలోకి వచ్చే వారికి తప్పనిసరిగా పాస్‌లను చెక్‌ చేయాలన్నారు. అదేవిధంగా కొవిడ్‌ నెగిటెవ్‌ టెస్టులను పరిశీలించాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రం వద్ద డ్యూటీలు వేసిన సిబ్బంది కౌంటింగ్‌ కేంద్రంలో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చిన్న చిన్న ఘర్షణలు చోటు చేసుకున్నా సమాచారం ఇవ్వాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రంలో కౌంటింగ్‌ ప్రత్యేకాధికారి సూచనలను, సలహాలను అందిపుచ్చుకోవాలన్నారు. నిబంధనలు ఆంక్షలకు విరుద్ధంగా ప్రవర్తించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలన్నారు. 

27 ఎంపీటీసీ, 3 జడ్పీటీసీ స్థానాలకు లెక్కింపు

నియోజకవర్గంలో ఆరు మండలాలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ నేడు (ఆదివారం)జరగనుంది. కనిగిరి నియోజకవర్గంలో మొత్తం 75 ఎంపీటీసీ ప్రాదేశికాలు ఉండగా 47  ప్రాదేశికాలు ఏకగ్రీవం అయ్యాయి. 28 ఎంపీటీసీ ప్రాదేశకాలకు పోటీ జరిగింది. అయితే పీసీపల్లి మండలం మురిగిమ్మి ప్రాదేశికానికి చెందిన అభ్యర్థి మరణించగా, 27 ఎంపీటీసీ ప్రాదేశికాలకు లెక్కింపు జగనుంది. ఈ మేరకు కనిగిరిలో 4 ఎంపీటీసీ ప్రాదేశికాలకు, పామూరు 7, పీసీపల్లి 8, సీఎ్‌సపురం 2, హనుమంతునిపాడు 6 ఎంపీటీసీ ప్రాదేశికాలకు పోటీ జరిగి నేడు కౌంటింగ్‌ ప్రక్రియ జరగనుంది. అదేవిధంగా 6 జడ్పీటీసీ స్థానాలకు గాను కనిగిరి, వెలిగండ్ల, సీ.ఎ్‌స.పురం ఏకగ్రీవం కాగా, పామూరు, పీపీపల్లి, హనుమంతునిపాడు మండలాలకు పోటీ జరగ్గా, నేడు కౌంటింగ్‌ జరగనుంది. 

లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి 

 లెక్కింపు ప్రక్రియకు 27 టేబుల్స్‌ను ఏర్పాటు చేశామని కౌంటింగ్‌ ప్రక్రియ పర్యవేక్షణ ప్రత్యేక అఽధికారి నారదముని తెలిపారు. ప్రక్రియ ఏర్పాట్లలో 176 మంది సిబ్బంది కౌంటింగ్‌ విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా 5 మండలాలకు జరిగే కౌంటింగ్‌ ప్రక్రియలో 27 టేబుల్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కనిగిరి 4, పామూరు 7, పీసీపల్లి 8, హనుమంతునిపాడు 6, సీఎ్‌సపురం 2 టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్‌ ప్రక్రియలో అభ్యర్థులు కరోనా నిభంధలను పాటించాలని, తప్పని సరిగా కొవిడ్‌ టెస్ట్‌ రిపోర్టు చూయించిన వారికే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ సందర్భంగా పోలీసు శాఖ 144 సెక్షన్‌ అమలు చేస్తోందన్నారు.

దర్శి : దర్శి నియోజకవర్గంలో పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక మోడల్‌ పాఠశాలలో ఆదివారం లెక్కింపు జరుగుతుంది. నియోజకవర్గంలో 73 ఎంపీటీసీ స్థానాలు ఉండగా 37 స్థానాలు ఏకగ్రీవం అయిన విషయం తెలిసిందే. 36 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగ్గా, 88 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. దర్శి జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవం కాగా దొనకొండ, కురిచేడు, తాళ్లూరు, ముండ్లమూరు జడ్పీటీసీ స్థానాలకు 16 మంది బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యం ఆదివారం తేలనుంది. 

కౌంటింగ్‌ కేంద్రాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే 

స్థానిక మోడల్‌ పాఠశాలలో ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాన్ని ఎమ్మెల్యే వేణుగోపాల్‌ శనివారం పరిశీలించారు. కౌంటింగ్‌ ప్రశాంతంగా జరిగేందుకు అధికారులు తీసుకున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి క్రిష్ణవేణి, మండల ఎన్నికల అధికారి కె అర్జున్‌ నాయక్‌, ఎంపీడీవో శోభన్‌బాబు, తహసీల్దార్‌ వీడీబీ వరకుమార్‌ పాల్గొన్నారు. 

ముండ్లమూరులో : మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఓట్లు లెక్కించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు మండల రిటర్నింగ్‌ అధికారి ఏకే ధనరాజ్‌ తెలిపారు. ఒక జడ్పీటీసీ స్థానానికి, 12 ఎంపీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఏజెంట్లు ఉదయం 8 గంటల లోపే దర్శిలోని ఏపీ మోడల్‌ స్కూల్‌  కౌంటింగ్‌ కేంద్రానికి చేరుకోవాలని రిటర్నింగ్‌ అధికారి ధనరాజ్‌ తెలిపారు. 

పామూరు, సెప్టెంబరు 18: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంభంచి ఆదివారం కనిగిరిలోని ఏపి మోడల్‌ స్కూల్లో జరుగు ఎన్నికల ఓట్ల లెక్కింపుకు పోటీలో ఉన్న అభ్యర్దులు, ఏజెంట్లు తగిన గుర్తింపు కార్డులు పొందాలని లేనిచో కౌంటింగ్‌ హల్లోకి అనుమతించరని మండల రిటర్నింగ్‌ అధికారి ఏవీ రమణ సూచించారు. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీటీసీ అభ్యర్థులతో శనివారం సమావేశం నిర్వహించారు. మండలంలో మొత్తం 18 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీలకు గాను 11 ఎంపీటీసీలు ఇప్పటికే ఏకగ్రీవాలు కాగా ఎన్నికలు జరిగిన 7 ఎంపీటీసీలు, 1 జడ్పీటీసీకి ఆదివారం కౌంటింగ్‌ జరుగుతుంది. పోటీలో ఉన్న అభ్యర్థితో పాటు అతనికి మరో ఏజెంటు కోసం పాసులు ఇస్తున్నామన్నారు. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కిపు ప్రారంభం అవుతుందని ముందుగా కౌంటింగ్‌ హాల్లో పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారన్నారు. ఒక్కొక్క రౌండ్‌లో 1000 ఓట్లను లెక్కించి 25 ఓట్లను ఒక కట్టగా విభజిస్తారన్నారు. ఈ సమావేశంలో వైసీపీ, సీపీఎం, బీజేపీ పార్టీలకు చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ అభ్యర్దులు, నాయకులు, ఏజెంట్లు పాల్గొన్నారు.