సీఎంను కలిసేందుకు బయల్దేరిన రైతుల అరెస్టు

ABN , First Publish Date - 2021-06-23T05:04:56+05:30 IST

సీఎంను కలిసేందుకు బయల్దేరిన రైతుల అరెస్టు

సీఎంను కలిసేందుకు బయల్దేరిన రైతుల అరెస్టు
పోలీస్‌ స్టేషన్‌లో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులు

కీసర రూరల్‌: గ్రామానికి నక్ష ఏర్పాటుచేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు బయల్దేరిన రైతులను కీసర పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. మండలంలోని బోగారం గ్రామపంచాయతీ పరిధిలో బర్సిగూడ గ్రామానికి నక్ష(రెవెన్యూ మ్యాపు) లేదు. సర్వే నెంబర్లనూ పొందుపర్చలేదు. రైతులు తమ భూముల్లో సాగు చేసుకుంటున్నారు. కానీ, వారికి పాస్‌పుస్తకాలు, రికార్డులు లేవు. దీంతో వారికి రైతుబంధు, బీమా వర్తించటం లేదు. ఈ విషయమై అధికారులు, మంత్రులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో మంగళవారం సీఎం కేసీఆర్‌ను విన్నవించేందుకు దాదాపు 50మంది రైతులు బోగారం గ్రామం నుంచి ఎర్రవెళ్లిలోని ఫాంహౌజ్‌కు బయల్దేరారు. విషయం తెలుసుకున్న కీసర పోలీసులు వారిని అడ్డుకుని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. దీంతో రైతులు ఆగ్రహానికి గురై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ సంవత్సరాల తరబడి ఆందోళన చేస్తున్నా, బర్సిగూడ గ్రామానికి నక్ష ఏర్పాటు చేసేందుకు  అధికారులు అలసత్వం వహిస్తున్నారని, నక్ష లేకపోవటంతో ప్రభుత్వం రైతులకు అందజేస్తున్న రైతుబంధు, బీమా అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యను పరిష్కరించేంత వరకు ఆందోళన విరమించేంది లేదని భీష్మించారు. సాయంత్రం వరకూ పోలీసుల అదుపులో ఉండగా, సొంత పూచీకత్తుమీద విడిచిపెట్టారు. ఈ కార్యక్రమంలో బోగారం సర్పంచ్‌ కవిత, ఎంపీటీసీ వెంకట్‌రెడ్డి, గ్రామస్థులు జైహింద్‌రెడ్డి ఉన్నారు. 

Updated Date - 2021-06-23T05:04:56+05:30 IST