20న సీఎం కేసీఆర్‌ రాక

ABN , First Publish Date - 2021-06-14T05:05:29+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 20న కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ భవనాలను ఆయన ప్రారంభించనున్నారు.

20న సీఎం కేసీఆర్‌ రాక
ప్రారంభోత్సవానికి సిద్దంగా ఉన్న కలెక్టరేట్‌

- స్వయంగా సీఎం కేసీఆరే ప్రభుత్వ విప్‌ గంపకు ఫోన్‌
- ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలంటూ కేసీఆర్‌ ఆదేశాలు
- ఇప్పటికే ప్రారంభానికి సిద్ధం చేసిన జిల్లా యంత్రాంగం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి, ప్రభుత్వ విప్‌, కలెక్టర్‌ శరత్‌

కామారెడ్డి, జూన్‌ 13: రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ నెల 20న కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్‌, ఎస్పీ భవనాలను ఆయన ప్రారంభించనున్నారు. ఇదే విషయాన్ని స్వయంగా సీఎం కేసీఆరే ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కు ఆదివారం ఫోన్‌ చేసి చెప్పినట్లు విప్‌ తెలిపారు. నూతన కలెక్టరేట్‌ భవన ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకోవాలని సీఎం ఆదేశించినట్లు ఆయన పేర్కొన్నారు. సిద్దిపేట నూతన కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభించి అనంతరం మధ్యాహ్నం ఒంటి గంటకు కామారెడ్డి కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విప్‌ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత భవన నిర్మాణ పనులు దాదాపు ఇప్పటికే పూర్తయ్యాయి. నూతన కలెక్టరేట్‌ భవనంలో ఆయా ప్రభుత్వ శాఖలకు గదులను సైతం కేటాయించారు. ఇప్పటికే కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌ శరత్‌లు పలు పర్యాయాలుగా పర్యటించి పనులను వేగవంతం చేసేలా చూశారు. ఎస్పీ కార్యాలయాన్ని సైతం డీజీపీ మహేందర్‌రెడ్డి, పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్డ్‌ చైర్మన్‌ దామోదర్‌లు సైతం పరిశీలించారు. అయితే ఈ నెల 10న ప్రారంభోత్సవం జరగాల్సి ఉండగా అనివార్యకారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. అయితే ఎట్టకేలకు ఈ నెల 20న మధ్యాహ్నం 1 గంటలకు సీఎం కేసీఆర్‌ చేతులమీదుగా సమీకృత భవనాలను ప్రారంభించేందుకు సిద్ధం చేశారు.
ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి
రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నిజామాబాద్‌ నుంచి కామారెడ్డి జిల్లాను వేరు చేసి 22 మండలాలతో కొత్త జిల్లాగా ప్రకటించగా 2016 అక్టోబర్‌ 11న కామారెడ్డి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. పాలన సౌలభ్యం కోసం కలెక్టరేట్‌, పోలీసు కార్యాలయాలకు భవనాలు లేకపోవడంతో మైనార్టీ గురుకుల పాఠశాల భవనంలో కలెక్టరేట్‌ భవనంను, గిరిజన బాలుర వసతి గృహ భవనంలో జిల్లా పోలీసు కార్యాలయాలను కొనసాగిస్తూ వస్తున్నారు. కాగా కామారెడ్డి పట్టణ శివారులోని నూతన కలెక్టరేట్‌, పోలీసు భవనాల నిర్మాణ పనులను 2017లో అప్పటి రెవెన్యూ శాఖ మంత్రి మహ్మద్‌అలీ ప్రారంభించారు. సుమారు 30 ఎకరాలలో రూ.66కోట్ల నిధులతో నిర్మాణ పనులు చేపడుతూ వచ్చారు. ఇప్పటికే కలెక్టరేట్‌ క్యాంపు కార్యాలయంతో పాటు అదనపు కలెక్టర్‌లు కార్యాలయాలు ప్రారంభించడం అక్కడి నుంచే కలెక్టర్‌ పాలన కొనసాగిస్తున్నారు. అయితే కలెక్టరేట్‌ భవనం, ఎస్పీ కార్యాలయం అన్ని సౌకర్యాలతో ఆధునిక హంగులతో ఉండాలని భావించిన ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతీ పనిని దగ్గరుండి పర్యవేక్షించి పనులు పూర్తయ్యేలా చూశారు. మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, కలెక్టర్‌ శరత్‌లు ఇప్పటికే పలుమార్లు భవన నిర్మాణ పనులు, ఫర్నిచర్‌, కలెక్టరేట్‌ ఆవరణలో చేట్టాల్సిన పనులను దగ్గరుండి పర్యవేక్షి స్తున్నారు. ఈ నెల 20లోపు అన్ని పనులు పూర్తి చేసుకుని సమీకృత కలెక్టరేట్‌తో పాటు, ఎస్పీ భవనం సైతం సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుపుతున్నారు.
24 ప్రభుత్వ శాఖలు ఒకే చోట
నూతన జిల్లాగా ఏర్పాటు అయిన తర్వాత కొన్ని శాఖలకు గదులు సరిపోక అద్దె భవనాల్లో కొనసాగించాల్సి వచ్చింది. మరికొన్ని భవనాలను అంతకుముందు ఉన్న డివిజన్‌, మండల స్థాయి కార్యాలయాల్లో కొనసాగించగా ప్రస్తుతం నూతనంగా నిర్మిస్తున్న సమీకృత భవనంలో 24 ప్రభుత్వ శాఖలు ఒకే చోట ఉండే విధంగా రెండంతస్తుల భవన నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే భవన నిర్మాణం పూర్తికావడం ఆయా శాఖల కార్యాలయాలకు గదులను కేటాయించారు. కలెక్టరేట్‌ ఎదుట బీటీ రోడ్డు, పార్కింగ్‌కు, గార్డెన్‌ స్థలాల పనులను పూర్తి చేశారు. మొత్తం పనులు పూర్తి కావచ్చాయి. కేవలం భవనాన్ని ప్రారంభించాల్సి ఉంది. భవనాన్ని ప్రారంభించగానే కలెక్టరేట్‌ను ఆయా శాఖలను నూతన భవనంలోకి తరలించనున్నారు. అదేవిధంగా నూతన సమీకృత కలెక్టరేట్‌ భవన సమీపంలోనే నూతన పోలీసు భవన నిర్మాణాన్ని రూ.15 కోట్లతో వైట్‌హౌజ్‌ను తలపించే విధంగా నిర్మాణం చేపట్టారు. ఈ భవన నిర్మాణ పనులు సైతం దాదాపు పూర్తయ్యాయి. ఈ ఎస్పీ భవన సమీపంలోనే పరేడ్‌ గ్రౌండ్‌ సైతం సిద్ధం చేశారు. ఈ భవన నిర్మాణ పనులను పలు దఫాలుగా డీజీపీ మహేందర్‌రెడ్డి, హౌజింగ్‌ కార్పోరేషన్‌ చైర్మన్‌ దామోదర్‌, మంత్రి ప్రశాంత్‌రెడ్డితో, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌లు జిల్లా అధికారులతో సమీక్షిస్తూ నిర్మాణ పనులు వేగంగా జరిగేలా చూస్తూ వచ్చారు.
20న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభోత్సవం
జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన దాదాపు ఖరారు అయింది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నూతనంగా సమీకృత భవనాలను నిర్మిస్తున్న నేపథ్యంలో సిద్దిపేట, కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో భవన నిర్మాణ పనులు పూర్తికావడంతో సీఎం కేసీఆర్‌ ఆయా భవనాలను సైతం ప్రారంభించవచ్చని అధికారవర్గాలు తెలిపాయి. అయితే ఈ నెల 10న కలెక్టరేట్‌, ఎస్పీ భవనాల ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినా అనివార్య కారణాల వల్ల కార్యక్రమం వాయిదా పడింది. అయితే సీఎం కేసీఆర్‌ మరోసారి ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కు ఆదివారం ఫోన్‌ చేసి 20వ తేదీన మధ్యాహ్నం 1 గంటలకు కామారెడ్డిలోని నూతన సమీకృత భవనాలను ప్రారంభించేందుకు వస్తున్నట్లు తెలిపారు. ప్రారంభోత్సవానికి భవనాలను సిద్ధంగా ఉంచి ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించినట్లు ప్రభుత్వ విప్‌ తెలిపారు. ఈ నెల 20న సీఎం కేసీఆర్‌ జిల్లా పర్యటన ఉన్నందున నూతన భవనాలను ప్రారంభోత్సవానికి సిద్ధంగా  ఉంచాలని ప్రభుత్వ విప్‌ జిల్లా కలెక్టర్‌ శరత్‌తో పాటు ఎస్పీ శ్వేతారెడ్డిలకు సూచించారు.

Updated Date - 2021-06-14T05:05:29+05:30 IST