Advertisement
Advertisement
Abn logo
Advertisement

సకాలంలో రారు.. పనులు చేయరు!

రెవెన్యూ సిబ్బంది ఇష్టారాజ్యం

సేవలు అంతంతమాత్రమే

భూ సమస్యల పరిష్కారంలో మితిమీరిన నిర్లక్ష్యం

పలుచోట్ల వేధిస్తున్న  సిబ్బంది కొరత

తహసీల్దార్‌ కార్యాలయాల్లో ‘ఆంధ్రజ్యోతి’ విజిట్‌

కందుకూరు నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో సిబ్బంది కొరత ఉంది. పని ఒత్తిడి పేరుతో ఉన్నవారు కూడా పనిచేయకపోవడంతో ప్రజలకు కాళ్లతిప్పట తప్పటం లేదు. వీవీపాలెం, లింగసముద్రం మండలాల్లో మధ్యాహ్నం వరకు కూడా ఎవరూ రాని పరిస్థితి. మరికొన్నిచోట్ల సిబ్బంది వచ్చినా పనులపై బయటకు వెళ్లారు. అక్కడ సమస్యలతో వచ్చిన వారు అధికంగానే ఉన్నారు.

చీరాల మండల తహసీల్దార్‌ హుస్సేన్‌ అక్టోబరు 22న బదిలీపై వెళ్లారు. అప్పటి నుంచి వేటపాలెం తహసీల్దార్‌ ఇన్‌చార్జిగా ఉన్నారు. దీంతో పూర్తి సమయం చీరాలలో ఉండలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో పనులు జరగక ప్రజలు రావడం లేదు. దీంతో కార్యాలయం బోసిపోతోంది. ఇక వేటపాలెంలోనూ సిబ్బంది ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళతారో తెలియని పరిస్థితి.

బేస్తవారపేట మండలం గలిజేరుగుళ్లకు చెందిన డప్పు కళాకారుడు పులిగుజ్జు ఏసుదాసు తదితరులు పింఛన్లు ఇవ్వడం లేదని సోమవారం తహసీల్దార్‌  కార్యాలయం ఎదుట డప్పులు కొడుతూ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్‌ రమాదేవికి వినతిపత్రం ఇచ్చారు.

అద్దంకి నియోజకవర్గంలో ‘స్పందన’ కరువైంది. అద్దంకి తహసీల్దార్‌ కార్యాలయానికి అర్జీదారులు రాలేదు. బల్లికురవ మండలంలో ఓ రైతు రెండేళ్ల నుంచి తన పొలం ఆన్‌లైన్‌ కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పంగులూరు తహసీల్దార్‌ కార్యాలయంలో సమయపాలన లేదు. అర్జీదారుల వద్ద అటెండర్‌ ఇష్టారాజ్యంగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని రైతులు ఆరోపించారు.

 ఇదీ జిల్లాలో మండల రెవెన్యూ కార్యాలయాల పరిస్థితి. క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికశాతం పౌరసేవలు అందించే తహసీల్దార్‌ కార్యాలయాల్లో పాలన గాడితప్పింది. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. జిల్లాలోని అత్యధిక ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉండటం లేదు. అలాగే మెరుగైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అధికారపార్టీ నేతలకు అడ్డాలుగా, మరోవైపు అవినీతి కార్యకలాపాలకు నిలయాలుగా మారాయన్న విమర్శలూ ఉన్నాయి.

ఒంగోలు, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో  రెవెన్యూ శాఖ పనితీరు అస్తవ్యస్తంగా తయారైంది. నిబంధనలకు  విరుద్ధంగా మండల స్థాయి అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తుండటం చాలా ప్రాంతాల్లో కనిపిస్తుండగా ఇటీవల కొన్ని కార్యాలయాల సిబ్బంది, తహసీల్దార్లపై ఉన్నతాధికారులు వేటు కూడా వేశారు. అయినా జిల్లాలోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో జవాబుదారీతనం అంతంతమాత్రంగానే ఉంది.  సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ బృందం తహసీల్దార్‌ కార్యాలయాల విజిట్‌ నిర్వహించగా అధిక ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది కొరత వేధిస్తుండగా, ఉన్నవారు సకాలంలో రావడం లేదు. దీంతో రెవెన్యూ శాఖపై ప్రజల్లో క్రమంగా విశ్వాసం సన్నగిల్లింది. అలాగే క్షేత్రస్థాయిలో సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో దరఖాస్తులు అక్కడ ఇచ్చే ఏర్పాటు కారణంగా తహసీల్దార్‌ కార్యాలయాలకు వచ్చేవారి సంఖ్య తక్కువైంది. అయితే సమస్యలతో వస్తున్న వారికి సకాలంలో పరిష్కారం చూపకుండా నెలలు, ఏళ్ల తరబడి తిప్పుతున్న దుస్థితి నెలకొంది.  భూముల ఆన్‌లైన్‌, పాసుపుస్తకాలు, మార్పిడిలు, భూవివరాల నమోదులో తప్పుల సవరణ ఇతరత్రా భూసంబంధ పనుల కోసం తిరుగుతున్న ప్రజలు అనేకమంది ఆయా కార్యాలయాల వద్ద కనిపించారు. 


11గంటలకూ రాని సిబ్బంది

జిల్లాలో 40కిపైగా మండలాల్లో విజిట్‌ నిర్వహించగా అందులో మూడొంతుల కార్యాలయాల్లో 11 గంటల వరకు అధికారులు సిబ్బంది వచ్చిన పరిస్థితి లేదు. దర్శిలో మధ్యాహ్నం వరకు తహసీల్దార్‌ కార్యాలయానికి రాలేదు. విచారించగా అంబేడ్కర్‌ వర్ధంతి కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు సమాచారం. అయితే అక్కడ డీటీ, ఆర్‌ఐలను ఇతర చోట్లకు డిప్యుటేషన్‌ వేయగా రెండో ఆర్‌ఐ ఒక్కరే కనిపించారు. కురిచేడు, ముండ్లమూరుల్లో సిబ్బంది కొరత కనిపించింది. కురిచేడు మండలం బోదనంపాడు వాసులు హైస్కూలు ఏర్పాటుకు రూ.12లక్షలు వెచ్చించి స్థలం కొనుగోలు చేసి ఇవ్వగా ఆ భూమి కన్వర్షన్‌ కోసం మూడేళ్లుగా తహసీల్దార్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు. పశ్చిమ ప్రాంతంలో సిబ్బంది కొరత వేధిస్తోంది. దోర్నాలలో తహసీల్దార్‌తో సహా పలు పోస్టులు ఖాళీగా ఉండగా త్రిపురాంతకంలో 11 మందికి నలుగురే ఉన్నారు. పొదిలి తహసీల్దార్‌ నాలుగు నెలల క్రితం సస్పెండ్‌ కాగా ఇన్‌చార్జితో నెట్టుకొస్తున్నారు. ఆన్‌లైన్‌లో 95సెంట్ల భూమి నమోదు కోసం పలుమార్లు తిరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని అక్కడ ఒక రైతు ఆరోపించారు. గిద్దలూరు ప్రాంతంలో సకాలంలో 50శాతం మంది మాత్రమే కార్యాలయాలకు వచ్చారు. కంభంలో 10.30కు తహసీల్దార్‌ వచ్చినా సిబ్బంది కనిపించలేదు. 


సిబ్బంది కోసం ఎదురుచూపులు

కొనకనమిట్ల, రాచర్ల, పీసీపల్లి, వెలిగండ్ల, గిద్దలూరు, సీఎస్‌పురంలలో సకాలంలో సిబ్బంది వచ్చిన పరిస్థితి లేదు. పామూరు తహసీల్దార్‌ కార్యాలయానికి సమస్యలపై వచ్చిన ప్రజలు అధికంగా కనిపించారు. వీవీపాలెంలో సకాలంలో ఉద్యోగులు రాకపోగా పనుల కోసం వచ్చిన వారు సిబ్బంది కోసం ఎదురుచూస్తూ కనిపించారు. చీరాల ప్రాంతంలో చీరాల, వేటపాలెం, పర్చూరు ఇతర మండలాల్లోనూ సమయపాలన లేకపోగా గ్రీవెన్స్‌ జరిగిన దాఖలాలు లేవు. ఎక్కువమంది సిబ్బంది ఓటీఎస్‌ పనిపై ఉన్నారని చెబుతుండగా ప్రజలు కూడా అంతగా రావడం లేదు. అద్దంకి ప్రాంతంలోనూ అలాగే ఉంది. కొండపి ప్రాంతంలో పొన్నలూరు, మర్రిపూడిలకు ఇన్‌చార్జి తహసీల్దార్లతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కందుకూరు ప్రాంతంలో సగం మండలాల్లో సమయపాలన కనిపించలేదు. ఒంగోలు, కొత్తపట్నం మద్దిపాడు, ఎన్‌జీపాడులలో తహసీల్దార్లు సకాలంలో వచ్చినా సిబ్బంది మాత్రం సమయపాలన పాటించలేదు. భూసంబంధ సమస్యలు ఎక్కడా సకాలంలో పరిష్కారం కావడం లేదన్న ఆరోపణలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతిసోమవారం గ్రీవెన్స్‌ నిర్వహించాల్సి ఉన్నా చాలాచోట్ల అది కనిపించలేదు. మొత్తంగా జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉన్న విషయం విజిట్‌లో స్పష్టంగా కనిపించింది. 


వేటపాలెం తహసీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకూ తెరవని వివిధ విభాగాల తలుపులు


బేస్తవారపేట తహసీల్దార్‌ కార్యాలయం వద్ద డప్పులు కొట్టి నిరసన తెలుపుతున్న కళాకారులు


Advertisement
Advertisement