ఆగమవుతున్న కులవృత్తి

ABN , First Publish Date - 2021-02-28T06:06:38+05:30 IST

సమాజంలో నానాటికీ పెరుగుతున్న ఆధునిక పోకడలకు ప్రాచీనకాలం నుండి వస్తున్న కులవృత్తులన్నీ ఒక్కొక్కటీ కుదేలౌతున్నాయి.

ఆగమవుతున్న కులవృత్తి
టైలరింగ్‌ వృత్తిలో నిమగ్నమైన దర్జీలు

రెడీమేడ్‌ రాకతో ఆగిన కుట్టుమిషన్‌ చప్పుడు

చేతినిండా పనిలేక ఇబ్బందుల్లో దర్జీలు

ఇప్పటికే పల్లెల్లో కనుమరుగైన టైలరింగ్‌ వృత్తి

పట్టణాల్లోనూ పరిమితంగానే కుట్టుకూలీ షాపులు

కులవృత్తే జీవనాధారంగా జిల్లాలో 1100 మేరు కుటుంబాలు

ప్రభుత్వం ప్రోత్సహించి ఆదుకోవాలని  డిమాండ్‌

ఖానాపూర్‌, ఫిబ్రవరి 27 : సమాజంలో నానాటికీ పెరుగుతున్న ఆధునిక పోకడలకు ప్రాచీనకాలం నుండి వస్తున్న కులవృత్తులన్నీ ఒక్కొక్కటీ కుదేలౌతున్నాయి. నాటి సమాజంలో ప్రజలతో మమేకమయ్యి ఒక ఇంట్లో శుభకార్యం జరుగుతుందంటే ఆ గ్రామంలోని పదులసంఖ్యలో కుటుంబాలకు నెలరోజులపాటు చేతినిండా పనిదొరికేది. తమ ఇంట్లో పెళ్లిలు, పేరంటాలు, వ్రతాలు, పూజలు ఇలా ఏ చిన్న శుభకార్యం జరిగినా ప్రజలు కులవృత్తుల వారిని ఆశ్రయించి వారు తయారు చేసిన వస్తువులపైనే ఆధారపడి వారి కార్యాలు జరుపుకునేవారు. మనిషి ప్రొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయే వరకు తాను చేసే ప్రతీ పనిలో చేతివృత్తులు, కులవృత్తుల వారు తయారు చేసిన వస్తువులే దర్శనమిచ్చేవి. కాని నేటిసమాజంలో ఆ పరిస్థితి మచ్చుకైన కానరావడం లేదు. ‘‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలా’’ అంటూ ఓ సినీకవి పాడినట్లు ప్రజాజీవితంలో చోటు చేసుకుంటున్నవిప్లవాత్మక మార్పులతో కులవృత్తుల వారికి చేతినిండా పని కరువౌతోంది. ఇప్పటికే ఎన్నో కులవృత్తులు కాలగర్భంలో కలిసిపోతున్న నేపథ్యంంలో నేడు మరో కులవృత్తి సైతం కుదేలయ్యే పరిస్థితులు తలెత్తున్నాయి. ప్రతీమనిషి జీవితంతో మేరు కులస్థుల వృత్తి ముడిపడి ఉండేది. ప్రస్తుతం రెడీమేడ్‌ రాకతో చేతినిండా పనిదొరుకక ఇటు కులవృత్తిని వదులుకోక సతమతమౌతున్న దర్జన్నల జీవనంపై ఆదివారం టైలర్స్‌డే సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

రెడీమేడ్‌ రాకతో ఆగిన కుట్టుమిషన్‌ చప్పుడు

గత ఐదారేళ్ళ క్రితం వరకు ప్రతీ ఇంటా ఏ చిన్న శుభకార్యం చేయాలన్నా ఒక్క నెలరోజుల ముందుగానే బట్టలను కొనుగోలు చేసి సమయానికి అందజేయాలని దర్జీలకు ముందస్తుగా తమ బట్టలను అందజేసే పరిస్థితి ఉండేది. దర్జీలు కూడా చేతినిండాపనితో రాత్రింబవళ్లు శ్రమించి తమ దగ్గరకు వచ్చే ప్రజలకు వస్ర్తాలను కుట్టి అందజేసేవారు. కాని నేటి పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. కనీసం చేతినిండా పని దొరికితే బాగుండు అనేస్థితిలో ఎంతో మంది దర్జీలు తమ జీవనం వెళ్లదీస్తున్నారు. యువతలో ఆధునిక పోకడలకు ఆకర్షితులవ్వడంతో మార్కెట్‌లోకి రోజుకో డిజైన్‌లో రెడీమేడ్‌ దుస్తువులు వస్తున్నాయి. దీంతో దర్జీల వద్దకు వెళ్లి బట్టలు కుట్టించుకోవడం మానేసి ప్రతీఒక్కరు రేడీమేడ్‌ బట్టల వైపే మొగ్గుచూపుతున్నారు. దీంతో కుట్టుమిషన్‌ చప్పుడు క్రమేపి ఆగిపోతోంది. 

పల్లెల్లో కనుమరుగైన కుట్టుమిషన్‌ దుకాణాలు

ఒక మనిషి అందంగా కనిపించాలంటే తాను వేసే వస్ర్తాలపైనే ఆదారపడి ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ బట్టలు ఎంత ఖరీదైనవైనా వాటిని సుందరంగా కుట్టడంలోనే వాటి విలువ పెరుగుతుంది. ఒకశిలకు రూపం రావాలంటే శిల్పి ఎంతగా శ్రమిస్తాడో ఒక వస్త్రానికి రూపం రావాలంటే కూడా ధర్జీ అంతగా శ్రమించాల్సి ఉంటుంది. ఇంతలా శ్రమించే ధర్జీలు  ప్రతీగ్రామంలో ఉండేవారు. కాని నేడు మార్కెట్‌లో 100 నుండి మొదలుకుని ఎంత ఖరీదైన బట్టలైనా రెడీమేడ్‌ రూపంలో దొరుకుతుండడంతో కుట్టుకూలీ ఖర్చులోనే చొక్కా వస్తుందని ప్రతీ ఒక్కరు బట్టలు కుట్టించడం మానేశారు. దీనికి తోడు పెరుగుతున్న కరెంట్‌బిల్లులు, దుకాణాల అద్దెలు కూడా సమస్యగా మారాయి. దీంతో ఒకటో, అరనో వచ్చే గిరాకీని కూడా వదులుకుని పల్లెల్లో ఉన్న దర్జీలు తమ దుకాణాలు మూసుకుని పట్టణాలకు పని వెతుక్కుంటూ వలస వెళ్లాల్సి వస్తోంది. ఈ క్రమంలో టైలరింగ్‌ దుకాణాలు పల్లెల్లో కనుమరుగౌతున్నాయి.

జిల్లాలో మేరు కులవృత్తిపై ఆధారపడి 1100 కుటుంబాలు

నిర్మల్‌ జిల్లాలో మేరు కులవృత్తిపై ఆధారపడి 1100 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. నానాటికి మేరు కులవృత్తి ఆదరణ కోల్పోతుండడంతో తమను ఆదుకోవాలని మేరు కులస్థులు కోరుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అంతరించిపోతున్న కులవృత్తులను కాపాడుతామని చెబుతున్న ప్రభుత్వం ఇతర కులవృత్తులకు కల్పిస్తున్నట్లుగానే తమకు ప్రోత్సాహకం కల్పించాలని ధర్జీలు కోరుతున్నారు తమ కృలవృత్తిని కాపాడుకోవాలంటే ప్రభుత్వం తరుపున తయారు చేయించే యూనిఫాంలను తమకే అప్పగించాలని కోరుతున్నారు. ఉచితంంగా కుట్టుమిషన్‌లు అందజేయాలని, టైలరింగ్‌ షాపులకు ఉచితవిద్యుత్‌ను అందజేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. గీతకార్మికుల వలే తమ కులవృత్తి చేసి వయస్సు పైబడిన వారికి పింఛన్‌లు అందజేసి ఆదుకోవాలని కోరుతున్నారు. మేరు కులస్థులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఆదివారం టైలర్‌ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం తమను ఆదుకోవాలనే డిమాండ్‌లతో హైదరాబాద్‌లోని ఎగ్జిబిషన్‌గ్రౌండ్‌లో మేరు కుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి నిర్మల్‌  జిల్లా నుండి పెద్దఎత్తున తరలివెళ్లేందుకు సన్నద్దం అవుతున్నారు. 

ప్రభుత్వం ప్రోత్సాహం కల్పించి ఆదుకోవాలి

తెలంగాణ రాష్ట్రంలో దర్జీల పరిస్థితి నానాటికి కుదేలౌతోంది. ఇతర కులస్థులు సైతం ఈ వృత్తిలోకి వచ్చారు. రేడీమేడ్‌ రాకతో మాకు ఆదరణ తగ్గిపోయింది. ప్రోత్సాహం కల్పించి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. వయస్సు పైబడిన వారికి పింఛన్‌ అందజేయాలి. 

సింగు లక్ష్మీనారాయణ, టైలర్‌ ఖానాపూర్‌

టైలర్‌ షాపులకు ఉచితవిద్యుత్‌ అందజేయాలి

ఆశించిన పని దొరకక ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న దర్జీలకు అదనపు ఖర్చులు పెనుభారంగా మారాయి. తమ కులవృత్తిని కాపాడుకునేందుకు ఈ పనిచేస్తున్నాం. చేతినిండా పని లేక అవస్థలు పడుతున్నాం. టైలర్‌ షాపులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలి. ప్రత్యేకంగా మేరు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి రాయితీపై రుణాలు అందజేసి ఆదుకోవాలి. 

Updated Date - 2021-02-28T06:06:38+05:30 IST