బతుకు చిత్రానికి కళే ఊతం!

ABN , First Publish Date - 2020-11-26T05:52:48+05:30 IST

కరోనా దెబ్బకు ఉద్యోగం, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డవారు ఎందరో. అఫ్ఘనిస్థాన్‌లోనూ అలాంటి వారు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు యువతులకు చిత్రకళతో తిరిగి ఉపాధి కల్పిస్తున్నారు 21 ఏళ్ల మర్జియా పనాహీ. ఆమె ప్రయత్నం చిన్నదే కానీ కష్టకాలంలో అండగా నిలిచి, గొప్ప మనసు చాటుకున్న ఆమె ఇప్పుడు అక్కడ వర్థమాన వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు

బతుకు చిత్రానికి కళే ఊతం!

కరోనా దెబ్బకు ఉద్యోగం, ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డవారు ఎందరో. అఫ్ఘనిస్థాన్‌లోనూ అలాంటి వారు చాలామందే ఉన్నారు. వారిలో కొందరు యువతులకు చిత్రకళతో తిరిగి ఉపాధి కల్పిస్తున్నారు 21 ఏళ్ల మర్జియా పనాహీ. ఆమె ప్రయత్నం చిన్నదే కానీ కష్టకాలంలో అండగా నిలిచి, గొప్ప మనసు చాటుకున్న ఆమె ఇప్పుడు అక్కడ వర్థమాన వ్యాపారవేత్తగా ఎదుగుతున్నారు. 


అప్ఘనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో చిన్న ఆర్ట్‌ గ్యాలరీ. అందులో కొందరు యువతులు కుంచెలతో రక రకాల బొమ్మలు వేస్తున్నారు. నమద్‌ పేరుతో ఆర్ట్‌ గ్యాలరీని మర్జియా పనాహీ సెప్టెంబర్‌లో ప్రారంభించారు. యుద్ధాలతో ఛిన్నాభిన్నమైన తమ దేశంలో రంగుల కళలోని సృజనాత్మకతకు కొదవ లేదని చాటడం, కరోనా సమయంలో ఉపాధి కోల్పోయిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం తన ఆర్ట్‌ గ్యాలరీ ఉద్దేశం అంటారామె. ‘‘మా దేశంలో కరోనా కేసులు పెరిగిన సమయంలో నిరుద్యోగ సమస్య ఎంతలా పెరిగిందో నేను కళ్లారా చూశాను. పేదరికం కష్టంగా ఉందని నాకు అప్పుడు అర్థమైంది. ఆ సమయంలో మాకు మేము ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు, మా చుట్టూ ఉన్న కొందరికైనా సాయం చేయాలనే ఆలోచనతో కొంతమంది యువతీయువకులతో ఒక బృందాన్ని ఏర్పాటుచేశాను. వారికి బొమ్మలు వేయడం నేర్పించాను. అప్థనీ సంప్రదాయాన్ని తలపించే ఈ బొమ్మలకు ఎంతో ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మేము ఒక్కో బొమ్మను వంద డాలర్ల నుంచి రెండు వందల డాలర్లకు అమ్ముతున్నాం. పెయింటింగ్‌ ద్వారా పాత సంప్రదాయాలను బతికిస్తున్నాం. మా దేశంలో దొరికే వనరులతోనే మా జీవితాలను అందంగా మలచుకుంటామనే విషయాన్ని ప్రపంచానికి చాటుతున్నాం’’అని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నారు పనాహీ. 


సగం జనాభా యువరక్తమే

అఫ్ఘనిస్థాన్‌లో సుమారు 60శాతం జనాభా 25 ఏళ్ల కన్నా తక్కువ వయసువారే. వారందరూ ఇప్పుడు ఉద్యోగం కోసం నిరీక్షిస్తున్నారు. వారిలో కొందరికైనా ఉద్యోగం ఇప్పించాలనే ప్రయత్నంలో ఉన్న పనాహీకి తమ దేశంలోని చిత్రకళ, చేనేత కళను పెయింటింగ్స్‌ ద్వారా ప్రపంచానికి తెలియజేస్తే ఎంతో కొంత సంపాదించవచ్చనే ఆలోచన తట్టింది. కానీ ఇప్పుడు అక్కడి ప్రజలందరూ ఆధునిక జీవనశైలికి అలవాటు పడ్డారు. పాతకాలం నాటి వస్తువులను కొనేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. అయితే పనాహీ బృందం ఎన్నో విధాలుగా ప్రయత్నించి ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు తెస్తున్నారు. ‘‘లాక్‌డౌన్‌ సమయంలో ఎక్కడా పని దొరక్కపోవడంతో నేను మానసికంగా ఎంతో కుంగిపోయాను. నమద్‌ ఆర్ట్‌ గ్యాలరీలో చేరిన తరువాత నా ఆలోచన మారిపోయింది. కాన్వాసు మీద లేదా కాగితం మీద నా భావాలన్నింటినీ బొమ్మగా వేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తుంది’’ అంటున్నారు ఫైఖా సుల్లానీ అనే ఆర్టిస్ట్‌.


ఇప్పుడు మేము ఒక్కో బొమ్మను వంద డాలర్ల నుంచి రెండు వందల డాలర్లకు అమ్ముతున్నాం. మా దేశంలో దొరికే వనరులతోనే మా జీవితాలను అందంగా మలచుకుంటామనే విషయాన్ని ప్రపంచానికి చాటుతున్నాం.

Updated Date - 2020-11-26T05:52:48+05:30 IST