Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంత పెద్ద కుంభకోణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోలేదేం..?

ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్ : ఇన్‌స్టంట్‌ లోన్‌ యాప్‌ల పేరుతో తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో కొన్ని ముఠాలు దా‘రుణాల’కు పాల్పడిన ఘటనలు పెద్ద ఎత్తున వెలుగుచూసిన విషయం విదితమే. ముఖ్యంగా ఈ యాప్‌లపై హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసు స్టేషన్లలో నాడు మొదలైన ఫిర్యాదులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. మరోవైపు లోన్ కట్టాలని వేధించడంతో పలువురు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీంతో ఈ ముఠా ఆట కట్టించాలని రంగంలోకి దిగిన సైబరాబాద్‌ పోలీసులు.. రుణాల వసూళ్ల కోసం బాధితులను వేధిస్తున్న పలు కన్సల్టెన్సీలపై దాడులు నిర్వహించారు. అయితే మోసగాళ్ల పని పట్టాల్సిన బాధ్యత కలిగిన అధికారులు కొందరు.. వారితోనే కుమ్మక్కయినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. రూ.5 లక్షల లంచం తీసుకొని.. లోన్‌ యాప్‌ కుంభకోణం కేసులో స్తంభింపజేసిన ఫిన్‌వెస్ట్‌ లోన్‌ యాప్‌ కంపెనీ బ్యాంకు ఖాతాను పునరుద్ధరించేలా ఆదేశాలివ్వడం గమనార్హం. దీనిపై దర్యాప్తు చేసిన సీబీఐ.. స్వయంగా ఈడీ అధికారే ఈ అవినీతి చర్యకు పాల్పడ్డట్లు గుర్తించి.. బెంగళూరుకు చెందిన ఈడీ అధికారి లలిత్‌ బజాద్‌ కేసు నమోదు చేసింది. దీన్ని బట్టి చూస్తే ఇలా ఇంకెంత మంది ఉన్నారో.

సీరియస్‌గా తీసుకోలేదేం..?

అయితే ఇంత జరుగుతున్నా ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు.. అటు కేంద్ర ప్రభుత్వం గానీ ఎందుకు సీరియస్‌గా తీసుకోవట్లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ అదేమైనా చిన్నా చితకా కుంభకోణమా అంటే అదీ కాదు.. ఏకంగా రూ.30వేల కోట్ల కుంభకోణం. ఇప్పటి వరకూ హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పీఎస్‌లో 22 మందిని అరెస్ట్ చేశారు.. ఆ తర్వాత బెయిల్‌పై దాదాపు అందర్నీ విడుదల చేసేశారు సరే తదుపరి చర్యలేంటో తెలియని పరిస్థితి. పోనీ.. ఇంత జరిగిన తర్వాతైనా లోన్‌ యాప్‌ల నిర్వాహకులు సైలెంట్‌గా ఉన్నారా అంటే అస్సలు లేదు. కొంతకాలంగా వారంతా స్తబ్దంగా ఉన్నా ఆ తర్వాత మళ్లీ లోన్ తీసుకున్న వారికి ఫోన్లు చేసి మునుపటిలాగే వేధిస్తూనే ఉన్నారు. రుణాన్ని వడ్డీతోపాటు తక్షణం చెల్లించాలంటూవేధిస్తున్నారంటూ పలువురు బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనువైన చోట అధికారులను ప్రలోభపెట్టే వ్యూహంలో యాప్ నిర్వాహకులు ఉండగా.. దీన్ని ఎవరూ సీరియస్‌గా తీసుకున్న పాపాన పోలేదు. కేంద్ర దర్యాప్తు సంస్థలు అయితే అస్సలు ఇటు వైపు చూడనేలేదు. అయితే.. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు మాత్రం తమ పాత్ర పరిమితమేనని చెబుతుండటంతో.. ఇలా చేతులు దులుపుకోవడమేంటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు.. ఇప్పటికే 51 ఖాతాలకు  సంబంధించి కొరియర్ ద్వారా నకిలీ లేఖలు బ్యాంకులకు చేరాయి.


1125 ఖాతాలపై కన్ను

తాజాగా ఫోర్జరీ పత్రాలు... నకిలీ వ్యక్తుల ప్రమేయంతో యాప్‌ల అకౌంట్ల నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్‌ అవుతున్న మరో కుట్ర వెలుగు చూడటంతో మిగిలిన ఖాతాలపై అధికారులు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా నమోదైన కేసుల్లో 1125 బ్యాంకు ఖాతాలు గుర్తించారు. నిందితులు అరెస్టు తర్వాత వారికి సంబంధించిన 1125 ఖాతాలను ఫ్రీజ్‌ చేశారు. ఆ ఖాతాల్లో రూ. 190 కోట్లు ఉన్నాయని అధికారులు గుర్తించారు. కాగా, కోల్‌కతాలో సైబర్‌క్రైమ్‌ ఎస్సైనని చెప్పిన వ్యక్తిని సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


ఫుల్‌స్టాప్ ఎప్పుడో..!

ఈ యాప్‌ నిర్వాహకులు వేధింపులతో ఇప్పటి వరకూ చాలా మందే ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. కాగా.. రుణాలు సకాలంలో చెల్లించని బాధితులను వేధించడం గానీ, వారి కాంటాక్టు లిస్టులోని వ్యక్తులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు, సందేశాలు పంపాలని కానీ ఆర్బీఐ నిబంధనల్లో ఎక్కడా లేదు. అలాంటప్పుడు నిర్వాహకులు ఏ విధంగా బాధితులకు కాల్ చేస్తారు..? ఇలా చేయడమంటే ఆర్బీఐ నిబంధనలు తుంగలో తొక్కినట్లే. పైగా ఫేక్‌ లీగల్‌ నోటీసుల పేరిట వేధించడం గమనార్హం. ఇవన్నీ ఒక ఎత్తయితే రుణాల యాప్‌ల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు జైల్లో ఉండి కూడా బయట చక్రం తిప్పుతున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి యాప్‌ల వ్యవహారానికి ఎప్పుడు ఫుల్‌స్టాప్ పడుతుందో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో ఏంటో..!

Advertisement
Advertisement