Jun 11 2021 @ 23:22PM

చిత్రీకరణకు విరామమా? మరో సినిమా చేసేయ్‌!

థియేటర్‌కు వెళితే... షో మధ్యలో ఏం వస్తుంది? ఇంటర్వెల్‌! అప్పుడు ప్రేక్షకులంతా ఏం చేస్తారు? పాప్‌కార్న్‌, సమోసా లేదా స్నాక్స్‌ తింటూ... కూల్‌ డ్రింక్స్‌ తాగుతారు. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ కూడా ఇంటర్వెల్‌ తీసుకుంటోంది. కాదు... కాదు... కరోనా ఇచ్చింది. షూటింగులు చేసేటప్పుడు షెడ్యూల్స్‌ మధ్య చిన్నపాటి విరామం తీసుకోవడం సహజమే. కానీ  కరోనా వల్ల భారీ అంటే భారీ విరామం తీసుకోవలసి వస్తోంది. ఈలోపు మరో సినిమా పట్టాలు ఎక్కించి, పూర్తి చేసేస్తున్నారు కొందరు దర్శకులు-హీరోలు. కరోనా ఇంటర్వెల్‌లో కొత్త చిత్రాలు చేస్తున్నారు. వాళ్లు ఎవరో ఓ లుక్కేయండి!


కథానాయకులు, దర్శకులు, రచయితలు సినిమా సినిమాకు మధ్య విరామం తీసుకోవడం రివాజు. కానీ, సినిమా మధ్యలో ఉండగానే వాళ్లందరికీ బోల్డంత విరామాన్ని కరోనా కల్పించింది. దాంతో కథానాయకులు సేద తీరుతున్నారు... చిత్రీకరణలు చేసే పరిస్థితి లేదు కనుక! కొందరు దర్శక, రచయితలు కొత్త కథలు రాస్తున్నారు... ఇంట్లో ఉంటున్నారు కనుక! అతికొద్దిమంది దర్శక, రచయితలు విరామంలో చిన్న చిత్రాలకు చక్కటి కథలు రాయడమే కాదు... ఆ కథల్ని తెరకెక్కిస్తున్నారు. తెరకెక్కించినోళ్లు విడుదల చేస్తున్నారు. లేదంటే  విడుదలకు సిద్ధమవుతున్నారు. హీరోలూ అంతే... ఏదైనా సినిమా చిత్రీకరణకు ఎక్కువ రోజులు అవసరమయ్యేలా ఉంటే, మధ్యలోకి వేగంగా పూర్తయ్యే మరో సినిమాను తీసుకొస్తున్నారు. ఇలా  ఈ దర్శకులు, హీరోలు ప్రేక్షకులకు టచ్‌లో ఉండేలా చూసుకుంటున్నారు.


ఓటీటీ వేదికగా 2021-లాక్‌డౌన్‌లో విడుదలైన చిత్రం ‘ఏక్‌ మినీ కథ’. దీనికి దర్శకుడు మేర్లపాక గాంధీ కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే అందించారు. మరి, ఆయనే ఎందుకు దర్శకత్వం చేయలేదంటే? ‘మాస్ట్రో’ ఉంది కనుక! నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ప్రారంభమైన చిత్రమే ‘మాస్ట్రో’. కరోనా తొలి దశ వల్ల చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. ఆ విరామంలో ‘ఏక్‌ మినీ కథ’కు కథ, మాటలు రాసేశారు. కరోనా తగ్గితే ‘మాస్ట్రో’ చిత్రీకరణ పునఃప్రారంభించాలి కనుక శిష్యుడు చేతిలో కథ పెట్టి సినిమా తీయించారు. కరోనా రెండో దశలో చిత్రాన్ని విడుదల చేశారు కూడా! ఇప్పుడు మరో వినూత్న కథను ఆయన రాస్తున్నారట.... ‘ఏక్‌ మినీ కథ’ తరహాలో తీయడానికి!


వినోదాత్మక కథలు రాయడంలోనే కాదు... వాటిని తీయడంలోనూ దర్శకుడు మారుతిది ప్రత్యేక శైలి. చిన్న చిత్రాలతోనే  ఆయన ప్రయాణం ప్రారంభమైంది. తర్వాత వెంకటేశ్‌, నాని, శర్వానంద్‌, సాయితేజ్‌ వంటి స్టార్స్‌తో చిత్రాలు తీసే స్థాయికి చేరుకున్నారు. అలాగని, ఆయన చిన్న చిత్రాలను వదల్లేదు. వీలైనప్పుడు కథ, మాటలు... లేదంటే నిర్మాణంలో సహాయ సహకారాలు అందించడమో చేస్తున్నారు. సహజంగా వేగంగా చిత్రాలు తీసే మారుతికి ‘ప్రతిరోజూ పండగే’ విడుదలైన మూడు నెలలకు కరోనా తొలి దశ రావడంతో విరామం తప్పలేదు. ఆ దశను దాటి హీరో గోపీచంద్‌తో ‘పక్కా కమర్షియల్‌’ పట్టాలు ఎక్కిస్తే... ఈసారి రెండో దశ వచ్చింది. ఈ విరామంలో ఆయనో కథ రాయడమే కాదు... సంతోష్‌ శోభన్‌, మెహరీన్‌ జంటగా సెట్స్‌ మీదకు తీసుకువెళ్లారు. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందని తెలిసింది. మొత్తం చిత్రాన్ని 30 రోజుల్లో పూర్తి చేసి... ‘పక్కా కమర్షియల్‌’ చిత్రీకరణ పునఃప్రారంభించడానికి మారుతి సన్నాహాలు చేసుకున్నారట.


క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. భారీ తారాగణం, చారిత్రక కథతో రూపొందుతోంది. భారీ సెట్స్‌ వేశారు. సాఫీగా సాగుతున్న చిత్రీకరణకు కరోనా అంతరాయం కలిగించింది. మరోవైపు ‘వకీల్‌ సాబ్‌’తో పవన్‌ బిజీ బిజీ. అనుకోకుండా వచ్చిన ఈ  విరామంలో ‘కొండపొలం’ నవల ఆధారంగా పవన్‌ మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌, రకుల్‌ జంటగా ఓ సినిమా తెరకెక్కించారు క్రిష్‌. తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. సినిమా ఎప్పుడో సిద్ధమైంది. థియేటర్లలో విడుదల చేయడానికి వేచి చూస్తున్నారని తెలిసింది. వినోదం, వాణిజ్య హంగులు, సందేశం మేళవించిన ఈ సినిమా ప్రేక్షకులకు నవ్యానుభూతి పంచుతుందని చిత్రబృందం బలంగా నమ్ముతోంది. పవన్‌ కల్యాణ్‌ సైతం ‘హరిహర వీరమల్లు’ కంటే ముందు ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ రీమేక్‌ పూర్తి చేసేలా ఉన్నారు.


తెలుగులో అగ్ర కథానాయకులు ఎవరూ ఖాళీగా లేదు. ప్రతి ఒక్కరి దగ్గర దర్శకులు క్యూలో ఉన్నారు. ఓ సినిమా తర్వాత మరొకటి చేయడానికి హీరోలూ సిద్ధంగా ఉన్నారు. అందుకే, ప్రతి రెండు చిత్రాల మధ్య ఎక్కువ విరామం లేకుండా చూసుకోవాలని అల్లు అర్జున్‌, రామ్‌చరణ్‌ ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి రామ్‌చరణ్‌ నటిస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’. రాజమౌళి సినిమా అంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది. హీరోలు సైతం మరో సినిమా చేయకుండా అది పూర్తయ్యేవరకూ వేచి చూసిన రోజులున్నాయి. రామ్‌చరణ్‌ మాత్రం రాజమౌళి అనుమతితో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మధ్యలో ఉండగా... ‘ఆచార్య’లో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ఆయన పాత్ర నిడివి అతిథిలా కాకుండా ఎక్కువ సమయమే ఉంటుంది. కరోనా విరామాలు పరిశ్రమ పనులకు ఆటంకాలు కల్పించకుండా ఉండుంటే... ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే ముందుగా ‘ఆచార్య’తో రామ్‌చరణ్‌ థియేటర్లలోకి వచ్చేవారు. 


అల్లు అర్జున్‌ దగ్గరకు వస్తే... ‘పుష్ప’ రెండో భాగాలుగా  రూపొందుతున్న సంగతి తెలిసిందే. తొలి భాగం చిత్రీకరణ చాలావరకూ పూర్తయింది. రెండో భాగం చిత్రీకరణకు కాస్త సమయం పట్టేలా ఉండటంతో... ‘పుష్ప’ రెండు భాగాలకు మధ్యలోకి ‘ఐకాన్‌’ను తీసుకొచ్చారు. దర్శకుడు శ్రీరామ్‌ వేణు కథను ఎప్పుడో కంప్లీట్‌ చేశారు. ఆయనకు ‘వకీల్‌ సాబ్‌’, అల్లు అర్జున్‌కు ‘పుష్ప’ రావడంతో ఆ సినిమా వెనక్కు వెళ్లింది. ‘పుష్ప’ తొలి భాగం తర్వాత పట్టాలపైకి రానుంది. ‘సలార్‌’కు ముందు ఓ పౌరాణిక కథను ప్రభాస్‌కు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వినిపించారట. చిత్రీకరణకు రెండున్నరేళ్లు పడుతుందని చెప్పడంతో త్వరగా చేసే కథ ఏదైనా ఉంటే చెప్పమని అడగటంతో ‘సలార్‌’ చెప్పారట. తన 25వ చిత్రంగా ప్రశాంత్‌ నీల్‌ చెప్పిన మైథలాజికల్‌ కథను చేయాలని ప్రభాస్‌ అనుకుంటున్నట్టు ఫిల్మ్‌నగర్‌ వర్గాల కథనం. మరి, నిజమో? కాదో? రెండేళ్లు అయితేనే గానీ తెలియదు. ఇదండీ సంగతి! కరోనా ఇంటర్వెల్‌లో... చేస్తున్న సినిమాలను పక్కనపెట్టి మధ్యలో కొత్త సినిమాలు చేస్తున్న సినీ ప్రముఖుల కహానీ.