‘తలపుల తోవ’లో తీరని దాహం

ABN , First Publish Date - 2020-06-15T05:45:38+05:30 IST

కైఫీ అజ్మీ, షౌకత్‌ల పెళ్లి సందర్భంగా అప్పటి పార్టీ కోశాధికారి కామ్రేడ్‌ ఘాటే పెళ్ళి ఖర్చులకు వంద రూపాయిలిస్తూ ‘‘ఈ లైలా మజ్ఞూల నాటకం నాలుగు నెలల్లోనే ముగిసిపోదని హామీ ఏమిటి?’’ అన్నారట.

‘తలపుల తోవ’లో తీరని దాహం

కైఫీ అజ్మీ, షౌకత్‌ల పెళ్లి సందర్భంగా అప్పటి పార్టీ కోశాధికారి కామ్రేడ్‌ ఘాటే పెళ్ళి ఖర్చులకు వంద రూపాయిలిస్తూ ‘‘ఈ లైలా మజ్ఞూల నాటకం నాలుగు నెలల్లోనే ముగిసిపోదని హామీ ఏమిటి?’’ అన్నారట. అయిదున్నర దశాబ్దాల దీర్ఘ జీవితం అనంతరమూ ‘నా హృదయం ఇంకా నిండలేదు’ అని విచారిస్తారు షౌకత్‌. కైఫీ ఎప్పుడూ కూర్చునే కుర్చీలోని శూన్యాన్ని చూస్తూ ఒక అజరామర సాహచర్యపు లాలిత్యాన్ని ఇక నేనెన్నటికీ తాకలేనని దుఃఖిస్తారు. 


పొందికైన జీవితాన్ని వదిలి అభద్రతలోకి చేజారేం దుకు పొగరు కావాలి. సౌఖ్యాల పరదాలమాటు నుంచి కష్టాల్లోకి దూకేందుకు మొండి ధైర్యం కావాలి. ఒకరికొకరు కానుకగా సమర్పించుకోగల సమన్వయ సంయోజనీయ బంధం కావాలి. అన్నిటికీమించి ఎప్పటికీ వదలని ప్రేమ మత్తు కావాలి.


కైఫీ అజ్మీ ఉర్దూ కవితా ప్రపంచానికి పరిచయం అక్కరలేని పేరు. జమీందారీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినా అంతిమ శ్వాస వరకు కమ్యూనిస్టుగా జీవించిన వాడు. తాను నమ్మిన సిద్ధాంత విలువలను ఆచరించి అనుసరింప చేసినవాడు. సొంతంగానూ, సినిమాలకూ అత్యద్భుతమైన ప్రేమ కవిత్వాన్ని సృజించినవాడు.


‘యాద్‌ కే రాహ్‌ గుజార్‌’గా ఉర్దూలో ప్రచు రితమై ‘కైఫీ అండ్‌ ఐ’గా ఇంగ్లీష్‌లోకి అను వదింపబడిన షౌకత్‌ కైఫీ జ్ఞాపకాల దొంతర ‘తలపుల తోవ’గా ఎన్‌. వేణుగోపాల్‌ తెలుగు పాఠకులకు కానుకగా అందచేసారు. కైఫీ, షౌకత్‌ల ప్రేమమయ, ఆదర్శమయ, స్నేహ మయ జ్ఞాపకాల మల్లెమాల ఇది. తన జీవిత కాలపు మధుర జ్ఞాపకాల తలపోత ఇది.


నిజాం రాజ్యంలో ఉన్నత ఉద్యోగి కుమార్తెగా షౌకత్‌, ప్రసిద్ధ కవిగా ముషాయిరాలకు హైదరాబాద్‌ వచ్చిన వాడిగా కైఫీ మధ్య ప్రేమ చిగురించటం, ప్రేమ ప్రతిపాదనలు, అడ్డంకులు, ప్రేమలేఖలు, విహారాలు, విరహాలు ఇలా ఆ యవ్వన హృదయాలను గిలిగింతలు పెట్టి పులకింతకు గురిచేసి ఆమె హృదయాంత రంగంలో పదిలంగా దాగిన ఎన్నో జ్ఞాపకాలను ఆమె మృదువుగా వెలికితీసి మురిపెంగా మన ముందు పరిచిన ముచ్చటైన సంగతుల సమాహారమిది. ఇంకా అనేకం కలగలిసి ఏకాత్మగా వ్యక్తమైన అపురూప రచన ఇది.


కవిమాత్రుడితో తన కూతురు సుఖిస్తుం దన్న ఆశ లేశామాత్రంగానయినా లేకపో యినా ఆమె ఇష్టాన్ని గౌరవించి బొంబాయి తీసుకువెళ్ళి అక్కడి పరిస్థితులను స్వయంగా చూపించి పెళ్ళిచేసి వచ్చాడు షౌకత్‌ తండ్రి యాహ్యుఖాన్‌. తన హైదరాబాదీ బూర్జువా వాతావరణానికి భిన్నమైన చోటుకి ఒక్క ఉదుటన ఇష్టాపూర్వకంగానే మరలిన వనిత షౌకత్‌. ఎన్నో ఆశలతో ప్రపంచాన్ని ఊరిం చిన ఆదర్శనీయమైన ఉదాత్తమైన ఊహ కమ్యూనిజం.


ఆ ఆదర్శంతోనే దేశంలోని విభిన్న ప్రాంతాల నుండి సంస్కృతుల నుండి వచ్చినవారంతా ఒకచోట నివసించే ప్రాంతం ‘కమ్యూన్‌’. నవవధువుగా అక్కడ జీవితాన్ని మొదలుపెట్టిన షౌకత్‌ అభాగ్యులను తమ సొంతవారిలాగా భావించే అక్కడి మనుషుల వాత్సల్యం, లోకం పోకడకు భిన్నంగా ఉండే వారి స్వభావాలు, ప్రత్యేకంగా కనిపించే ఆ మానవీయ పరిమళం వీటన్నిటినీ షౌకత్‌ పూసగుచ్చారు. ఆ అద్భుతమైన మనస్తత్వాలు స్వాతంత్ర్యానంతరం కొట్టొచ్చినట్టుగా మారిపోయి ఆమెను కలవరపెట్టడాన్ని ఆమేమీ దాచుకో లేదు. అలాగే ‘ప్రజాకళ నినాదాలు ఇవ్వటానికి పరిమితం కావటం’ పట్ల ఆమెకు అభ్యంతరాలున్నాయి. కామ్రేడ్‌ రణదివె పట్ల ఆమెకు వ్యతిరేకత లేదు కానీ కామ్రేడ్‌ పి.సి జోషి పట్ల ఆమెకు గల గౌరవభావం ప్రత్యేకమైనది.


దాంపత్య జీవితపు తొలినాళ్ళనుండీ ఊగిసలాడుతూండే వారి సంసార నావను ముందుకు నడిపేందుకు ఆమె తనలో గల అన్ని శక్తులను వినియోగంలోనికి తీసుకువచ్చారు. రేడియో వ్యాఖ్యాతగా, గాయనిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సినిమా నటిగా, పృథ్వి థియేటర్‌, ఇండియన్‌ పీపుల్స్‌ ధియేటర్‌ అసోసియేషన్‌ (ఇఫ్టా)లలో నటిగా ఆమె పోషించిన పాత్రలు ప్రత్యేకమైనవి. దయార్ర్దుడైన పృథ్వీ రాజ్‌కపూర్‌ తన నటులకు ఎప్పుడూ చెప్తూండే ‘మీరు పోషిస్తున్న పాత్రలో సంపూర్ణంగా జీవించాలి. ఆ సమయానికి మీ గుండె విప్పి చూపినా మీరు నటిస్తున్న పాత్ర గుండె మాత్రమే కొట్టు ్టకోవాలి కానీ మీ గుండె కాదు’ అన్న మాట నటిగా షౌకత్‌పై చాలా ప్రభావం చూపింది. పృథ్వీ థియేటర్‌లో ఆమె గొప్ప పాత్రల్లో నటించే అవకాశం రానప్పటికీ అక్కడ ఉన్నప్పుడు నేర్చుకున్న మెళకువలు తనను నటిగా జీవితకాలం ప్రభావితం చేసినట్లు చెప్పుకున్నారు షౌకత్‌. 


బాల్యంలో తల్లిని కోల్పోయిన బిడ్డగా పృథ్వీ రాజ్‌ కపూర్‌లో తల్లి కోసం ఏర్పడిన వెలితి ఆయనను ఆర్ద్రత ఔదార్యమూ నిండిన మనిషిగా మలిచాయని చెబుతారు. పృథ్వీ థియేటర్లో ఆమె నేర్చుకున్న నటన తాలూకు పాఠాలు ఎంతో విలువైనవని అభిప్రాయ పడ్డారు. ఈ ప్రభావంతో ఆమె ఎంతగా ఆ పాత్రల్లో లీనమయ్యేవారంటే జీవితానికీ కళకూ మధ్య సరిహద్దు రేఖను ఆమె మసక బార్చేసేవారు. ఆమె పాత్రలో ఒదిగి పోవటం కాకుండా పాత్రగా మారిపోయేవారు, మితి మీరిన ఈ తాదాత్మ్యత ఆమె ఆరోగ్యంపై నేరుగా పడేంత. షౌకత్‌ను తన పాత్ర నుండి వేరుచెయ్యడానికి ఒక దర్శకుడు తన నాటకాన్నే రద్దు చేసుకోవలసి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

కైఫీ అజ్మీ - షౌకత్‌ల విలువలతో కూడిన జీవితం వారిరువురి సహచర్యాన్నే కాకుండా వారి పిల్లలనూ మానవీయత నిండిన మను షులుగా మార్చింది. ఎంతగా అంటే జాతీయ ఉత్తమ నటి షబానా అజ్మీ అత్యంత సౌక ర్యవంతమైన తారాపథం ఆమె ఉద్యమ జీవితానికి అడ్డుగా నిలవలేక పోయింది. అలాగే వారి కుమారుడు ప్రముఖ ఛాయా గ్రహకుడు బాబా అజ్మీ కూడా ఆచరణలో తండ్రివలె మెలిగినవాడే. ‘నేను అబ్బాలాగా పనిచేయలేకపోవచ్చు కానీ నాతో సంబంధం లోకి వచ్చిన మనుషుల పట్ల నేను ప్రే మగా ఉండగలిగితే మంచి చెడుల మధ్య విచక్షణ చూపగలిగితే అబ్బా వేసిన మార్గాన్ని అనుసరిస్తున్నాననే అనుకుంటాను’ అనటం అతని మానసిక ప్రపంచాన్ని తండ్రి ఎంతగా ప్రభావితం చేసారో తెలియజేస్తుంది.


కైఫీ సొంతూరు మిజ్వాన్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌).  గురించి షౌకత్‌ ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాఠశాలలేని ఆ గ్రామానికి తనకున్న పరిచయాల సాయంతో రైళ్ళు పరిగెత్తేలా చేసిన వాడిగా కైఫీ కృషి గురించి ఆమె చెప్పుకొచ్చారు. 


కైఫీ అజ్మీ, షౌకత్‌ల పెళ్లి సందర్భంగా అప్పటి పార్టీ కోశాధి కారి కామ్రేడ్‌ ఘాటే పెళ్ళిఖర్చులకు వంద రూపాయిలిస్తూ ‘‘ఈ లైలా మజ్ఞూల నాటకం నాలుగు నెలల్లోనే ముగిసిపోదని హామీ ఏమిటి?’’ అన్నారట. అయిదున్నర దశాబ్దాల దీర్ఘ జీవితం అనం తరమూ ‘నా హృదయం ఇంకా నిండలేదు’ అని విచారిస్తారు షౌకత్‌. కైఫీ ఎప్పుడూ కూర్చునే కుర్చీలోని శూన్యాన్ని చూస్తూ ఒక అజరామర సహచర్యపు లాలిత్యాన్ని ఇక నేనెన్నటికీ తాక లేనని దుఃఖిస్తారు. వారి ప్రణయమూ, పరిణయమూ, జీవన సారమూ... ఏళ్లకొద్దీ మగ్గిన అత్తరు వంటి ఈ గుభాళింపుల పరిమళాన్ని ఈ పుస్తకంలో ఆఘ్రాణించి మైమరిచిపోవచ్చు.


బి. భాస్కర్‌ జోగేష్‌

98666 02325

Updated Date - 2020-06-15T05:45:38+05:30 IST