Abn logo
May 8 2021 @ 00:19AM

మూడు కాళ్ల కుందేలు

లాక్‌డౌన్ ఉండనే ఉండదు అని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖచ్చితంగా చెప్పేశారు. లాక్‌డౌన్ వల్ల కలిగే కష్టనష్టాలను కూడా ఆయన చక్కగా వివరించారు. ఆరోగ్యమంత్రిత్వ శాఖను కూడా చేపట్టిన తరువాత కెసిఆర్ కొవిడ్ పరిస్థితిపై నిర్వహించిన తొలి సమీక్ష ఇది. సంబంధిత శాఖ అధికారులు, నిపుణులు అందరూ ఇచ్చిన సలహాలను విని, ఆయన ఆ నిర్ణయానికి వచ్చారో, లేక, తనకు బలంగా అనిపించింది కాబట్టి అదే సరైనది అనుకున్నారో బయటివారికి తెలిసే అవకాశం లేదు. జాతీయ లాక్‌డౌన్ తప్పేటట్టు లేదు అని శుక్రవారం నాడు ప్రధానమంత్రికి లేఖ రాసిన రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్ జనజీవనానికి నష్టం చేస్తుందని బలంగా భావించే నాయకులలో రాహుల్ కూడా ఒకరు.


భారతదేశంలో నూటికి ఎనభై ఐదు శాతం మందికి టీకా వేసేదాకా సమస్య పరిష్కారం కాదని, లాక్‌డౌన్ వంటి చర్యలు తీసుకుని వ్యాప్తి, టీకాల వేగాన్ని సమతుల్యం చేయాలని అమెరికా అధ్యక్షుడి వైద్యసలహాదారు కూడా సూచించారు. దేశరాజధానిలో ఏప్రిల్ 19 నుంచి లాక్‌డౌన్ అమలులో ఉన్నది. బిహార్, హర్యానా, కేరళ లాక్‌డౌన్‌లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో వారాంతపు లాక్‌డౌన్ అమలులో ఉన్నది. మహారాష్ట్రలో ప్రత్యేకమైన ఆంక్షలు, స్థానికమయిన లాక్‌డౌన్‌లు అమలులో ఉన్నాయి. కర్ణాటకలో హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలుచేయబోతున్నారు. పాక్షికమయిన ఆంక్షలు పెడితే ప్రజలు క్రమశిక్షణగా వ్యవహరించడం లేదని కర్ణాటక ముఖ్యమంత్రి ఎడ్యూరప్ప బహిరంగంగా విసుగు ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కొన్ని గంటలు మినహా రోజంతా లాక్‌డౌన్ విధించారు. మరి వీరందరికీ భిన్నమైన వైఖరి తీసుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రికి ప్రత్యేకమైన అవగాహన ఏమిటో తెలియదు. పోనీ, దానికి బదులుగా తాను చేయబోయే సృజన్మాతక కట్టడి పద్ధతులేవో ఆయన వివరించి ఉంటే బాగుండేది. మైక్రో కంటెయిన్మెంట్ అనే గత ఏడాది పద్ధతిని ఆయన పునరుద్ఘాటించారు. వ్యాప్తి అంతంత మాత్రంగా ఉన్నప్పుడే ఆ విధానం కఠినంగా అమలుచేయలేకపోయారు. ఇప్పుడు మైక్రో కంటెయిన్మెంట్ చేయాలంటే మొత్తం తెలంగాణకే తాళం వేయాలి. దానినే లాక్‌డౌన్ అంటారు కదా?


లాక్‌డౌన్ కోరుకోతగ్గది కాదు. స్థిరాదాయం, శాశ్వత ఉపాధి కలిగిన శ్రేణులకు అది విశ్రాంతిని, వెసులుబాటును ఇవ్వవచ్చు కానీ, చిరుద్యోగులను, పాక్షిక ఉద్యోగులను, కష్టజీవులను అది దారుణమైన స్థితిలోకి నెట్టివేస్తుంది. లాక్‌డౌన్ ఎటువంటి పర్యవసానాలకు కారణమవుతుందో గత ఏడాది చూశాము. తెలంగాణలో పనిచేస్తున్న ఇతర రాష్ట్రాల కార్మికులు ఎదుర్కొనే కష్టం గురించి కెసిఆర్ ప్రస్తావించారు కూడా. ఇదొక రకంగా ముందూ వెనుకా ప్రమాదమే ఉన్న స్థితి. కానీ, ఊహించని వేగంతో వ్యాధి వ్యాపిస్తూ, ఆస్పత్రులు, శ్మశానాలు కిటకిటలాడిపోతున్న పాడు కాలంలో, దేని కంటె ఏది ప్రధానం అనే అంతిమమైన ప్రశ్న వేసుకోవలసిందే. జనజీవితానికి మొత్తంగా తాళం వేసే నిర్ణయం అన్నిటి కంటె ఆఖరున పరిశీలించవలసింది. ఉన్నత న్యాయస్థానం సూచించిన వారాంతపు లాక్‌డౌన్ ప్రతిపాదనను ఆలోచించవచ్చును కదా? గత ఏడాది జాతీయ జనతాకర్ఫ్యూ పెట్టినప్పుడు, ఆ ఒక్కరోజుకే వైరస్ గొలుసు తెగిపోతుందని నాయకులు ఆశపెట్టారు. ప్రజలు నమ్మారు కూడా. వారాంతాలు ప్రజాజీవితాన్ని పరిమితం చేస్తే, జనం గుమిగూడే రద్దీలు, కార్యక్రమాలు ఆగిపోతాయి, వ్యాప్తి కూడా ఆ మేరకు తగ్గిపోతుంది కదా? ప్రభుత్వం కొవిడ్ అదుపునకు సమర్థంగా, లక్ష్యశుద్ధితో వ్యవహరించడం లేదని భావిస్తూ న్యాయస్థానాలు స్వయంగా నిర్దేశాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాయి. న్యాయస్థానం వైఖరి తెలంగాణ ముఖ్యమంత్రికి ఏమంత రుచించడం లేదేమో తెలియదు. కొవిడ్ ఉపద్రవం విషయంలో ప్రభుత్వాల తీరును విమర్శిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాలు ఒత్తిడి తేవడం తెలంగాణకే పరిమితం కాదు.


అనేక హైకోర్టుల్లో ఇటువంటి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి మొట్టికాయలు వేసింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలకు, ఆదేశాలకు కేంద్రప్రభుత్వమే బోనులో నిలబడుతుంటే, తప్పులు దిద్దుకోవడానికి రాష్ట్రప్రభుత్వాలకు ఏమిటి అభ్యంతరం? 

లాక్‌డౌన్ వల్ల కరోనా కేసులు తగ్గట్లేదు అన్నది కెసిఆర్ అభిప్రాయం. మహారాష్ట్ర అనుభవం భిన్నంగా ఉన్నది. కేరళ అనుభవమూ ప్రత్యేకంగా ఉన్నది. ఆంక్షలతో పాటు, సత్పరిపాలనను కూడా జోడించి తమిళనాడు విపత్తును అదుపులో ఉంచగలుగుతోంది. రెండో విడత కరోనా ఉప్పెన ఎట్లాగూ వచ్చింది. మూడోది రాబోతున్నదన్న ప్రమాద హెచ్చరికను వింటున్నాము. ఇప్పటికే ప్రభుత్వాలు చేతులు ఎత్తేస్తున్నాయి. ముందు జాగ్రత్త లేకపోతే, మూడో వెల్లువ మహా విపత్తుగా మారుతుంది. వైరస్ ఉత్పరివర్తనాలను నిరోధించాలంటే వ్యాప్తి నిరోధమే మార్గమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ ప్రమాదాలను నిరోధించాలంటే, తప్పనిసరిగా మానవ సంచారాన్ని, కార్యకలాపాలను అదుపు చేయడం అవసరం. పూర్తి లాక్‌డౌన్ సంగతి పక్కనపెడదాం, మాల్స్, హోటళ్లు, పబ్బులు, సినిమా హాళ్లు అవసరమా? మద్యం అత్యవసర సర్వీసు అనుకుందాం, దుకాణాల దగ్గర తగిన భౌతిక దూరం ఉండేట్టు నియంత్రణ చేయవచ్చును. అత్యవసరం అయితే తప్ప, బయటకు వెళ్లడాన్ని తగ్గించే ఆంక్షలతో కట్టడిని మొదలుపెట్టవచ్చు. 


చేయిదాటిపోతే ఏమి చేయగలరు? వ్యాధి సోకినవారి సంఖ్యను, మరణించేవారి సంఖ్యను సౌకర్యవంతంగా పరిమితం చేసి చూపడం ఎల్లకాలం సాధ్యం కాదు. పరీక్షలు రద్దుచేస్తే విద్యార్థులకు నష్టం అన్న వాదనతో ఆంధ్రప్రదేశ్ పరీక్షల సంగతి నాన్చుతూ ఉంది. కేంద్రంతో సహా, అనేక రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయం వెనుక ఏదో ఒక విచక్షణ ఉంటుంది కదా? తమ తమ ప్రత్యేకతలను ప్రదర్శించడానికి, అహంభావాలను తృప్తిపరచుకోవడానికి రాష్ట్రాల నేతలు ఇట్లా ఉలిపికట్టె విధానాలను ప్రకటిస్తారు కాబోలు. 


ఢిల్లీకి ముందుచూపు లోపించినందుకు దుష్ఫలితాలను అనుభవిస్తున్నాము. రాష్ట్రాలు తాము సొంతంగా కొత్త తప్పులు చేయకుండా ఉండడం శ్రేయస్కరం. వివిధ రంగాల పెద్దలను, నిపుణులను సంప్రదించి తక్కువ నష్టం, ఎక్కువ ప్రయోజనం ఉండే నిర్ణయాలు తీసుకోవాలి. పంతాలకు పోవడం వల్ల నష్టం తప్ప ఉపయోగం లేదు.

Advertisement