ఏకాగ్రతే ఏకైక మార్గం

ABN , First Publish Date - 2021-07-02T05:30:00+05:30 IST

‘‘జ్ఞానాలన్నిటి సారం ఏకాగ్రతే. అది లేకపోతే ఏదీ చెయ్యడం సాధ్యం కాదు. సాధారణ మానవులు తమ శక్తిలో తొంభై శాతాన్ని వృఽథా చేస్తున్నారు. దీనివల్ల అదే పనిగా వారు తప్పులు చేస్తూ ఉంటారు. సుశిక్షితుడైన....

ఏకాగ్రతే ఏకైక మార్గం

4న వివేకానంద వర్థంతి


‘‘జ్ఞానాలన్నిటి సారం ఏకాగ్రతే. అది లేకపోతే ఏదీ చెయ్యడం సాధ్యం కాదు. సాధారణ మానవులు తమ శక్తిలో తొంభై శాతాన్ని వృఽథా చేస్తున్నారు. దీనివల్ల అదే పనిగా వారు తప్పులు చేస్తూ ఉంటారు. సుశిక్షితుడైన మనిషి తప్పు చేయడు. అతని ఆలోచనలూ తప్పు చేయవు. కాబట్టి ఏకాగ్రత అత్యంత ఆవశ్యకం’’ అంటారు

స్వామి వివేకానంద


‘‘మనిషికి ఏకాగ్రతతో ఉండే శక్తి ఉంది. మనిషికీ, జంతువుకూ అదే తేడా. అలాగే, ఒక వ్యక్తికీ, మరొక వ్యక్తికీ ఏకాగ్రతా శక్తిలో ఉండే తేడాయే మనుషుల మధ్య ఉండే తేడా. మానవుడి మేథో శక్తికి పరిమితులన్నవి లేనే లేవు. అతను ఎంత ఏకాగ్రత కనబరిస్తే ఆ శక్తిని అంత గొప్పగా వినియోగించుకోగలడు. అదే రహస్యం’’ అంటూ విజయ సూక్ష్మాన్ని వివేకకానందుడు విప్పి చెప్పారు. ఆయనది అపారమైన ఏకాగ్రత.


అమెరికాలోని షికాగోలో స్వామి వివేకానంద చేసిన ప్రసంగం జగత్ప్రసిద్ధం. షికాగోలో ఉన్నప్పుడు... వాహ్యాళి కోసం ఆయన ఒక చెరువు దగ్గరకు వెళ్ళారు. అక్కడ కొంతమంది పిల్లలు ఒక ఎయిర్‌గన్‌తో... నదిలో తేలుతున్న కోడిగుడ్డు గుల్లలను పేల్చడానికి ప్రయాస పడుతున్నారు. నీటి కెరటాల మీద అటూ ఇటూ ఆ గుల్లలు దొర్లుతూ ఉండడంతో... వాటిని షూట్‌ చెయ్యడం ఆ పిల్లలకు సాధ్యం కావడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా వాళ్ళు వాటిని కొట్టలేకపోతున్నారు. ఈ ఆటనంతటినీ వివేకానందుడు ఆసక్తిగా చూస్తున్నారు.ఆయనను గమనించిన పిల్లల్లో ఒకరు ‘‘మీరు చాలా సేపటి నుంచీ ఇదంతా చూస్తున్నారు. మీరు ప్రయత్నిస్తారా?’’ అని అడిగారు.


వివేకానందుడు నవ్వుతూ అలాగే అన్నారు. 

‘‘ఇది అంత సులువేం కాదు’’ అన్నారు పిల్లలు. 


‘‘సరే చూద్దాం’’ అంటూ ఆయన ఎయిర్‌గన్‌ను అందుకున్నారు. కోడిగుడ్డు గుల్లలను గురి చూశారు. లక్ష్యాన్ని కొద్దిసేపు గమనించారు. తరువాత పన్నెండుసార్లు తుపాకీని పేల్చారు. ఒక విడతకు ఒక గుడ్డు గుల్ల చొప్పున పేల్చేశారు.


పిల్లలు ఆశ్చర్యపోయారు. ఇదెలా జరిగిందనేది వారికి అంతుపట్టలేదు. ‘‘మీరిదంతా ఎలా చేశారు? మీకు షూటింగ్‌ బాగా తెలుసు కదూ?’’ అని అడిగారు.

‘‘లేదు. నేనెప్పుడూ షూటింగ్‌ అభ్యాసం చెయ్యలేదు’’ అన్నారాయన.

‘‘మరి ఇంత చక్కగా, ఒక్కసారి కూడా గురి తప్పకుండా ఎలా షూట్‌ చేశారు?’’ అని అడిగారు పిల్లలు.


‘‘ఆ రహస్యం ఏమిటో చెబుతాను వినండి. మీరు ఏపని చేసినా, మీ దృష్టంతా దానిమీదే ఉంచాలి. మరేదీ ఆలోచించకూడదు. మీరు దేన్నైనా గురి చూసి కొట్టాలనుకుంటే... మీ ఆలోచన లక్ష్యం మీద మాత్రమే ఉండాలి. అప్పుడు మీ గురి తప్పదు. అదే ‘ఏకాగ్రత’ అంటే! ఏకాగ్రత అద్భుతాలు చేస్తుంది. మీరు చదువుకుంటున్నప్పుడు... పాఠం గురించి మాత్రమే ఆలోచించండి. అప్పుడు మీరు చదివింది మీ మనసులో సులభంగా నాటుకుపోతుంది. మా దేశంలో పిల్లలకు ఇలాగే చెయ్యాలని బోధిస్తూ ఉంటాం’’ అన్నారు వివేకానందుడు.


‘‘దేన్నయినా లక్ష్యంగా ఎంచుకున్నప్పుడు... అది తప్ప మరి దేన్నీ ఆలోచనల్లోకి రానివ్వకపోవడమే ఏకాగ్రత. ఏదైనా అంశం మీద చిత్తాన్ని ఏకాగ్రతతో నిలిపి కృషి చెయ్యకపోతే దాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. ఇహలోకానికి సంబంధించిన విజ్ఞానమైనా, పరలోకానికి పనికొచ్చే విజ్ఞాన మైనా... దాన్ని సంపాదించే ఏకైక మార్గం మనసును ఏకాగ్రంగా ఉంచుకోవడమే!’’ అని తన ప్రసంగాలతోనే కాదు, జీవనం ద్వారా కూడా వివేకానందుడు సందేశం 

ఇచ్చారు.

Updated Date - 2021-07-02T05:30:00+05:30 IST