కళ తప్పిన ‘వస్త్రం’

ABN , First Publish Date - 2021-05-17T05:37:55+05:30 IST

రాయలసీమలోనే హోల్‌ సేల్‌ వస్త్ర వ్యాపారానికి తలమానికంగా నిలిచిన వస్త్రనగరి ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఈ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.

కళ తప్పిన ‘వస్త్రం’
ప్రొద్దుటూరులోని వస్త్ర భారతి లో వ్యాపారం లేక వెలవెల బోతున్న దుకాణాలు

కరోనా, కర్ఫ్యూతో 20 శాతం కూడా జరగని కొనుగోళ్లు

పండగలు, పెళ్లి గిరాకీలు నిల్‌

భారమవుతున్న సిబ్బంది జీతాలు, అద్దెలు, విద్యుత్‌ చార్జీలు


జిల్లాలో కొవిడ్‌ కేసుల పెరుగుదల వ్వాపార రంగంపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ముఖ్యంగా వస్త్ర వ్యాపారం కుదేలైంది. గతంలో నిత్యం కోట్లాది రూపాయల అమ్మకాలు జరిగితే ఇపుడు అందులో 20 శాతం కూడా జరగడం లేదు. వైరస్‌ కట్టడికి వ్వాపారుల వైపు నుంచి జాగ్రత్తలు తీసుకున్నా వినియోగదారులు మాత్రం భయంతో కొనుగోళ్లకు రావడం లేదు. గతేడాది కూడా కరోనా కారణంగా సీజన్‌లోనే దుకాణాలు మూసేయాల్సి వచ్చింది. ఈసారి అలాంటి పరిస్థితే తలెత్తడంతో వ్వాపారులు ఆందోళనకు గురవుతున్నారు.


ప్రొద్దుటూరు (అర్బన్‌), మే 16: రాయలసీమలోనే హోల్‌ సేల్‌ వస్త్ర వ్యాపారానికి తలమానికంగా నిలిచిన వస్త్రనగరి ప్రొద్దుటూరుతో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఈ వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది. గత ఏడాది లాక్‌డౌన్‌తో భారీగా నష్టపోయిన వస్త్ర వ్యాపారం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సమయంలో కరోనా సెంకడ్‌ వేవ్‌ విళయతాండవంతో వ్యాపారాలు కుదేలవుతున్నాయి.


రూ.5 కోట్ల వ్యాపారం రూ.కోటికి దిగజారింది 

ప్రొద్దుటూరు పట్టణంలో హోల్‌సేల్‌ వస్త్ర దుకాణాలతో పాటు రీటైల్‌ వస్త్ర దుకాణాల్లో రోజుకు దాదాపు రూ.5 కోట్ల మేర జరిగే వ్యాపారం ప్రస్తుతం రూ.కోటికి దిగజారింది. వస్త్ర భారతి, వివేకానంద లాంటి హోల్‌సేల్‌ క్లాత్‌ మార్కెట్‌లతో పాటు బాలాజీ, నందిని, న్యూవస్త్రభారతి లాంటి రీటైల్‌ క్లాత్‌ మార్కెట్లు ఉన్నాయి. వీటితో పాటు రీటైల్‌ రంగంలో రెడిమేడ్‌ వస్త్ర దుకాణాలు కోనేటికాల్వ వీధి, రాజబాటవీధి, శివాలయంవీధి, శ్రీరాములపేట, హోమస్‌ పేట, గాంధీరోడ్డు, కొర్రపాడురోడ్డులలో వందలాదిగా ఉన్నాయి. వీటన్నింటిలో 5 నుంచి 6వేల మంది సిబ్బంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. వీటి మీద ఆధారపడి మరో రెండు వేల మంది పరోక్షంగా పనిచేస్తున్నారు. ఇవికాక పట్టణంలోని ఇళ్లలో నిర్వహించే దుకాణాలు మరో 500 వరకు ఉన్నాయి.


పండుగలు, పెళ్లిళ్ల గిరాకీలు నిల్‌

గత ఏడాది లాక్‌డౌన్‌ ఎత్తివేసాక వచ్చిన దసరా, దీపావళి క్రిస్‌మస్‌లలో కొంత మేర వ్యాపారాలు, పెళ్లిళ్ల గిరాకీలు ఉండటంతో 50 నుంచి 60 శాతం వరకు కొనుగోళ్లు జరిగాయి. దీంతో సిబ్బంది జీతాలు అద్దెలు చెల్లించే పరిస్థితి ఉండేదని వ్యాపారులు తెలిపారు. ఈ ఏడాది జనవరి నూతన సంవత్సరం, సంక్రాంతికి పెద్దగా వ్యాపారాలు లేవు. అయినా ఉగాది, రంజాన్‌ పండుగలకు పెట్టుబడులు పెట్టి కొత్త సరుకు కొనుగోళ్లు చేసినా ఉగాదికి 40 శాతం వ్యాపారం మాత్రమే జరిగింది. రంజాన్‌ వచ్చేసరికి తిరిగి కర్ఫ్యూ వచ్చింది.  సాధారణంగా ముహూర్తాలు ఉండే సీజన్‌లో వస్త్ర వ్యాపారాలు జోరుగా సాగుతాయి. ప్రస్తుతం మే నెలలో 13వ తేదీ నుంచి శుభ ముహూర్తాలు ఉండడం, 14న రంజాన్‌ కావడంతో దుస్తుల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. అయితే కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో దుకాణాలు కళావిహీనంగా కనిపిస్తున్నాయి. కర్ఫ్యూ కారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే జనసంచారానికి, దుకాణాలకు అనుమతి ఉంది. ఆ సమయంలో దుకాణాలు తెరిచినా కొనుగోలుదారులు పెద్దగా రావడం లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చివరికి 20 శాతం కూడా వ్యాపారాలు లేక పెట్టుబడులకు వడ్డీలు, దుకాణాలకు అద్దెలు, సిబ్బందికి జీతాలు, విద్యుత్‌ చార్జీలు చెల్లించలేని పరిస్థితి వచ్చిందని వ్యాపారులు ఆవేదన చెందుతున్నారు.


సెకండ్‌వేవ్‌ ఎన్ని నెలలు దెబ్బతీస్తుందో..

- జింకా లక్ష్మీనారాయణ, రిటైల్‌ క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌  కార్యదర్శి

కరోనా మొదటి దశ కంటే సెకండ్‌వేవ్‌ చాలా భయానకంగా ఉంది. ఇది ఎన్ని నెలలు వ్యాపారాలను దెబ్బతీస్తుందో.. ప్రభుత్వాలు మనుషుల ప్రాణాలు కాపాడటంలోనే తలమునకలౌతుంటే వ్యాపార వర్గాల కష్టాలను అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌లు కర్ఫ్యూలతో గతంలోని దుర్భర, భయానక పరిస్థితులు రాకుండా చూడాలి. 


ప్రభుత్వాల నుంచి సహకారం లేదు

- బొర్రా రామాంజనేయులు, వివేకానంద క్లాత్‌ మర్చంట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు 

కరోనా సెకండ్‌వేవ్‌ మానవాళికి పెద్ద విపత్తే. ప్రాణాలు కాపాడుకోవడమే ప్రస్తుత పరిస్థితిలో అందరికీ ముఖ్యం. కర్ఫ్యూలు, లాక్‌డౌన్‌లతో అన్నిరంగాలు తీవ్రంగా దెబ్బతినడం గతంలో మనం చూశాం. వ్యాపారాలు నిలిచిపోతే పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వాలు పన్నుల మినహాయింపు ఇచ్చి సహకరించటంలేదు.

Updated Date - 2021-05-17T05:37:55+05:30 IST