Abn logo
Aug 30 2021 @ 00:31AM

ఆరుద్ర అధ్యయన వైవిధ్యం

ఒకసారి చెన్నై బ్రౌను వసంతోత్సవాల పేరిట సి.పి. బ్రౌన్‌ సాహిత్య సభలు జరిగాయి. ప్రత్యేక ప్రత్యేక అంశాలపై దిగ్ధంతుల ఉపన్యాసాలు. ఆరుద్ర అధ్యక్షత వహిస్తూ, ‘‘నేను ప్రత్యేకంగా దేనిపైనా మాట్లాడను. కానీ ఒక్కొక్క వక్త మాట్లాడాకా ఆయన ఎంచుకున్న అంశంపై ఆయన చెప్పని అంశాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను,’’ అన్నారు. అన్నట్లే మహానుభావులు చెప్పినవాటిని పునశ్చరణ చేయకుండా కొత్త అంశాలు చెప్పి విభ్రాంతికి గురి చేశారు. 


ఒకసారి చెన్నపురిలోని ఆరుద్రగారింటికి వెళ్ళి కాసేపు కూర్చున్నాక ‘అయ్యా మీరు చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి’ అంటే- ‘‘అది ఇంటర్నేషనల్‌ న్యుమిస్మాటిక్‌ సొసైటీ జర్నల్‌ (అంటే అంతర్జాతీయ నాణ్య శాస్త్ర సంఘ పత్రిక) అందులో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అంటారు కదా. ఆ స్వర్ణయుగంలో వేసిన బంగారు నాణాలకు బంగారం ఎక్కడ లభించింది అనేదానిపై వ్యాసం వచ్చింది. అది చదువుతున్నా’’ అన్నారు. ఆశ్చర్యమేసింది. 


కొన్నాళ్ళు రాజమండ్రి అసలు పేరు రాజమహేంద్రియా రాజ మహేంద్రవరమా అని తీక్షణంగా రచనలూ ప్రసంగాలూ సాగాయి. ఆరుద్ర ఆంధ్రజ్యోతిలో వ్యాస పీఠంలో ‘స్థలనామ పరిశోధక సంఘాల ఆవశ్యకత’ అని విస్తృత పరిధిలో వ్యాసం రాస్తూ ‘రాజమహేంద్రి’ని సమర్థించారు. ‘ఆంధ్ర కేసరి’ సినిమాలో ‘‘వేదంలా ఘోషించే గోదావరి అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి’’ అంటూ సినిమా గీతంలో నగరనామాన్ని ప్రయోగించారు. ఆ కాల సందర్భంలో నేను మదరాసు వెళ్ళినప్పుడు ఆయన్ని దర్శించుకొన్నాను. ‘‘మన రాజమహేంద్ర పండితులేమంటున్నారు?’’ అని అడిగారు. నేను ఒక చిన్న జ్ఞాన జిజ్ఞాసువును. ‘‘ఆ పండితులనే దానిలో ఒకటి ఆసక్తికరమైన ప్రశ్న వుందండి. భాషాపరంగా రాజమహేంద్రి నుంచి రాజమండ్రి పదం రావటం అలావుంచి అసలు ‘రాజ మహేంద్రి’ అనే పేరు లోగడ ఏ కవైనా వాడారా? ఎవ్వరూ వాడలేదు. ఆరుద్రగారు ఏం చెబుతారు దీనికి?’’ అంటున్నారండీ అన్నాను. పరిశోధక బ్రహ్మరాక్షసుడారుద్ర. ‘‘శర్మగారూ! మీరు కన్నెమరా గ్రంథాలయానికి వెళ్లి ఫలానా కవి (పేరు చెప్పారు, గుర్తు లేదు) రాసిన కృష్ణ శతకం చూడండి. దానిలో మొదటి పద్యాలలోనే ‘రాజమహేంద్రి’ పేరు వాడిన పద్యాన్ని రాసుకెళ్ళండి’’ అన్నారు. కన్నెమెరాకి వెళ్ళి దానిని రాసుకున్నాను. 


అధ్యయనం, జ్ఞాపకశక్తి, సందర్భ స్ఫూర్తి ఆరుద్ర లక్షణాలు. ‘‘మీకు తెలిసే వుంటుంది,’’ అంటూ ఎదుటివారికి తెలియనివి చెప్పడంలో ఆరుద్ర సౌజన్యాన్ని గమనించినప్పుడు ఆనందం కలిగేది. 


నా బ్రౌను ఉదాహరణ కావ్యాన్ని చెన్నైలో ఆరుద్రకి అంకిత మిచ్చిన సందర్భంలో నేను, ‘వెలుతురు పిట్ట’ల కవి కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, మరి నలుగురైదుగురు మిత్రులూ ఆరుద్ర గారింటికి ఉదయాన్నే వెళ్ళి కాసేపు మాట్లాడుకున్నాం. ఆ సందర్భంలో సాహిత్య విషయాలు ముచ్చటిస్తూ ‘ఉదాహరణ’ కావ్య రచనా విశేషాలు ఎలాగుండాలో చెబుతూ ‘‘సార్వవిభక్తికం’’ రాయడం శక్తి చిహ్నంగా భావించేవారంటూ ఒకసారి నాకేసి సార్థకంగా చూశారు. తరువాత కొత్తపల్లి నన్నడిగారు ‘‘మీకేసే ప్రత్యేకం చూశారేమిటి?’’ అని. ‘‘సార్వవిభక్తికం నేను బ్రౌను ఉదాహరణంలో రాయలేదు. ఆయన బాణీలో నాకు తెలియజేశారండి’’ అన్నాను. ఆప్తులుగా, మేనమామగా దగ్గర చుట్టమై, ఆప్తమిత్రుడయినా ప్రేరణ కలిగించినవాడయినా శ్రీశ్రీయే అని ఆరుద్ర అనేవారు. తనకుముందు సాహిత్య చరిత్ర రచనలో కందుకూరి, మానవిల్లి, వేటూరి, చిలుకూరి, కొమర్రాజు, మల్లంపల్లి, సురవరం వహించిన మహనీయ సేవలను తన అధ్యయనంలో స్ఫూర్తిగా గ్రహించారు. రోణంకి, శ్రీశ్రీ, చాసో, పురిపండా వంటివారి సాహిత్య ప్రేరణలనూ ఉటంకించేవారు. ప్రయోగశీల కవిగా, సినీ కవిగా, పరిశోధకునిగా సుప్రసిద్ధుడైనా ఆరుద్ర సంగీతం, నృత్యం వంటి కళల జ్ఞానిగా పారీణుడయ్యారు. చదరంగం, ఇంద్రజాలం వంటి విద్యల్లో కూడా ప్రసిద్ధుల్నే అబ్బురపరిచేవారు. ఇన్నిటా ఎలా ప్రవీణుడయ్యారు? నిరంతర అధ్యయనం వల్లనే. 


ఒకసారి రాజమండ్రిలో మా ఇంట పెళ్ళి విందుకు వచ్చినప్పుడు బయటి టెంటులో ఉదయం వేళ ఆరుద్ర, మధునాపంతుల, శరభయ్య మేస్టారులతో మూడు గంటల పాటు సాహిత్య చారిత్రక చర్చలు తీక్షణంగా జరిపారు. లోపల సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. నేను ఆరుద్ర గారి వద్దకు వచ్చి వ్రతం అయిపోతుంది. తరువాత భోజనాలే అని సౌజన్య వాక్యాలు అనగా- ఆరుద్రగారు పురోహితు డప్పుడు చదువుతున్న శ్లోకాలు చదివి ‘‘ఈ శ్లోకాలు చదువుతున్నారంటే వ్రతం ఆరంభంలో ఉంది. మేం ఇక్కడ సాహిత్య విందులో ఉన్నాం. భోజనాలకి కంగారు పడకండి’’ అన్నారు. సత్యనారాయణ వ్రత శ్లోకాలు కూడా ఆరుద్రకు వచ్చా ఆని ఆశ్చర్యపోయాం. ‘‘ఎంత చదువుకున్నాడయ్యా ఆరుద్ర! ప్రాచీన-ఆధునిక అని అస్తమానూ గీతలు పెట్టుకుంటే ఇలా హాయిగా చర్చలు సాగుతాయా’’ అన్నారు తరువాత శరభయ్యగారు. మధునాపంతుల వారైతే, ‘‘సూర్యరాయాంధ్ర నిఘంటు పండితుడిగా చేసిన నాకు ఆరుద్ర కొత్త సంగతులు చెప్పారు. ఎంత వ్యాకరణం వచ్చో ఆయనకు’’ అని ఆశ్చర్యపోయారు. 


‘ఆరుద్ర సాహిత్య పక్షోత్సవాలు’ పేరిట ఆయన గ్రంథాలపై ఉభయ గోదావరి జిల్లాల్లో చర్చలు సమావేశాలు ఏర్పరిచాము. అది ఆరుద్ర సప్తతి ప్రవేశోత్సవం. 1994లో జరిగింది. ఆగస్టు 31న ఆయనకు సన్మానం. కృతజ్ఞతగా ఆరుద్ర ‘అదే పదివేలు’ శీర్షికతో కొన్ని కూనలమ్మ పదాలు రాశారు (మేము పదివేల రూపాయలతో మాత్రమే సన్మానించడం జరిగింది). అందులో చివరి పదం:

‘‘తొలుత వల్లించారు

పిదప జల్లించారు

కడకు దీవించారు - ఓ కూనలమ్మా’’

అంటే మొదట ఆయా సభల్లో ఆయన కవిత్వ పఠనం జరిగింది. తరువాత సవిమర్శ ఉపన్యాసాలు సాగాయి. చివరకు అభినందించారు. కానీ ఆయన రాజమండ్రి సాహిత్యపు పెద్దరికాన్ని గౌరవిస్తూ ‘దీవించారు’ అని వాడారు సంస్కారం పరిమళించగా. 


ఆయన తంజావూరు, మేలటూరు, శాలియ మంగళం వంటి ప్రదేశాలలోని భాగవత మేళా నాట్య నాటకాలపై పరిశోధనలు చేశారు. అమెరికాలో స్ర్పింగ్‌ ఫీల్డులో అక్కడి పిల్లలకు దీపావళి పండుగ గురించి ఉపన్యసించారు. మార్క్సిజమ్‌ చదివితే అన్నిటి పట్లా అవగాహన పెరుగుతుందని ఉపన్యాసాలలో చెప్పేవారు. 


ఆయన ప్రపంచ సంస్కృతిని బాగా అధ్యయనం చేశారు. భారతీయ సంస్కృతిని బాగా అధ్యయనం చేశారు. భారతీయ సంస్కృతిలో ప్రత్యేక తెలుగు సంస్కృతిని వెల్లడించేవారు. 1925 ఆగస్టు 31న విశాఖపట్నంలో జన్మించిన ఆరుద్ర 1998 జూన్‌ 4న ఉదయం చెన్నపురిలో కన్నుమూశారు. ఆయన కీర్తిభవనంలో ‘సమగ్రాంధ్ర సాహిత్యం’ ఒక చెక్కు చెదరని మణికాంతుల స్తంభం. ఆయన అధ్యయన వైవిధ్యానికి అది ఒక ప్రతిబింబం. 

(రేపు ఆరుద్ర జయంతి)

సన్నిధానం నరసింహశర్మ

92920 55531


ప్రత్యేకంమరిన్ని...