బీజేపీకి ఆయన కొత్త... మా కార్యపద్ధతి తెలియదు : అరుణ్ సింగ్

ABN , First Publish Date - 2021-06-18T01:54:35+05:30 IST

సీఎం యడియూరప్పపై సొంత పార్టీ ఎమ్మె్ల్సీ విశ్వనాథ్ చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీ వ్యవహారాల రాష్ట్ర

బీజేపీకి ఆయన కొత్త... మా కార్యపద్ధతి తెలియదు : అరుణ్ సింగ్

బెంగళూరు : సీఎం యడియూరప్పపై సొంత పార్టీ ఎమ్మె్ల్సీ విశ్వనాథ్ చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జీ అరుణ్ సింగ్ ఘాటుగా హెచ్చరించారు. అసంతృప్తులందరి అభిప్రాయాలను తాము తెలుసుకున్నామని పేర్కొన్నారు. పార్టీకి నష్టం కలిగించే ఎలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయవద్దని తేల్చి చెప్పారు. ఇక ఎమ్మెల్సీ విశ్వనాథ్ అభిప్రాయాలను కూడా తాము పరిగణనలోకి తీసుకున్నామని అన్నారు. అయితే ఆయన బీజేపీకి కొత్త అని, బీజేపీ కార్య పద్ధతి, సంస్కృతి గురించి పూర్తిగా అవగాహన లేదని, వాటిని పరిగణనలోకి తీసుకోవాలని అరుణ్ సింగ్ పేర్కొన్నారు. 


పార్టీలో అసమ్మతి గురించి తెలుసుకునేందుకు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో అరుణ్ సింగ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విశ్వనాథ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలుగొట్టారు. యడియూరప్ప సారథ్యాన్ని తాము గౌరవిస్తామని, అయితే వయసు, ఆరోగ్య సమస్యల కారణంగా ప్రభుత్వాన్ని నడిపేంత బలం, స్పిరిట్ ఆయనకు లేవని తెగేసి చెప్పారు. అరుణ్ సింగ్‌తో సమావేశం అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ.. యడియూర్ప ప్రభుత్వంపై మంత్రులందరూ అసంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. రాజవంశపాలన చాలా ప్రమాదకరమని ప్రధాని మోదీ తరచూ చెబుతూ ఉంటారని, కానీ కర్ణాటకలో ఇప్పుడు అదే జరుగుతోందని అన్నారు. కర్ణాటక బీజేపీ మోదీని మర్చిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్న ప్రజల అభిప్రాయాన్ని అరుణ్ సింగ్‌తో చెప్పానని విశ్వనాథ్ పేర్కొన్నారు.

Updated Date - 2021-06-18T01:54:35+05:30 IST